డిల్లీ స్కామ్‌ కంటే ఏపీ లిక్కర్ స్కామ్ పది రెట్లు పెద్దది

డిల్లీ స్కామ్‌ కంటే ఏపీ లిక్కర్ స్కామ్ పది రెట్లు పెద్దది

డిల్లీ మద్యం కుంభకోణం కంటే ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన లిక్కర్‌ స్కాం పది రెట్లు పెద్దదని అనకాపల్లి బిజెపి ఎంపీ సీఎం రమేశ్‌ జీరో అవర్‌లో లోక్‌సభ దృష్టికి తెచ్చారు. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన లిక్కర్‌ స్కామ్‌పై విచారణ జరపాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

2019 – 24 మధ్య ఏపీలో మద్యం విధానం మార్చి కుంభకోణానికి పాల్పడ్డారని విమర్శించారు. మద్యం అంశంపై లోక్‌సభ జీరోఅవర్‌లో ప్రస్తావించిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, వైఎస్సార్సీపీ హయాంలో డిల్లీని మించిన లిక్కర్ స్కామ్‌ జరిగిందని పేర్కొన్నారు. డిల్లీ లిక్కర్ స్కామ్‌తో పోలిస్తే జగన్ స్కామ్‌ పది రెట్లు పెద్దదని ఆయన ఆరోపించారు.

2019-24 మధ్య ఏపీలో మద్యం విధానం మార్చారన్న సీఎం రమేశ్‌, మద్యాన్ని ప్రైవేట్ షాపుల నుంచి ప్రభుత్వ దుకాణాలకు అప్పగించారని గుర్తు చేశారు. ఐదేళ్లలో రూ.లక్ష కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయని తెలిపారు. ఐదేళ్లపాటు మద్యం లావాదేవీలు నగదుతోనే జరిగాయని చెప్పారు. షాపుల సిబ్బందిని సైతం ఒప్పంద పద్ధతిలోనే నియమించారని పేర్కొన్నారు. రూ.2,500 కోట్ల డిల్లీ లిక్కర్ స్కామ్‌ కంటే ఏపీలో పది రెట్లు పెద్ద స్కామ్ అని ఆరోపించారు.
 
మరోవంక,  ఢిల్లీ లిక్కర్ స్కాం 2 వేల కోట్లు అయితే ఏపీ లిక్కర్ స్కాం 20 వేల కోట్లు అని టీడీపీ ఎంపీ సానా సతీష్ రాజ్యసభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన కోరారు. విచారణలో అన్ని తేలుతాయని స్పష్టం చేశారు.