
* మౌని అమావాస్య రోజు 150 ప్రత్యేక రైళ్లు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ లో మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. 45 రోజులపాటు సాగే ఈ మహాకుంభ మేళాలో భాగంగా త్రివేణీ సంగమంలో స్నానాలు చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అంచనాలకు మించి తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల కోసం యూపీ సర్కార్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం ప్రత్యేక టెంట్లు వంటి నిర్మాణాలు చేపట్టింది.
దీంతో మహాకుంభ్ మొత్తం ఓ పెద్ద నగరాన్ని తలపిస్తోంది. ఇందుకు సంబంధించి కొన్ని చిత్రాలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తాజాగా విడుదల చేసింది. స్పేస్ సెంటర్ నుంచి కుంభమేళా ఏరియాను ఉపగ్రహాలు తీసిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
మహాకుంభ మేళాకు సంబంధించిన ఏర్పాట్లు చేయకముందు, చేసిన తర్వాత తీసిన ఫొటోలను షేర్ చేసింది ఇస్రో. ఆ ఫొటోల్లో గతేడాది ఏప్రిల్‌లో మహాకుంభ్ ప్రాంతం మొత్తం నిర్మానుష్యంగా కనిపించింది. డిసెంబర్ 22న తీసిన ఫోటోల్లో ఆ ప్రాంతంలో నిర్మాణాలు ప్రత్యక్షమయ్యాయి. టెంట్ల నిర్మాణం గత డిసెంబర్లోనే మొదలైంది. తాత్కాలికంగా శివాలయ పార్కును కూడా అధికారులు ఏర్పాటు చేశారు. దానిలో భారతదేశ పటం కనిపించడం విశేషం.
ఈ నెల 10న తీసిన ఫోటోల్లో మహా కుంభ్ నగర్లో నిర్మాణాలు భారీగా పెరిగిపోవడం చూడవచ్చు. మరి మూడు రోజుల్లో కుంభమేళా ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నెల 10 నాటికే సాధువులతో పాటు సామాన్యులు పెద్ద సంఖ్యలో త్రివేణి సంగమం వద్దకు చేరుకున్నారు. కాగా, మహా కుంభ్ నగర్లో దాదాపు లక్షన్నర టెంట్లు నిర్మించామని, వాటిలో మూడు వేల కిచెన్లు, అదనంగా లక్షా 45 వేల రెస్ట్ రూమ్‌లు, 99 పార్కింగ్ లాట్లు ఏర్పాటు చేశామని అధికారులు తెలియజేశారు.
సంక్రాంతి రోజున ప్రారంభమైన (జనవరి 13) మహా కుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రితో ముగుస్తుంది. 45 రోజుల పాటు సాగనున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యే భక్తుల సంఖ్య 50 కోట్లు దాటుతుందని యూపీ సర్కార్ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో కోట్లాది మందికి తగిన రీతిలో ఏర్పాటు చేసింది యూపీ ప్రభుత్వం. సుమారు లక్షా 60 వేల టెంట్లను ఏర్పాటు చేశారు.
కాగా, జనవరి 29న మౌని అమావాస్యను పురస్కరించుకొని మహాకుంభమేళాకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రయాగ్‌రాజ్ రైల్వే డివిజన్ ఆ ఒక్కరోజు కోసమని ప్రత్యేకంగా 150 రైళ్లను నడపనుంది. ప్రయాగ్‌రాజ్ రైల్వే డివిజన్ సీనియర్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అమిత్ మాలవీయ ఈ విషయాన్ని వెల్లడించారు.
వీటిలో ఎక్కువ శాతం రైళ్లు ప్రయాగ్‌రాజ్ జంక్షన్ నుంచి కుంభమేళా జరుగుతున్న ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్లకు నడుస్తాయని పేర్కొన్నారు. వీటితో పాటు రెగ్యులర్ రైళ్లు కూడా టైం టేబుల్ ప్రకారం నడుస్తాయన్నారు. మౌని అమావాస్య రోజు కుంభమేళాకు 10కోట్ల మంది దాకా వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
More Stories
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!