
వైసీపీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లుగా ట్విట్టర్ (ఎక్స్) ద్వారా కీలకమైన ప్రకటన చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి శనివారం రాజీనామా చేస్తానని తెలిపారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని తెలిపారు. ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని స్పష్టం చేశారు. వేరే పదవులు, ప్రయోజనాలు, డబ్బు ఆశించి రాజీనామా చేయడం లేదని తెలిపారు.
రాజకీయాలకు గుడ్‌బై చెప్పే నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని విజయసాయి రెడ్డి తెలిపారు. తనపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని, తనను ఎవరూ ప్రభావితం చేయలేదని పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా తనను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటానని చెప్పారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్‌కు, తనను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్లిన భారతమ్మకు సదా కృతజ్ఞుడిని అని తెలిపారు. జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా అని ఆకాంక్షించారు.
పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్‌గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశానని విజయసాయి రెడ్డి తెలిపారు. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశానని పేర్కొన్నారు. దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగు రాష్ట్రాల్లో తనకు గుర్తింపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి, హోంమంత్రి అమిత్ షాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
టీడీపీతో రాజకీయంగా విభేదించానని విజయసాయి రెడ్డి తెలిపారు. అయితే చంద్రబాబు నాయుడు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్‌తో చిరకాల స్నేహం ఉందని తెలిపారు. తన భవిష్యత్తు వ్యవసాయం చేసుకోవడమే అని పేర్కొన్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన రాష్ట్ర ప్రజలకు, మిత్రులకు, సహచరులకు, పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
More Stories
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్
నాయీ బ్రాహ్మణుల సమస్యలు పరిష్కారం బిజెపి థ్యేయం
అన్నమయ్య జిల్లాకు పీఎం ధన ధాన్య కృషి యోజనలో చోటు