
స్వయం సహాయక సంఘాల్లోని 63 లక్షల మంది మహిళలకు సంక్రాంతి పండుగకు మంచి డిజైన్లతో మన్నికైన రెండు చీరలు పంపిణీ చేస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పుతుంది. రెండు రోజుల్లో సంక్రాంతి పండుగ ఉంది. కానీ చీరల పంపిణీ ముచ్చట ఏమైం దో ప్రభుత్వం నుంచి ఒక్క ప్రకటన కూడా లేదు.
కనీసం నేతకార్మికులకు ఆర్డర్లు ఇవ్వలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క చెప్పిన మాటలు మభ్యపెట్టే హామీలే అయ్యాయని ఎస్‌హెచ్‌జీ మహిళలు మండిపడుతున్నారు. కోటికి పైగా చీరల కోసం 450 కోట్లు అవసరమని, తయారీకి 4 నెలలకు పైగా సమయం పడుతుందని నేత కార్మికులు చెబుతున్నా రు.
“గత ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరలు కట్టుకునేంతా నాణ్యతతో లేవు. వాటి మీద పెట్టాల్సినంత పెట్టుబడి పెట్టలేదు. స్వయం సహాయక సంఘాల్లో 63 లక్షల మంది ఆడబిడ్డలు ఉన్నరు. మంచి డిజైన్లతో ఒక్కొక్కరికీ రెండు చీరల చొప్పున 1.3 కోట్ల చీరలు ఆర్డర్ చేస్తం. త్వరలోనే మహిళలందరికీ మన్నికైన చీరలు పంపిణీ చేస్తం” అని గత సెప్టెంబర్ 9న హైదరాబాద్ లలితాకళాతోరణంలో ఐఐహెచ్‌టీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం కోటి చీరల తయారీ కోసం దసరాకు 6 నెలల ముందే నేత కార్మికులకు ఆర్డర్లు ఇచ్చి, రూ. 350 కోట్లు మంజూరు చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరలు పంపిణీని రద్దు చేసింది. సంక్రాంతికి రంగురంగుల చీరలు ఇస్తామని చెప్పింది.
గత డిసెంబర్ 19న మహిళా సంఘాల నాయకులను పిలిచి డిజైన్లను ఎంపిక చేసినట్లు చెప్పింది. కానీ నిధులు మాత్రం మంజూరు చేయలేదు, తయారీ కోసం ఆర్డర్లు కూడా ఇవ్వలేదు. ప్రభుత్వం సంక్రాంతికి చీరలు పంపిణీ చేస్తుందని మహిళలు, తయారీకి ఆర్డర్లు ఇస్తే ఉపాధి లభిస్తుందని నేత కార్మికులు ఆశించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రకటనలపై ఆశపెట్టుకున్నందుకు నిరాశే మిగిలిందని నిట్టూరుస్తున్నారు.
“బతుకమ్మ పండుగకు చీరలు ఇవ్వలేకపోయాం. వచ్చే సంక్రాంతికి అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లతో పాటు మహిళా సంఘాల్లోని 63 లక్షల మంది సభ్యులకు రెండు నాణ్యమైన చీరలు పంపిణీ చేస్తాం. ఇందుకు డిజైన్లను ఎంపిక చేసి వెంటనే ఆర్డర్లిస్తాం” అని గత నవంబర్ 4న అంగన్‌వాడీలు, హెల్పర్ల మీటింగ్‌లో మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఆ విషయమే పట్టించుకోవడం లేదు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి