అమెరికాకు స్వర్ణయుగం ప్రారంభం

అమెరికాకు స్వర్ణయుగం ప్రారంభం
అమెరికాకు స్వర్ణయుగం మొదలయ్యిందని, దేశాన్ని మరోసారి గొప్పగా మారుస్తామని నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. తనకు ఎప్పటికీ అమెరికానే ప్రధానంగా ఉంటుందని ప్రతి పౌరుడికి హామీ ఇస్తున్నట్టు చెప్పారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు స్వీకరించారు. యూఎస్‌ క్యాపిటల్‌లో సోమవారం రాత్రి ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. 
 
సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌ ట్రంప్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్‌ సైతం బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణస్వీకారం అనంతరం అధ్యక్షుడి హోదాతో ట్రంప్‌ మొదటి ప్రసంగం చేశారు. దేశంలోకి అక్రమ వలస లను వెంటనే ఆపేస్తామని, దక్షిణ సరిహద్దులో ఎమర్జెన్సీని ప్రకటించి, బలగాలను పంపిస్తానని ఆయన వెల్లడించారు. 
 
మాదకద్రవ్యాల ముఠాలను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటిస్తానని చెప్పారు. గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో పేరును గల్ఫ్‌ ఆఫ్‌ అమెరికాగా మారుస్తానని, పనామా న్‌ను మళ్లీ అమెరికా స్వాధీనం చేసుకుంటుందని స్పష్టం చేశారు. అమెరికాలో విస్తృతమైన వనరులు ఉన్నప్పటికీ గత కొన్ని దశాబ్దాలుగా పారిశ్రామిక రంగం క్షీణించిందని పేర్కొంటూ దేశాన్ని మరోసారి తయారీ కేంద్రంగా మారుస్తానని చెప్పారు.
 
అమెరికాను మళ్లీ గొప్పగా మార్చాలనే కారణమే తనను హత్యాప్రయత్నం నుంచి రక్షించిందని పేర్కొన్నారు. ఏ అధ్యక్షుడూ ఎదుర్కోనన్ని పరీక్షలు తాను ఎదుర్కొన్నానని చెబుతూ  2025 జనవరి 20వ తేదీ అమెరికన్‌ పౌరులకు విమోచన దినంగా ఆయన అభివర్ణించారు.
 
మూడో ప్రపంచ యుద్ధం రాకుండా అడ్డుకుంటానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హామీ ఇచ్చారు. బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటల వ్యవధిలోనే మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ తీసుకున్న కార్యనిర్వాహక చర్యలన్నింటినీ రద్దు చేస్తానని స్పష్టం చేశారు. టిక్‌టాక్‌ ఉమ్మడి భాగస్వామ్యంలో అమెరికాకు యాభై శాతం వాటా ఉంటుందని ప్రకటించారు.
 
గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి కుదిరిన ఒప్పందం తన ఘనతేనని ట్రంప్‌ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే యుద్ధమే వచ్చి ఉండేది కాదని స్పష్టం చేశారు. ‘మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపన కోసం తొలి దశగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని సాధించాము. నవంబరులో మన చారిత్రక విజయం కారణంగానే ఇది సాధ్యపడింది. తొలి బందీ ఇప్పుడే విడుదలయ్యాడు” అంటూ ఒప్పందాన్ని తానే కుదిర్చానని బైడెన్‌ చెబుతున్నాడు.

బైడెన్‌తో కలిసి క్యాపిటల్‌కు

19వ శతాబ్దం నుంచి అమెరికా అధ్యక్షుడిగా ఒకసారి గెలిచి, తర్వాత ఓడినా మళ్లీ రెండోసారి గెలిచిన మొదటి వ్యక్తి ట్రంప్‌. ప్రమాణస్వీకారానికి ముందు ట్రంప్‌ దంపతులు అధ్యక్షుడి అధికారిక నివాసమైన వైట్‌హౌజ్‌కు వెళ్లారు. జో బైడెన్‌ దంపతులు వీరికి స్వాగతం పలికి, అభినందనలు తెలిపారు. తేనీటి విందు తర్వాత అంతా కలిసి క్యాపిటల్‌కు బయలుదేరారు. 

యూఎస్‌ క్యాపిటల్‌ లోపల జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ అధ్యక్షులు జో బైడెన్‌, బిల్‌ క్లింటన్‌, జార్జ్‌ బుష్‌, బరాక్‌ ఒబామా, మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ హాజరయ్యారు. ట్రంప్‌ కుటుంబసభ్యులు, ట్రంప్‌ కీలక మద్దతుదారులు, వ్యాపార, టెక్‌ ప్రముఖులు ఎలాన్‌ మస్క్‌, జెఫ్‌ బెజోస్‌, మార్క్‌ జుకెర్‌బర్గ్‌, టిమ్‌ కుక్‌, సుందర్‌ పిచాయ్‌, టిక్‌టాక్‌ అధినేత షౌ చూ, వివిధ దేశాల ప్రతినిధులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

డొనాల్డ్‌ ట్రంప్‌నకు శుభాకాంక్షలు తెలుపుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేఖ రాశారు. ట్రంప్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారత్‌ తరఫున హాజరైన ఎస్‌ జైశంకర్‌ ఈ లేఖను ట్రంప్‌నకు అందించారు.

సాధారణంగా అధ్యక్షుడి ప్రమాణస్వీకారం యూఎస్‌ క్యాపిటల్‌లోని వెస్ట్‌ లాన్‌లో జరగాలి. ఇక్కడ ట్రంప్‌ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు కూడా జరిగాయి. 2.20 లక్షల టికెట్లను సైతం ప్రజలకు పంపిణీ చేశారు. అయితే, భారీగా మంచు కురుస్తున్నందున వేదికను క్యాపిటల్‌ లోపలి రొటుండాకు మార్చారు. దీంతో ట్రంప్‌ ప్రమాణస్వీకారానికి దాదాపు 600 మంది మాత్రమే హాజరయ్యారు. 

గత 40 ఏండ్లలో ఇలా క్యాపిటల్‌ లోపల అధ్యక్షుడు ప్రమాణస్వీకారం చేయడం ఇదే మొదటిసారి. ట్రంప్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వాషింగ్టన్‌లో ఏకంగా 25 వేల భద్రతా సిబ్బందిని మోహరించారు. భద్రతా చర్యల్లో భాగంగా 48.2 కిలోమీటర్ల ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేశారు. పోటోమాక్‌ నదిలో 25 కోస్ట్‌గార్డ్‌ ఓడలతో పెట్రోలింగ్‌ నిర్వహించారు.

వ్యాపారవేత్త నుంచి అధ్యక్షుడిగా

1946 జూన్‌ 14న న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో మేరి, ఫ్రెడ్‌ ట్రంప్‌ దంపతులకు డొనాల్డ్‌ ట్రంప్‌ జన్మించారు. యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా నుంచి 1968లో ఫైనాన్స్‌ డిగ్రీ పొందారు. 1971లో తన తండ్రి స్థాపించిన ట్రంప్‌ ఆర్గనైజేషన్‌ బాధ్యతలను స్వీకరించి విజయవంతంగా నడిపించారు. హోటళ్లు, రిసార్టులు, రియల్‌ ఎస్టేట్‌, క్యాసినోలు, గల్ఫ్‌కోర్సులు ఇలా అనేక వ్యాపారాలు చేశారు. 

2004లో ‘ది అప్రెంటీస్‌’ రియాల్టీ షో ద్వారా అమెరికన్లకు పరిచయమయ్యారు. 1990లో చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన అథ్లెట్‌, మాడల్‌ ఇవానా జెల్నికోవాన వివ చేసుకున్నారు. వీరికి డొనాల్డ్‌ జూనియర్‌, ఇవాంకా, ఎరిక్‌ సంతానం. మొదటి భార్యకు విడాకులిచ్చి 1999లో నటి మార్లా మాపిల్స్‌ వివాహం చేసుకొని టిఫానీకి జన్మనిచ్చారు. రెండో భార్యకు విడాకులిచ్చి 2005లో స్లొవేనియా మాజీ మాడల్‌ మెలానియాను వివాహం చేసుకున్నారు. వీరికి బారన్‌ విలియం ట్రంప్‌ అనే కుమారుడు ఉన్నాడు. 

2016లో మొదటిసారి అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన డొనాల్డ్‌ ట్రంప్‌ డెమాక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ను ఓడించి మొదటిసారి అధ్యక్షుడయ్యారు. 2020లో మరోసారి పోటీ చేసి జో బైడెన్‌ చేతిలో ఓటమి చవిచూశారు. 2024 ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసిన డెమాక్రటిక్‌ అభ్యర్థి కమలా హ్యారిస్‌ను ఓడించి రెండోసారి అధ్యక్షుడయ్యారు.

కుటుంబసభ్యులకు బైడెన్‌ క్షమాభిక్ష

కాగా, అధ్యక్షుడిగా తన పదవీకాలం చివరి క్షణాల్లో జో బైడెన్‌ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అధ్యక్షుడిగా తనకున్న విస్తృత అధికారాలతో తన బంధువులు, కుటుంబసభ్యులకు క్షమాభిక్ష పెట్టారు. తనను వేధించాలనే లక్ష్యంతో తన వారిపై దాడులు జరిగాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.  యూఎస్‌ క్యాపిటల్‌పై జరిగిన జనవరి 6 దాడి ఘటనను విచారించిన హౌజ్‌ కమిటీ సభ్యులకు సైతం క్షమాభిక్ష ప్రకటించారు. వీరిపై ట్రంప్‌ ప్రతీకార చర్యలకు దిగొచ్చనే కారణంతో ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. గతనెల తన కుమారుడికి సైతం ట్యాక్స్‌, ఆయుధాల కేసులోబైడెన్‌ క్షమాభిక్ష పెట్టారు.