అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రధాని మోదీ ఫోన్‌

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రధాని మోదీ ఫోన్‌
* ఫిబ్రవరిలో  వైట్‌హౌస్‌కు ప్రదాని మోదీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కు ప్రధాని నరేంద్రమోదీ సోమవారం ఫోన్‌ చేశారు. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వారం రోజులకు మోదీ ఆయనకు ఫోన్‌ చేశారు. వరుసగా రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌కు అభినందనలు తెలియజేశారు. ‘చరిత్రాత్మకంగా రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ప్రియ మిత్రుడికి అభినందనలు’ అని మోదీ ట్వీట్‌ కూడా చేశారు.
 
‘అమెరికా అధ్యక్షుడైన నా ప్రియమిత్రుడు ట్రంప్‌తో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. చరిత్రాత్మకంగా రెండోసారి అధ్యక్షుడైన ఆయనను అభినందిస్తున్నా. పరస్పరం రెండు దేశాల ప్రయోజనాల కోసం కలిసి పనిచేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ప్రపంచ శాంతి, సామరస్యం, భద్రత, ప్రజల సంక్షేమం కోసం మేం కలిసి పనిచేస్తాం’ అని మోదీ తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో పేర్కొన్నారు.
 
అంతేకాకుండా భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ట్రంప్‌- మోదీ చర్చించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత డొనాల్డ్ ట్రంప్‌తో గతంలో ప్రధాని మోదీ ఫోన్‌ కాల్‌ మాట్లాడి అభినందనలు తెలియజేశారు. ఆ తర్వాత తాజాగా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత మరోసారి ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్ లో అక్రమ వలసదారులపై చర్చించినట్లు ట్రంప్ ప్రకటించారు. అక్రమ వలసదారులను వెనక్కి తీసుకునే విషయంలో భారత్ సరైన నిర్ణయం తీసుకుంటుందని ట్రంప్‌ చెప్పినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. అదే సమయంలో అమెరికా-తయారు చేసిన రక్షణ పరికరాల కొనుగోలును భారత్ పెంచాలని, మరింత సమతుల్య వాణిజ్య సంబంధాల వైపు వెళ్లవలసిన అవసరాన్ని అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోదీకి గుర్తు చేశారని పేర్కొంది.

 
మరోవైపు ఫిబ్రవరిలో ప్రదాని మోదీ వైట్‌హౌస్‌కు వచ్చి తనతో సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నట్లు ట్రంప్ వెల్లడించారు. మోదీతో చాలాసేపు మాట్లాడానని, ఆయన వచ్చే నెలలో, బహుశా ఫిబ్రవరిలో వైట్ హౌస్‌కి రాబోతున్నాడని ట్రంప్ తెలిపారు. భారత్‌తో తమకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయని ఎయిర్‌ఫోర్స్ వన్‌లో విలేకరులతో ట్రంప్ అన్నట్లు రాయిటర్స్ వెల్లడించింది.

ఇక సరైన పత్రాలు లేకుండా అమెరికాకు వలస వెళ్లే తమ దేశ పౌరులను చట్టబద్ధంగా తిరిగి తమ దేశానికి తీసుకువచ్చేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే భారత్‌ స్పష్టం చేసింది. మరోవైపు వీసా తీసుకునేందుకు 400 రోజులు ఎదురుచూడటం అనేది చాలా కీలకమైన అంశమని విదేశాంగ శాఖ పేర్కొంది.  
 
అది రెండు దేశాల సంబంధాలపై ప్రభావం చూపడంతో పాటు.. వాణిజ్యం, పర్యాటక రంగం, ద్వైపాక్షిక ప్రయోజనాలు కూడా దెబ్బతింటాయని ఇటీవలె విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ట్రంప్-మోదీ ఫోన్ కాల్ మాట్లాడుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.