కె వి రావుకు సి పోర్టు షేర్లు తిరిగి ఇచ్చేసిన అరబిందో!

కె వి రావుకు సి పోర్టు షేర్లు తిరిగి ఇచ్చేసిన అరబిందో!
గత ప్రభుత్వంలో స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో బెదిరించి తన నుండి కాకినాడ సి పోర్టు షేర్లను బలవంతంగా తీసుకున్నట్లు చేసిన ఆరోపణలపై సిఐడి, ఈడీ దర్యాప్తులు ప్రారంభించడంతో నాటకీయంగా ఆరోబిందో కంపెనీ ఆ షేర్లను తిరిగి ఇచ్చేసింది. మూడు రోజుల క్రితం బదిలీ కార్యక్రమం గుట్టుగా జరిగిపోయింది. 
 
ఈ వివాదంలో పైస్థాయి వ్యక్తులు మధ్యవర్తిత్వం జరిపినట్లు, అంతుకు బదులుగా సెజ్‌ను మరిచిపోవాలంటూ కేవీరావుకు షరతు విధించినట్లు తెలుస్తున్నది.ఆ మేరకు పోర్టులో గతంలో లాక్కున్న 41.12 శాతం వాటాలు తిరిగి బదిలీ చేశారు.
 
కాగా తనను బెదిరించి, భయపెట్టి పోర్టులో వాటాలు లాగేసుకున్నారని గత నెలలో కేవీ రావు సీఐడీకి ఫిర్యాదు చేశారు. అటు సీఐడీ ఫిర్యాదు ఆధారంగా రూ.494 కోట్ల చెల్లింపులపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఇప్పటికే వైఎస్సర్‌సీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి, టిటిడి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కుమారుడు వైవి విక్రాంత్ రెడ్డిలను ఈడీ అధికారులు విచారించారు. 
 
ఒకవైపు ఈడీ విచారణ జరుగుతుండగానే కేవీ రావుకు గతంలో గుంజుకున్న వాటాలను అరబిందో సంస్థ తిరిగి ఇచ్చేయడం గమనార్హం. దానితో  ‘కాకినాడ సీ పోర్టు’ మళ్లీ అసలు యజమాని కేవీ రావుకు దక్కింది. వైసీపీ హయాంలో బలవంతంగా వాటాల బదిలీ, కూటమి సర్కారు వచ్చాక దీనిపై సీఐడీకి కేవీరావు ఫిర్యాదు చేయడం, ఆపై ఈడీ కూడా రంగంలోకి దిగిన సమయంలో విషయం కీలక మలుపు తిరిగింది.
 
కాకినాడ పోర్టులో మనీలాండరింగ్‌పై ఈడీ ఆరా తీస్తుండటం అరబిందో ప్రతిష్ఠ దెబ్బతినే పరిస్థితి తలెత్తడం, తీగలాగితే భారీగా డొంక కదిలే పరిస్థితి ఉండటంతో కాకినాడ సీపోర్ట్‌ డీల్‌ ‘రివర్స్‌’ అయిన్నట్లు భావిస్తున్నారు. అప్పట్లోరూ.2500 కోట్ల విలువైన 2.15 కోట్ల షేర్లను జగన్‌ బ్యాచ్‌ రూ.494 కోట్లకే లాగేసుకుందని కేవీ రావు ఆరోపించారు. దీనిపై సీఐడీకి కూడా ఫిర్యాదు చేశారు.  అదే సమయంలో కేవీరావుకు చెందిన 8 వేల ఎకరాలున్న కాకినాడ సెజ్‌ పూర్తిగా అరబిందోకు సొంతమైంది.
 
 సీపోర్టుకు స్టాక్‌ ఎక్స్ఛేంజీతో సంబంధం లేకపోవడంతో గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారం సాగిపోయింది. ఇక కాకినాడ సెజ్‌లో తన వాటాగా రూ.1104 కోట్లు రావలసి ఉండగా, రూ.12 కోట్లతో సరిపెట్టారని కేవీరావు సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోర్టు వాటాలను తిరిగి ఇచ్చేసినందున, ఇక సెజ్‌ గురించి మరిచిపోయేలా డీల్‌ కుదిరినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. అయితే, కేవీరావు మాత్రం, సెజ్‌లో వాటాలను వదులుకునేందుకు కూడా సిద్ధంగా లేరని తెలుస్తున్నది.