రైల్వేస్టేషన్‌లో కూలిన ప్రవేశద్వారం పైకప్పు

రైల్వేస్టేషన్‌లో కూలిన ప్రవేశద్వారం పైకప్పు
* శిథిలాల కింద చిక్కుకున్న పలువురు కూలీలు
 
ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌ రైల్వేస్టేషలో నిర్మాణంలో ఉన్న ప్రవేశద్వారం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. దాంతో నిర్మాణ పనులు చేస్తున్న పలువురు కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటనపై సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీమ్స్‌ హుటాహుటిన అక్కడికి చేరుకున్నాయి. సహాయక చర్యలు మొదలుపెట్టాయి. 
 ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 35 మంది ఉద్యోగులు ఘటనా స్థలంలో ఉన్నారు. ఇప్పటివరకు రక్షణ బలగాలు శిథిలాల కింది నుంచి 23 మందిని వెలికితీశాయి. వారిలో స్వల్పంగా గాయపడిన 20 మంది కన్నౌజ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని మెరుగైన చికిత్స నిమిత్తం లక్నో ఆస్పత్రికి తరలించారు.
 
శిథిలాల కింద చిక్కుకుని ఉన్న మిగతా కూలీలను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ టీమ్స్‌తోపాటు స్థానిక అధికారులు, పోలీసులు ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌ రైల్వేస్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ స్పందించారు.

ప్రమాద ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సీఎం యోగి చెప్పారు. వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి తక్షణమే అవసరమైన మెడికల్‌ ట్రీట్‌మెంట్‌ను సమకూర్చాలని సూచించారు. బాధితులంతా త్వరలో కోలుకోవాలని ఆకాంక్షించారు.

రైల్వే అమృత్ భారత్ యోజన కింద మూడు స్టేషన్లను ఎంపిక చేసినట్లు రైల్వే బోర్డు సభ్యుడు సత్యేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు. ఇందులో కన్నౌజ్ కూడా ఉంది. ఇక్కడ నిర్మాణంలో ఉన్న లింటెల్ అనుకోకుండా పడిపోయింది. వెంటనే సమాచారం తెలుసుకున్న అధికారులు చర్యలు తీసుకున్నారు. 

ప్రాథమిక సమాచారం ప్రకారం నిర్మాణంలో ఉన్న పైకప్పు షట్టరింగ్ కూలిపోవడంతో ఈ ఘటన సంభవించిందని జిల్లా మేజిస్ట్రేట్ శుభ్రాంత్ కుమార్ శుక్లా తెలిపారు. అయితే ఈ ప్రమాదం ఎందుకు జరిగిందనే విషయంపై దర్యాప్తు జరుగుతోంది. చిక్కుకున్న కార్మికులను రక్షించడమే మా మొదటి ప్రాధాన్యత అని ఆయన అన్నారు. సహాయక చర్యల కోసం తమ వద్ద ఉన్న అన్ని వనరులను ఉపయోగిస్తున్నామని చెప్పారు. 

ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50,000, స్వల్పంగా గాయపడిన వారికి రూ.5,000 పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సహాయ, రక్షణ చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని ఈశాన్య రైల్వే తెలిపింది. కన్నౌజ్ రైల్వే స్టేషన్‌లో నిర్మాణంలో ఉన్న ప్రయాణీకుల వేచి ఉండే గది కూడా కూలిపోవడంతో జరిగిన ప్రమాదంలో చాలా మంది గాయపడ్డారని స్థానికులు చెబుతున్నారు. గాయపడిన వారికి తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్థానిక పరిపాలనను ఆదేశించింది. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని పలువురు కోరుతున్నారు.