సోనియాగాంధీపై సభాహక్కుల ఉల్లంఘన నోటీస్

సోనియాగాంధీపై సభాహక్కుల ఉల్లంఘన నోటీస్
కాంగ్రెస్ సీనియర్ నేత సోనియాగాంధీపై బీజేపీ ఎంపీలు సోమవారంనాడు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము జనవరి 31న పార్లమెంటు సంయుక్త సమావేశంలో చేసిన ప్రసంగంపై సోనియాగాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని అందులో పేర్కొన్నారు. “రాష్ట్రపతికి వ్యతిరేకంగా రాజ్యసభ ఎంపీ సోనియాగాంధీ చేసిన కొన్ని వ్యాఖ్యలు రాష్ట్రపతి స్థాయి, ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ అంశానికి ఉన్న తీవ్రతను పరిగణనలోకి తీసుకుని ఆమెపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి” అని బీజేపీ ఎంపీలు రాజ్యసభ చైర్మన్‌కు విన్నవించారు. 
 
సోనియాగాంధీ వ్యాఖ్యలు గిరిజన వ్యతిరేక భావజాలంతో కూడుకున్నాయని ఎంపీలు ఆరోపించారు. పార్లమెంటు పవిత్రత, నిబంధనల పరిరక్షణకు, ప్రజాస్వామ్య సంస్థలు సమర్ధవంతంగా పనిచేసేందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని రాజ్యసభ చైర్మన్‌ను కోరారు.
 
  సోనియా గాంధీ ప్రకటన అవమానకరమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని సభ్యులను ఆదేశించే ప్రవర్తనా నియమాలు, పార్లమెంటరీ సంప్రదాయాలు, మర్యాదలకు విరుద్ధంగా ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. “మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నత శాసనసభ అయిన పార్లమెంట్, రాజ్యాంగ అధికారుల పట్ల మర్యాద, సముచితత, గౌరవాన్ని కాపాడుకునే బాధ్యతను కలిగి ఉంది. ప్రమాణాల నుండి ఏదైనా విచలనం సంస్థ ప్రతిష్టను తగ్గిస్తుంది. భారత పౌరులు దానిపై ఉంచిన నమ్మకాన్ని దెబ్బతీస్తుంది” అని కూడా తెలిపారు. 
 
“ఈ సమస్య యొక్క తీవ్రత దృష్ట్యా, ఈ విషయాన్ని గ్రహించి సోనియా గాంధీపై తగిన క్రమశిక్షణా చర్య తీసుకోవాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము. పార్లమెంటరీ నియమాల పవిత్రతను నిలబెట్టడానికి మాత్రమే కాకుండా, మన ప్రజాస్వామ్య సంస్థల ప్రభావవంతమైన పనితీరుకు పునాది అయిన మర్యాద, పరస్పర గౌరవం అనే సూత్రాలను బలోపేతం చేయడానికి కూడా ఇటువంటి చర్య తప్పనిసరి” అని ఎంపీలు పేర్కొన్నారు.

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ప్రారంభిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి సుమారు గంట సేపు ప్రసంగించారు. సమావేశానంతరం మీడియాతో సోనియాగాంధీ మాట్లాడుతూ, ప్రసంగం చివరికి వచ్చేసరికి రాష్ట్రపతి బాగా అలిసిపోయారని, మాట్లాడలేకపోయారని, ‘పూర్ థింగ్’ అని ఆమె వ్యాఖ్యానించారు. 

దీనిపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రపతి కార్యాలయం సైతం కాంగ్రెస్ అగ్రనేతల వ్యాఖ్యలను కొట్టివేసింది. రాష్ట్రపతి ఎలాంటి అలసట లేకుండా ప్రసంగించినట్టు తెలిపింది. అయితే, సోనియాగాంధీ వ్యాఖ్యలను బీజేపీ, కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయని, ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ ఆమె వాడిన పదబంధాన్ని తప్పుగా అర్థం చేసుకుని అనవసర రాద్ధాంతం చేస్తున్నారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వివరణ ఇచ్చారు.

ప్రధాని నరేంద్ర మోదీ సహితం సోనియా వాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఓ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ గిరిజన కుటుంభం నుండి వచ్చి అద్భుతంగా ప్రసంగించిన రాష్ట్రపతిని రాజకుటుంబం అవమానించిందని విమర్శించారు. ఈ పదజాలం కాంగ్రెస్ పేదవర్గాల వ్యతిరేక భావజాలాన్ని వెల్లడిస్తోందని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా మండిపడ్డారు.