అన్న కాంటీన్ లలో ఆహార నాణ్యత, పరిమాణంలపై అసంతృప్తి

అన్న కాంటీన్ లలో ఆహార నాణ్యత, పరిమాణంలపై అసంతృప్తి
 
* రాష్ట్ర వ్యాప్తంగా పీపుల్స్ పల్స్’ రీసర్చ్ సంస్థ సర్వే 
 
సామాన్య ప్రజల ఆకలి తీర్చడంతో పాటు, పోషకాహారం అందించేందుకు   ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం  నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘‘అన్న క్యాంటీన్ ’’ లలో కేవలం రూ. 15 లకే మూడు పూటల భోజనం అందిస్తున్నారు.  వీటి పనితీరుపై `పీపుల్స్ పల్స్’ రీసర్చ్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను సందర్శించి చేసిన అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
 
చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు రాష్ట్ర వ్యాప్తంగా  ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒక  క్యాంటీన్ చొప్పున మొత్తం 25  అన్న క్యాంటీన్లను పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ రీసెర్చర్లు సందర్శించి  అధ్యయనం చేసింది. ప్రతి క్యాంటీన్వద్ద 50 నుంచి 60 మంది లబ్దిదారులతో ముఖాముఖి చర్చించి, దాదాపు 1200 మందితో మాట్లాడి ఈ పథకాన్ని క్షుణ్ణంగా రీసెర్చర్లు అధ్యయనం చేశారు. 
 
జనవరి 3 నుంచి 10 వరకు వారం రోజుల పాటు ఈ అధ్యయనం కొనసాగింది. ‘పీపుల్స్ పల్స్’ సంస్థ సీనియర్ రీసెర్చర్ జి.మురళీకృష్ణ నేతృత్వంలో మొత్తం 10 మంది రీసెర్చర్లు క్షేత్రస్థాయిలో ఈ సర్వే నిర్వహించారు. తెలుగుదేశం ప్రభుత్వం 2018, జూలైలో పట్టణ ప్రాంతాల్లో పేదల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరు మీద ఈ ‘అన్న క్యాంటీన్ల’ను ప్రారంభించింది. 
 
ఈ క్యాంటీన్లలో 15 రూపాయిలకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అందుబాటులో ఉన్నాయి. అంటే 15  రూపాయిలకే మూడు పూటల పేదవాడి కడుపు నింపడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.  ప్రస్తుతం  రాష్ట్రంలోని ముఖ్య పట్టణాలు, టౌన్లలో మొత్తం 204 అన్న క్యాంటీన్లు నడుస్తున్నాయి. వీటి నిర్వహణ బాధ్యతను ‘అక్షయపాత్ర’ అనే ఎన్జీవోకు అప్పగించారు. 
 
ఇస్కాన్ వారు నడిపించే ఈ ఎన్జీవోకు చెందిన సెంట్రలైజ్డ్ కిచెన్ల నుంచి ఆహారం తయారుచేసి క్యాంటీన్లకు సరఫరా చేస్తున్నారు. ముందురోజు డిమాండ్ ను బట్టి అక్షయపాత్ర ఫౌండేషన్ రోజూ తమ కిచెన్ల నుంచి ఆహారాన్ని అన్న క్యాంటీన్లకు సప్లయ్ చేస్తోంది. డిమాండ్, ప్రాంతాలను బట్టి ఒక్కో అన్న క్యాంటీన్ 300 నుంచి 500 మంది  పేదలకు కడుపు నింపుతున్నాయి.

 
ప్రభుత్వ లెక్కల ప్రకారం, ఉదయం టిఫిన్ కి రూ.22, ఒక పూట భోజనానికి రూ. 34 చొప్పున ఖర్చు అవుతుంది. అంటే మూడు పూటలకు ప్రభుత్వం చేస్తున్న ఖర్చు మొత్తం రూ.90. ఇందులో లబ్దిదారుల నుంచి రూ. 15  వసూలుచేస్తారు. మిగిలిన రూ. 75 ప్రభుత్వం రాయితీగా ఇవ్వడంతో పాటు కొంతమంది దాతల ద్వారా సమకూర్చి అక్షయపాత్రకు చెల్లిస్తోంది.
 
ఒక్కో క్యాంటీన్ నడపడానికి ప్రభుత్వానికి రోజుకు రూ.26,256 ఖర్చు అవుతుండగా, మొత్తం క్యాంటీన్ల నిర్వాహణకు రోజుకు దాదాపు రూ.53 లక్షలు ఖర్చు చేస్తోంది. అంటే సంవత్సరానికి రూ.200 కోట్లు  వెచ్చిస్తోంది.  2019లో టీడీపీ అధికారం కోల్పోవడంతో ‘‘అన్న క్యాంటీన్ల’’ను వైఎస్సార్ ప్రభుత్వం ఐదేళ్ల పాటు నిలిపివేసింది. 
 
2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీకి చెందిన కొంతమంది నేతలు తమ తమ నియోజకవర్గాల్లో ‘‘రాజన్న క్యాంటిన్ల’’ను ప్రారంభించి పేదలకు  ఆహారాన్ని అందించారు. 2024  ఎన్నికల్లో టీడీపీ కూటమి తిరిగి అధికారంలోకి రావడంతో 2024, ఆగస్టు 15వ తేదీన మళ్లీ ఈ క్యాంటీన్లు పున:ప్రారంభమయ్యాయి. 
పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో 2024 ఎన్నికలకు ముందు పలుచోట్ల టీడీపీ నాయకులు నడిపిన  ప్రయివేట్ అన్న క్యాంటీన్లలో అందించిన ఆహారంతో పోలుస్తూ ఇప్పుడు ప్రభుత్వం నడిపిస్తున్న అన్న క్యాంటీన్ల ఆహారం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
 
ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉప్పూ కారం ఎక్కువగా తింటారు. కానీ, అన్న క్యాంటీన్లలో అందిస్తున్న ఆహార పదార్థాల్లో ప్రజలు కోరుకుంటున్న జిహ్వకు తగ్గట్టుగా ఉప్పూ కారం సరిగ్గా ఉండటం లేదని 80 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం భోజనంలో ఒక కర్రీ, సాంబార్ ఉండాలి. కానీ, రెండు సాంబర్లే ఇస్తున్నారేంటి? అన్నట్టుగా కర్రీ కూడా నీళ్లలాగా ఉంటుంది. 
 
ఉదయం టిఫిన్లలో  అందిస్తున్న చట్నీ కూడా బాగుండటం లేదు. చెడిపోయి, వాసన వస్తుంది. భోజనానికి ఇచ్చే చట్నీ  నాణ్యతగా ఉండటం లేదు. క్యాంటీన్లలో భోజనం చేసేవారు రోటి పచ్చడి కూడా పెట్టాలని కోరుకుంటున్నారు. రుచి తగ్గడానికి మరో కారణం క్యాంటీన్లకు వచ్చేసరికి ఆహారం చల్లగా మారుతుంది. చాలా క్యాంటీన్లలో హాట్ బాక్స్ లు లేవు. 
 
అన్న క్యాంటీన్ ప్రారంభించిన రోజు వచ్చిన నాయకులు తర్వాత రావడంలేదు. నాయకులు వస్తున్నారు ముందే సమాచారం ఇస్తుండటంతో ఆ రోజు భోజనం రుచిగా, నాణ్యతగా తీసుకొస్తున్నారని, మిగతా  రోజుల్లో ఆ రుచి ఉండటం లేదని జగదీశ్ అనే విజయనగరం యువకుడు చెప్పాడు. నాయకులు  వస్తారని తెలిసి బాగా పెట్టడం కాకుండా, ప్రతి రోజూ నాణ్యతగా పెట్టాలని విజయనగరంలోనే రాము అనే యువకుడు చెప్పాడు. 
 
కర్నూల్ లో పెద్దపాటి శ్యామ్ అనే యువకుడు కూడా ఇంచుమించు ఇలాగేచెప్పాడు. అన్న క్యాంటీన్లలో ఆహారం రుచి రోజూ ఒకేవిధంగా ఉంటుంది. కూరగాయలు మారినా, వండే విధానం, రుచి మారడం లేదు. ‘‘కర్రీస్ మారిస్తే బాగుంటుందండీ. అస్తమానం ఒకే రకమైన కూరలు పెడుతున్నారు. రుచి కూడా ఏం మారడం లేదు’’ అని ఏలూరులో సాయితేజ చెప్పాడు. ార్థాల ఇంొంెం స్పైసీగా ఉండాలని కోరుకుంటున్నారు. 
 
అల్పాహారం తీసుకున్న వారిలో ఎక్కువమంది రెండు టోకెన్లు తీసుకోవడాన్ని సర్వే బృందం గమనించింది.  అల్పాహారంలో అందిస్తున్న ఇడ్లీలు, పొంగల్, పూరీలు అంత నాణ్యతగా  ఉండటం లేదు. లబ్దిదారుల నుంచి కేవలం రూ.5 తీసుకుంటున్నా, నిర్వాహకులకు ప్రభుత్వం రూ.17 ఇస్తున్నది. అయినా,  అల్పాహారం ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. 
 
ఆంధ్రప్రదేశ్ లో అనేక ప్రాంతాలలో బండ్ల మీద కేవలం రూ. 15 నుంచి 20కే  5 ఇడ్లీలు/ 4 పూరీలు/ ఉప్మా మంచి నాణ్యతతో అందిస్తున్నారు. రూ.22 తీసుకుంటున్న ఏజెన్సీ  అల్పాహారాన్ని మరింత నాణ్యతగా అందించవచ్చు. అదే విధంగా రాష్ట్రంలోని అనేక చోట్ల 20 నుంచి 25 రూపాయలకే లెమన్ రైస్, వెజిటబుల్ బిర్యానీ, టమాటా రైస్, పెరుగన్నం మంచి క్వాలిటీతో అందిస్తున్నారు. అటువంటిది రూ.34 ఒక భోజనానికి ప్రభుత్వం చెల్లిస్తున్నప్పుడు ప్రస్తుతం అందిస్తున్న దానికన్నా మరింత నాణ్యతతో భోజనం అందించవచ్చు.
 
క్వాంటిటీలో చేతివాటం
 
అన్న క్యాంటీన్లలో లంచ్, డిన్నర్ కి 400 గ్రాముల రైస్, ఒక కప్పు కర్రీ, 120 గ్రాముల సాంబార్,  75 గ్రాముల పప్పు, పెరుగు, పచ్చడి, అల్పాహారంలో ఒక ప్లేట్ ఇడ్లీ/ పూరీ/ పొంగల్ వంటి ఐటమ్స్ అందిస్తున్నామని, ఇడ్లీ, పూరీ అయితే 3 చొప్పున ఇస్తామని, ఉప్మా లేదా పొంగల్ అయితే 250 గ్రాముల అందిస్తున్నట్లు మెనూలో ప్రభుత్వం పేర్కొంది. 
 
దాదాపు మెనూ ప్రకారమే రోజూ పదార్ధాలు వస్తున్నాయి. కానీ, మెనూలో పేర్కొన్నట్టుగా నాణ్యతగా ఇవ్వడం లేదు. ఇక్కడ సిబ్బంది చేతివాటం స్పష్టంగా కనబడుతుంది. రైస్ 400 గ్రాములు ఇవ్వాల్సి ఉండగా చాలాచోట్ల 350 గ్రాములకు మించి ఇవ్వడం లేదు. ఉదాహరణకు ఒక క్యాంటీన్ కి 300 మందికి సరిపడా భోజనం పంపిస్తే,  దానిని 350 మందికి పెట్టి చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అదనంగా 50 మందికి పెట్టిన భోజనానికి  వచ్చే డబ్బులు సిబ్బంది జేబులోకి వెళ్తున్నాయి.  
 
‘‘అన్న క్యాంటీన్లు బాగానే ఉన్నాయి. కానీ, రూ.5కు వడ్డిస్తున్న భోజనం చిన్న పిల్లాడికి కూడా సరిపోదు. చాలా తక్కువగా వడ్డిస్తున్నారు. ఇదేమిటని అడిగితే, రూ.5కి ఇంతకు మించి రాదులే అని సిబ్బంది  కసురుకుంటున్నారు’’అని గాజువాకలో ఈ బృందం కలిసిన పవన్ కుమార్ చెప్పాడు. ఇంచుమించు ఇలాంటి మాటలే చాలా చోట్ల వినపడ్డాయి. 
 
రూ.5 ఒక టోకెన్ తీసుకున్నప్పుడు, అది ఒక వ్యక్తికి సరిపోక పోవడం తో, రెండు టోకెన్లు తీసుకుని భోజనం చేస్తున్నారు. దీనికి పరిష్కారంగా రూ.10  ుకుని ంచెం నాణ్యత, పరిమాణం పెంచితే బాగుంటుందని చాలామంది ఏకాభిప్రాయంగా  వినిపించారు. తమ ఇంట్లో నుంచి తెచ్చి వడ్డిస్తున్నట్టుగా, లబ్దిదారులను చిన్నచూపు చూస్తున్న సిబ్బంది  ప్రవర్తనను పీపుల్స్ పల్స్ రీసెర్చర్లు పరిశీలించారు. 
 
శుభ్రత ఎలా ఉంది?
 
అన్న క్యాంటీన్ల శుభ్రత, నాణ్యత పట్ల 65 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. క్యాంటీన్ల శుభ్రతను పర్యవేక్షించడానికి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. కానీ, చాలా చోట్ల ఈ సీసీ కెమెరాలు  పనిచేయకపోవడం ప్రధాన లోపం. అన్న క్యాంటీన్లలో ఉపయోగించే ప్లేట్లను సబ్బు ఉపయోగించి, పరిశుభ్రమైన వేడి నీటితో శుభ్రం చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. 
 
కానీ, వేడి నీళ్లతో కడుగుతున్న ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదు. ప్లేట్లను శుభ్రంగా కడగకపోవడంతో ప్లేట్ల కింద మరకలు స్పష్టంగా కనబడుతున్నాయి. వాష్ బేషన్ లో మురికి అలాగే ఉంటుంది. టేబుల్స్ ని కూడా సరిగ్గా క్లీన్ చేయడం లేదు. వడ్డించేటప్పుడు సిబ్బంది గ్లౌజులు వాడటం లేదు. తాగునీటి శుభ్రత విషయంలో కూడా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 
 
‘‘స్కీం బాగుంది. చాలామంది ఈ స్కీంని ఉపయోగించుకుంటున్నారు. కానీ, అన్న క్యాంటీన్లలో ప్లేట్లు సరిగ్గా కడగటం లేదు. క్యాంటీన్లో ఇంకా శుభ్రత పెరగాలి. శుభ్రత పాటించకపోవడం వల్ల ఇక్కడ  తిన్నవాళ్లలో చాలామందికి ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి’’ అని అనంతపురంలో రాజశేఖర్ అనే యువకుడు చెప్పాడు. మధ్య వయసు వారు శుభ్రత గురించి ఎక్కువ మాట్లాడటం లేదుగానీ, యువకుల్లో చాలామంది శుభ్రత విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. 
 
సమయ పాలన పాటించడం లేదు
 
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం 7.30 గంటల నుంచి 10 గంటల వరకు అల్పాహారం,  మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 3 గంటల వరకు భోజనం, రాత్రి 7.30 గంటలనుంచి 9 గంటల వరకు రాత్రి భోజనం కోసం తెరిచి ఉంచాలి. కానీ, చాలా  క్యాంటీన్లలో సమయపాలన పాటించడం  లేదు. అన్న క్యాంటీన్లు ఆలస్యంగా తెరుస్తున్నారు. దీంతో మధ్యాహ్న సమయంలో క్యూలో ఎక్కువ  సమయం నించోవాల్సి వస్తోంది. 
 
కొన్నిసార్లు ఒక టోకెన్ దొరకడానికి అరగంట నుంచి గంట వరకు  క్యూలో ఇబ్బంది పడాల్సి వస్తోందని నెల్లూరులో అన్న క్యాంటీన్లో భోజనం చేస్తున్న శ్రీనివాస్ అనే నిరుద్యోగి చెప్పాడు. ‘‘పన్నెండింటికీ స్టార్ట్ చేస్తామంటున్నారు. కానీ, ఒంటిగంట అవుతోందండి’’ అని ఏలూరులో అయ్యప్ప చెప్పాడు. సిబ్బంది పనివేళలను పర్యవేక్షించే వ్యవస్థ లేకపోవడమే సమయపాలనపాటించకపోవడానికి ప్రధాన కారణం. దీనిపై ప్రభుత్వం కట్టదిట్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది.
 
అన్న క్యాంటీన్లను ఉపయోగించుకుంటున్న వారిలో అసంఘటిత రంగంలో పని చేస్తున్నవారే ఎక్కువ మంది ఉంటున్నారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు, కూరగాయలు, పండ్ల వ్యాపారులు, చిరు వ్యాపారులు, కార్పెంటర్లు, ప్లంబర్లు, నిరుద్యోగులు, వలస కూలీలు అధికంగా అన్న క్యాంటీన్ కి వస్తున్నారు. 
 
క్యాంటీన్లు అధికంగా ఆస్పత్రులు, బస్టాండులకు దగ్గరగా ఉండటం వల్ల  చుట్టు పక్కల ఊర్ల నుంచి  టౌన్లకు వచ్చే రైతులు, ఆస్పత్రులకు వచ్చేవారి కుటుంబ సభ్యులు ఈ క్యాంటీన్లలో భోజనం చేస్తున్నారు. ఆస్పత్రులు, బస్టాండులకు దగ్గరగా క్యాంటీన్ల నిర్మాణం చేపట్టడం మంచి విషయమే. అన్న క్యాంటీన్లకు వస్తున్నవారిలో ఎక్కువమంది ఆదాయం నెలకు రూ.10,000వరకు మాత్రమే ఉంది. అన్న క్యాంటీన్లలో రిపీటెడ్ కస్టమర్లు ఎక్కువగా ఉంటున్నారు. 
 
పీపుల్స్ పల్స్ బృందం కలిసిన వారిలో వారానికి 3 నుంచి 5 రోజులు ఈ క్యాంటీన్లలో భోజనం చేస్తున్నవాళ్లు 56 శాతం మంది ఉన్నారు. మొదటిసారి తింటున్నామని చెప్పినవాళ్లు 34 శాతం మంది ఉన్నారు.  వీరిలో దాదాపు 85 శాతం మంది మగవాళ్లే అన్న క్యాంటీన్లకు వస్తున్నారు. ఇందులోనూ  అధిక శాతం మంది ఎస్సీలు, బీసీలే అని మా సర్వేలో తేలింది. 
 
ఎక్కువమంది మగవాళ్లే ఉండటం,  ప్రత్యేక క్యూ లైన్లు లేకపోవడం వల్ల మహిళలు అసౌకర్యంగా ఫీల్ అవుతున్నట్టు వీరి దృష్టికి వచ్చింది. ‘‘రైస్ కూడా సన్న బియ్యమే పెడుతున్నారు. క్వాలిటీ కూడా బాగుంది. కానీ, మహిళలకోసం ప్రత్యేకంగా క్యూ పెడితే బాగుంటుంది’’ అని విజయవాడ అన్న క్యాంటీన్ లో భోజనం చేస్తున్న రమాదేవి చెప్పారు.ప్రత్యేకంగా మహిళల కోసం అన్న క్యాంటీన్ పెడితే బాగుంటుందని అభిప్రాయం కూడా పలుచోట్ల  వ్యక్తమయింది.
 
(పీపుల్స్ పల్స్ సిఫార్సులు రేపు)