
దేశంలోనే తెలంగాణ సుసంపన్నమైన రాష్ట్రమని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. శుక్రవారం కరీంనగర్ మున్సిపాల్టీలో నిరంతర మంచినీటి పథకంతో పాటు పలు అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రారంభించారు.
ఎన్నో పోరాటాలకు, నిత్య చైతన్యాలకు, ఎందరో త్యాగాలకు పురిటి గడ్డ కరీంనగర్ నేల అని, ఇక్కడి ప్రజలు నిత్యం ఉత్సహంగా కనిపిస్తున్నారని పేర్కొన్నారు. తెలుగులో ప్రసంగిస్తూ ఆయన కరీంనగర్ ప్రజలను ఆకట్టుకున్నారు.
కరీంనగర్ అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని కేంద్రం హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్పారు. కరీంనగర్ లో నాలుగు వేల ఇళ్లకు నిరంతరాయంగా 24 గంటలపాటు నీళ్లందించడం గర్వకారణమని చెబుతూ కరీంనగర్ సిటీ మొత్తానికి 24 గంటలపాటు తాగునీళ్లందించేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుండి సాయం చేయాలని కోరారు.
కరీంనగర్ లో డంపింగ్ యార్డు సమస్య నుండి ప్రజలకు విముక్తి కల్పించాలని, స్మార్ట్ సిటీ నిధులను దారి మళ్లిస్తే కొట్లాడి సాధించినట్లు చెప్పారు. వేములవాడ రాజన్న ఆలయం, అలాగే కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాలను రామాయణ్ సర్క్యూట్ లో చేర్చి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. సిరిసిల్ల, వంగర ప్రాంతాల్లో నవోదయ స్కూల్ ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
More Stories
అక్కినేని నాగేశ్వరరావుకు ప్రధాని మోదీ ఘన నివాళి
ప్రైవేటు ఆస్తుల్ని నిషేధిత జాబితాలో చేర్చే అధికారం
హైదరాబాద్ లో పురుషాంగం పునఃసృష్టి