
ప్రపంచంలో చాలా చోట్ల మహిళల సమానత్వం అనేది సుదూరమైన ఆదర్శంగా ఉన్న కాలంలోనే భారత మహిళలు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారని రాష్ట్రపతి చెప్పారు. పాలనలో నిలకడను పెంపొందించడం, విధాన స్తంభనను అడ్డుకోవడం, వనరుల మళ్లింపును నివారించడం, దేశంపై ఆర్థిక భారాలను తగ్గించడం ద్వారా దేశంలో ‘సుపరిపాలన’ను పునర్నిర్వచించే అవకాశం దానికి ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ‘దశాబ్దాలుగా దేశాన్ని పట్టి పీడించిన వలసవాద మనస్తత్వం ఆనవాళ్లను అంతం చేసేందుకు‘ ప్రభుత్వం సాగిస్తున్న కృషి గురించి ప్రధానంగా ప్రస్తావించారు. బ్రిటిష్ కాలం నాటి నేర చట్టాల స్థానే మూడు కొత్త ఆధునిక చట్టాలు ప్రవేశపెట్టడాన్ని ఆమె ఈ సందర్భంగా ఉటంకించారు. ‘ఆ మనస్తత్వాన్ని మార్చేందుకు సంఘటితంగా జరుగుతున్న యత్నాలను మనం చూస్తున్నాం. అటువంటి భారీ సంస్కరణలకు పట్టుదలతో కూడిన కృషి అవసరం’ అని ఆమె చెప్పారు.
దేశవ్యాప్తంగా ఎన్నికల కార్యక్రమాల సమ్మిళితం లక్షంగా ఉన్న ప్రతిపాదిత బిల్లు ప్రాముఖ్యాన్ని ముర్ము నొక్కిచెబుతూ, ‘ఒక దేశం ఒకే ఎన్నిక ప్లాన్ ఇతోధిక పాలన, కుదించిన ఆర్థిక భారం సహా ఎన్నో ప్రయోజనాలను సమకూరుస్తుంది’ అని తెలిపారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష అభినియం ప్రవేశపెట్టడాన్ని ఆమె ప్రస్తావించారు.
కేవలం శిక్ష విధించడం కన్నా న్యాయం చేకూర్చడానికి, మహిళలు, పిల్లలపై నేరాల కట్టడికి గట్టి ప్రాధాన్యం ఇవ్వడానికి అవి ప్రాథమ్యం ఇస్తాయని ఆమె సూచించారు. రాజ్యాంగం ప్రాముఖ్యాన్ని ఉద్ఘాటించిన రాష్ట్రపతి గడచిన 75 ఏళ్లలో సాధించిన పురోగతిని ప్రస్తావించారు. ‘స్వాతంత్య్రం సిద్ధించిన సమయంలో దేశంలో అనేక ప్రాంతాలు తీవ్ర దారిద్య్రం, ఆకలితో అలమటించాయి. అయితే, మనం ఆత్మ విశ్వాసంతో వ్యవహరించి వృద్ధికి పరిస్థితులు సృష్టించుకున్నాం’ అని ఆమె చెప్పారు
రైతులు, కూలీల సేవలను ఆమె ప్రస్తావిస్తూ, భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక సరళుల్లో కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. ఈ పరివర్తన మూలాలు రాజ్యాంగం ఏర్పాటు చేసిన వ్యవస్థలో ఉన్నాయని ఆమె నొక్కిచెప్పారు. ఇటీవలి సంవత్సరాల్లో కొనసాగుతున్న అధిక ఆర్థిక వృద్ధి రేటు గురించి కూడా రాష్ట్రపతి ప్రస్తావించి, అది ఉద్యోగావకాశాలు కల్పించిందని, రైతులకు, కూలీలకు ఆదాయాన్ని పెంచిందని, అనేక మందిని దారిద్య్రం నుంచి బయటకు తెచ్చిందని తెలియజేశారు.
బడుగు వర్గాల, ముఖ్యంగా ఎస్‌సిలు, ఎస్‌టిలు, ఒబిసిలకు చెందినవారికి అండగా నిలిచేందుకు జరుగుతున్న కృషిని కూడా ముర్ము వక్కాణించారు, సమ్మిళిత వృద్ధి, దేశంలో పాలన ప్రమాణాల పునర్నిర్వచించడం, పౌరులు అందరికీ మరింత సమాన, సౌభాగ్య భవిష్యత్ కల్పన పట్ల ప్రభుత్వ నిబద్ధతను రాష్ట్రపతి ప్రసంగం ప్రధానంగా ప్రస్తావించింది.
ఈ సందర్భం పౌరులు అందరి ఆనందాన్ని, గర్వాన్ని కలసి వేడుకగా జరుపుకునేదిగా ఆమె పేర్కొన్నారు. ఒక దేశ జీవితంలో 75 ఏళ్లు స్వల్ప మాత్రమే కావచ్చు కానీ భారత్‌కు అది చెప్పుకోదగిన కాలం అని ముర్ము అన్నారు. భారత చారిత్రక ప్రస్థానాన్ని ఆమె తిరిగి ప్రతిబింబిస్తూ, దేశ స్వేచ్ఛ కోసం తమ ప్రాణాలు త్యాగం చేసిన సాహస యోధులను గుర్తు ఉంచుకోవలసిందిగా పౌరులకు విజ్ఞప్తి చేశారు.
ఆమె ఈ సందర్భంగా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి గురించి ప్రస్తావిస్తూ, స్వాతంత్య్రోద్యమానికి ఆయన చేసిన కృషి ఇప్పుడు సముచిత గుర్తింపు పొందుతోందని చెప్పారు. పకడ్బందీగా సాగిన స్వాతంత్య్రోద్యమంలో దేశాన్ని సంఘటితపరచిన 20వ శతాబ్దపు సమరయోధులను రాష్ట్రపతి శ్లాఘించారు.
భారత్ తన ప్రజాస్వామిక విలువలను తిరిగి కనుగొనడంలో తోడ్పడినందుకు మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్. బాబా సాహెబ్ అంబేద్కర్ వంటి దిగ్గజాలకు ఆ ఖ్యాతి దక్కుతుందని ముర్ము తెలిపారు. రాజ్యాంగ సభ సమ్మిళిత స్వభావాన్ని ముర్ము నొక్కిచెబుతూ, 15 మంది మహిళా సభ్యులతో సహా దేశవ్యాప్తంగా వివిధ వర్గాలకు అది ప్రాతినిధ్యం వహించిందని, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ రూపకల్పనలో వారు కీలక పాత్ర పోషించారని తెలిపారు.
More Stories
‘మోహన్‌లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
ట్రంప్ వీసా రుసుం పెంపుపై భారత్ అత్యవసర నంబర్!
ఆర్థిక మాంద్యం ముప్పు దిశగా అమెరికా