
ప్రైవేటు ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చే అధికారం ప్రభుత్వానికిగానీ, అధికారులకుగానీ లేదని, దీనికి సంబంధించి చట్టం స్పష్టంగా ఉందని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఎ కింద అనుసరించాల్సిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రైవేటు ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చలేరని, మార్గదర్శకాలకు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాలు చెల్లుబాటు కావని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలో 128 ఎకరాలను విక్రయించడానికిగాను ధరణి వెబ్ పోర్టల్లో స్లాట్ బుకింగ్కు అవకాశం లేకుండా నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ బాచుపల్లికి చెందిన వెంకటసుబ్బయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సి.వి.భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది కటిక రవీందర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ సాదా బైనామా కింద కొనుగోలు చేశారని,1992లో చట్టప్రకారం క్రమబద్ధీకరించుకున్నారని దీనికి సంబంధించి పట్టా కూడా జారీ అయిందని పేర్కొన్నారు. పెట్టుబడి రాయితీ కింద్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహకాలు కూడా పొందారని తెలిపారు.
ఈ భూమిని విక్రయించడానికిగాను రిజిస్ట్రేషన్ ఫీజు తదితరాలు ఈ – చలానా కింద రూ. 30 లక్షలకు పైగా చెల్లించి విక్రయం కోసం స్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే బ్లాక్ చేశారని చెప్పారు. జుల్ఫికర్ అలీఖాన్ అనే వ్యక్తి ఇచ్చిన వినతి పత్రం ఆధారంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భూపరిపాలన ప్రధాన కమిషనర్ రిజిస్ట్రేషన్ కాకుండా ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు.
సర్వే నెం 132, 133లో సాదాబైనామా కింద కొనుగోలు చేశాడని సీసీఎల్ఏకు చెప్పడంతో ఎలాంటి నోటీసు ఇవ్వకండా రిజిస్ట్రేషను నిలిపివేయాలని ఆదేశాలు ఇవ్వడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. రిజిస్ట్రేషన్లు నిలిపిసే అధికారం సీపీఎల్ఏకు లేదని తెలిపారు.
సెక్షన్ 22ఎ జాబితాలో ఉండటంగానీ లేదంటే కోర్టు ఉత్తర్వులుంటే తప్ప రిజిస్ట్రేషన్ ను అడ్డుకోరాదని స్పష్టం చేశారు. ఇరువైపుల వాదనలను విన్న న్యాయమూర్తి ప్రైవేటు పట్టా భూములను రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఎ కింద నిషేధిత జాబితాలో చేర్చే అధికారం ప్రభుత్వానికి, అధికారులకు లేదని చట్టం స్పష్టంగా చెబుతోందని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22ఎలో పేర్కొన్న పరిధిలోని అంశాల్లోకి వస్తే తప్ప ప్రభుత్వానికి, అధికారులకు ప్రైవేట్ ఆస్తులుకు నిషేదిత జాబితాలో చేర్చే అధికారంలేదని స్పష్టం చేశారు.
More Stories
బిజెపిపై విషం కక్కడమే వారి అజెండా!
యూట్యూబర్ సన్నీ యాదవ్ కు పోలీసులు లుక్ఔట్ నోలీసులు
బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన హైదరాబాద్ మెట్రో!