సైబర్ నేరాలపై ఆర్‌బిఐ ప్రత్యేకంగా బ్యాంక్‌.ఇన్‌ డొమైన్‌

సైబర్ నేరాలపై ఆర్‌బిఐ ప్రత్యేకంగా బ్యాంక్‌.ఇన్‌ డొమైన్‌

దేశంలో రోజు రోజుకు అడ్డగోలుగా పెరుగుతోన్న సైబర్‌ మోసాలను నియంత్రించడంపై ఆర్‌బిఐ దృష్టి పెట్టింది. బ్యాంకుల కోసం ప్రత్యేకంగా బ్యాంక్‌.ఇన్‌ డొమైన్‌ను తీసుకురానున్నట్లు శుక్రవారం ప్రకటించింది. అదే విధంగా నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థల కోసం ఫిన్‌.ఇన్‌ డొమైన్‌ను కేటాయించనున్నట్లు తెలిపింది. 

దీని ద్వారా అసలైన బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలను గుర్తించడం చాలా సులభం అవుతుందని వెల్లడించింది. 2025 ఏప్రిల్‌ నుంచి బ్యాంక్‌.ఇన్‌ రిజిస్టేషన్లు ప్రారంభం అవుతాయని ఆర్‌బిఐ గవర్నర్‌ సంజరు మల్హోత్రా తెలిపారు. సైబర్‌ మోసగాళ్లు నకీలీ బ్యాంక్‌ లింకులు పంపించి క్షణాల్లో ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఏది అసలైన బ్యాంక్‌ లింకో, ఏది నకిలీదో తెలుసుకోవడం కష్టతరంగా మారింది. 

వీటన్నింటిని అరికట్టేందుకు ప్రత్యేకంగా బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థల కోసమే ప్రత్యేక డొమైన్లను తీసుకొస్తున్నట్లు మల్హోత్రా తెలిపారు. ఈ డొమైన్లతో అసలు బ్యాంకు లింక్స్‌ ఏవో సులభంగా గుర్తించవచ్చన్నారు. డిజిటల్‌ చెల్లింపుల్లో మోసాలు పెరుగుతున్న క్రమంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలపై నమ్మకాన్ని పెంచే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మల్హోత్రా తెలిపారు. 

దీనికి ఇన్స్‌ట్యూట్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీ దీనికి రిజిస్ట్రార్‌గా వ్యవహరించనుందని పేర్కొన్నారు. అదే విధంగా దేశంలో జారీ అయిన కార్డుల ద్వారా ఇతర దేశాల్లో జరిగే లావాదేవీలకు అడిషనల్‌ ఫ్యాక్టర్‌ ఆఫ్‌ అథంటికేషన్‌ను జోడించనున్నటు మల్హోత్ర తెలిపారు. ఇతర దేశాల్లో వ్యాపారస్తుడు ఉన్నప్పుడు సురక్షిత లావాదేవీలు నిర్వహించాలన్న ఉద్దేశంతో దీన్ని అందుబాటులోకి తెస్తోన్నామని చెప్పారు. 

త్వరలోనే పూర్తి వివరాలతో కూడిన ముసాయిదాను విడుదల చేస్తామని తెలిపారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం తొలి ఆరు మాసాల్లోనే దేశంలో సైబర్‌ నేరాలు 27 శాతం పెరిగి 18,461 కేసులుగా నమోదయ్యాయి. ఈ ఆర్ధిక మోసాల విలువ రూ.21,367 కోట్లుగా ఉంది. ఏడాది క్రితం ఇదే సమయంలోని రూ.2,623 కోట్ల విలువ చేసే మోసాలతో పోల్చితే, సైబర్‌ ఆర్ధిక వంచనలు ఎనిమిది రెట్లు పెరిగాయి.