
జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో అంతుచిక్కని వ్యాధి ప్రబలుతున్నది. దీంతో గత కొన్ని రోజుల నుంచి ఆ రహస్య వ్యాధి వల్ల సుమారు 17 మంది మరణించారు. బదాల్ గ్రామంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్రం స్టడీ చేస్తున్నది. అయితే ఆ అజ్ఞాత శత్రువు ఆనవాళ్లను గుర్తించే పనిలో ప్రభుత్వం ఉంది.
మృతులతో కాంటాక్టులోకి వచ్చిన సుమారు 300 మందిని క్వారెంటైన్ చేశారు. రాజౌరీలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వాళ్లను క్వారెంటైన్ చేశారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కనిపించని శత్రువుతో యుద్ధం జరుగుతున్నట్లు స్థానిక డాక్టర్లు తెలిపారు.
బుధాల్ గ్రామానికి చెందిన 200 మందిని రాజౌరీ జిల్లాలోని క్వారంటైన్ సెంటర్స్‌కు తరలించినట్లు జమ్ముకాశ్మీర్ యంత్రాంగం శుక్రవారం తెలిపింది. ప్రస్తుతం బుధాల్ గ్రామానికి చెందిన ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని రాజౌరీ ప్రభుత్వ వైద్య కళాశాల (జిఎంసి) ప్రిన్సిపల్ డా.ఎ.ఎస్.భాటియా తెలిపారు. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు అధునాతన సాంకేతికతతో కూడిన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
సంక్షోభాన్ని ఎదుర్కొనే రీతిలో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభావిత ప్రాంతాన్ని మాస్క్ లేకుండా విజిట్ చేశానని, తనకు ఎటువంటి అనారోగ్యం కలగలేదని డాక్టర్ భాటియా స్పష్టం చేశారు. వైరల్, బ్యాక్టీరియా, ప్రోటోజోవా, జూనాటిక్ సంక్రమణలు జరగడంలేదని చెప్పారు.
స్థానికులు ఎవరూ ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. మృతుల శరీరాల్లో కాడ్మియం ఆనవాళ్లు ఉన్నట్లు ప్రాథమిక అంచనా ద్వారా తెలుస్తోందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. లక్నోలోని టాక్సికాలజీ ఇన్స్‌టిట్యూట్ నిర్వహించిన పరీక్షల్లో మృతుల శరీరాల్లో కాడ్మియం ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు.
అయితే వారి శరీరాల్లోకి కాడ్మియం మూలకం ఎలా ఎంటరైందన్న కోణంలో విచారణ సాగుతోందని తెలిపారు. కాడ్మియం చాలా విషపూరితమైన ఖనిజం. ఒకవేళ దాన్ని కడుపులోకి తీసుకున్నా లేక పీల్చినా దాని వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయి. కలుషిత గాలి, ఆహారం, నీటి వల్ల కాడ్మియం శరీరంలోకి వచ్చే అవకాశం ఉన్నది.
మరోవైపు మరణాల నిగ్గుతేల్చేందుకు అధికారులు ఆ గ్రామాన్ని కంటైన్‌మెంట్ జోన్గా ప్రకటించారు. ఇకపై గ్రామంలో ఎలాంటి ప్రభుత్వ, ప్రైవేటు సమావేశాలు జరపకూడదని నిషేధాజ్ఞలు జారీ చేశారు. గ్రామాన్ని మూడు కంటైన్‌మెంట్ జోన్‌లుగా విభజించారు. మరణాలు సంభవించిన కుటుంబాలను కంటైన్‌మెంట్ జోన్ 1లో పెట్టారు. బాధిత కుటుంబాల నివాసాలకు సీల్ వేశారు.
బాధిత కుటుంబాల సన్నిహితులుగా గుర్తించిన కుటుంబాలకు చెందిన వ్యక్తుల నివాసాలను కంటైన్‌మెంట్ జోన్-2లో చేర్చారు. వీరి ఆరోగ్య పరిస్థితులను వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. గ్రామంలో మిగిలిన నివాసాలను కంటైన్‌మెంట్ జోన్-3గా ప్రకటించి ఇక్కడి ప్రజలు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారనే అంశంపై ఆరా తీస్తున్నారు.
బాధిత కుటుంబాలు, వారి సన్నిహితులు అధికారులు అందించే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని, వారి ఇళ్లలో ఉన్న ఇతర పదార్థాలను వినియోగించకూడదని హెచ్చరికలు జారీ చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా బాధిత కుటుంబాల ఇళ్లలో తినదగిన పదార్థాలు అన్నిటినీ స్వాధీనం చేసుకొని పరీక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది.
జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మంగళవారం బాధిత కుటుంబాలను కలిసి సానుభూతి తెలిపారు. ఈ మరణాల వెనుక మిస్టరీని తెలుసుకొనేందుకు దర్యాప్తు కొనసాగుతోందన్న ఆయన, అన్ని ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరుకుతుందని హామీ ఇచ్చారు.
More Stories
ఏపీలో ఆలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి
కొత్త సీఈసీగా జ్ఞానేశ్కుమార్
నేపాల్ విద్యార్థిని ఆత్మహత్యతో ఒడిశా యూనివర్సిటీలో ఉద్రిక్తత