పార్లమెంటులో ఆరు కొత్త భాషలకు అనువాద సేవలు

పార్లమెంటులో ఆరు కొత్త భాషలకు అనువాద సేవలు

బోడో, డోగ్రీ, మైథిలి, మణిపురి, ఉర్దూ, సంస్కృతంతో సహా ఆరు కొత్త భాషలకు అనువాద సేవలను పొడిగిస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా మంగళవారం ప్రకటించారు. ప్రస్తుతం హిందీ, ఇంగ్లీషుతోపాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు వంటి ఈ పది భాషల్లో అనువాద సేవలు పార్లమెంటులో అందుబాటులో ఉన్నాయి.

వీటితోపాటుగా తాజాగా మరో కొత్త ఆరు భాషలు బోడో, డోగ్రీ, మైథిలీ, మణిపురి, ఉర్దూ, సంస్కృతంలను అనువాద సేవల్లోకి చేర్చినట్లు ఆయన పేర్కొన్నారు. మానవ వనరులు అందుబాటులోకి వచ్చినందున అదనంగా 16 భాషలను ఏకకాలంలో అనువాదాలను అందించడానికి తాము ప్రయత్నిస్తున్నామని స్పీకర్‌ ఈ సందర్భంగా చెప్పారు.

కాగా, ‘భారత పార్లమెంట్‌ వ్యవస్థ అనేది ప్రజాస్వామ్యం ఆధారంగా ఉంటుంది. అందువల్ల చాలా భాషలలో అనువాదాలను అందించే అవకాశం ఉంది. భారతదేశంలో 22 భాషల్లో ఈ ప్రయత్నం చేస్తున్నామని నేను ప్రపంచస్థాయి వేదికలపై మాట్లాడినప్పుడు అందరూ నన్ను ప్రశంసించారు. అధికారికంగా గుర్తింపు పొందిన 22 భాషల ఉనికిని కాపాడడమే లక్ష్యంగా పెట్టుకున్నామని’ స్పీకర్‌ చెప్పారు. 

అయితే స్పీకర్‌ ప్రకటనపై డిఎంకె ఎంపి దయానిధి మారన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘2011 సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా కేవలం 73 వేల మందే సంస్కృతం మాట్లాడుతున్నారు. మీ ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాల వల్ల పన్ను చెల్లింపుదారుల సొమ్మును ఎందుకు వృథా చేస్తారు?’ అని మారన్‌ వాదించారు. 

మారన్‌ వ్యాఖ్యలపై లోక్‌సభ స్పీకర్‌  అభ్యంతరం వ్యక్తం చేస్తూ మీరు ఏ దేశంలో నివశిస్తున్నారు అని తిరిగి ప్రశ్నించారు. ఇది భారతదేశం. ఈ దేశం మూల భాష సంస్కృతం. అందుకే మేము సంస్కృతం మాత్రమే కాకుండా 22 భాషలను ప్రస్తావించాము. ఇన్ని భాషలతో కాకుండా మీకు కేవలం సంస్కృతంతోనే ఎందుకు సమస్య వచ్చింది? అని స్పీకర్‌ మారన్‌ని ప్రశ్నించారు.