2024 రికార్డుస్థాయిలో భూగోళ ఉష్ణోగతలు !

2024 రికార్డుస్థాయిలో భూగోళ ఉష్ణోగతలు !
భూగోళంపై 2024 సంవత్సరం అత్యంత అధిక ఉష్ణోగ్రతలను నమోదు చేసిన సంవత్సరంగా నిలిచింది. పైగా 1.5 డిగ్రీల సెల్సియస్‌ను అధిగమించరాదంటూ శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు పదే పదే చేసిన హెచ్చరికలను అధిగమించేసిన తొలి సంవత్సరంగా కూడా రికార్డులకెక్కింది. 
 
వాతావరణ సంక్షోభం వల్లనే ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయని, ఆధునిక మానవులు ఇంతవరకు ఎన్నడూ అనుభవించిన స్థాయిలకు చేరుకుంటున్నాయని యురోపియన్‌ యూనియన్‌ వాతావరణ పర్యవేక్షక సంస్థ కొపర్నికస్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ సర్వీస్‌ (సి3ఎస్‌) శుక్రవారం పేర్కొంది. రికార్డులు నమోదు చేయడం ఆరంభించినప్పటి నుండి 2024లో ప్రతి నెలా కూడా అత్యంత వేడిగా వుండడం లేదా రెండో స్థానంలో వుండడం జరుగుతూ వచ్చిందని సి3ఎస్‌ డైరెక్టర్‌ కార్లో బంటెంపో మీడియాతో పేర్కొన్నారు.
 
2024లో భూగోళం సగటు ఉష్ణోగ్రతలు పారిశ్రామికీకరణ కాలం 1850-190నాటి కన్నా 1.6 డిగ్రీల సెల్సియస్‌ అధికంగా వున్నాయని తెలిపారు. అంటే మానవులు కాలుష్య కారక వాయువులను వెలువరించే శిలాజ ఇంధనాలను పెద్ద మొత్తంలో వినియోగించడానికి ముందుగా వున్న ఉష్ణోగ్రతల కంటే ఇవి ఎక్కువగా వున్నాయి. అయితే శాశ్వతంగా ఈ లక్ష్మణరేఖను ఉల్లంఘించినట్లు కాదని, కానీ ఆ ప్రమాదానికి చాలా దగ్గరగా వస్తున్నామని సి3ఎస్‌ పేర్కొంది. 
 
వాతావరణంలో కాలుష్య కారక వాయువులు పేరుకుపోవడం వల్లనే రికార్డు స్థాయిలో ఇలా ఉష్ణోగ్రతలు పెరగడానికి ప్రధమ కారణమని కొపర్నికస్‌లో వ్యూహాత్మక పర్యావరణవేత్త సమంతా బర్గెస్‌ వ్యాఖ్యానించారు. కాలుష్య వాయువుల వల్ల సముద్ర మట్టాలు కూడా పెరుగుతున్నాయని, హిమనదాలు కరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
మొత్తంగా గత పదేళ్ళు కూడా రికార్డుల పరంగా అత్యంత వేడిమిని నమోదు చేసిన సంవత్సరాలని బర్గెస్‌ పేర్కొన్నారు. అమెరికా శాస్త్రవేత్తలు కూడా తమ వాతావరణ డేటాను శనివారం ప్రచురించే అవకాశం వుంది. 2015లో దాదాపు 200 దేశాలు పారిస్‌లో సమావేశమై ఉష్ణోగ్రతలను 1.5డిగ్రీల కన్నా మించకుండా చూడాలని అంగీకారం కుదుర్చుకున్నాయి. 
 
కానీ ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రపంచ దేశాలు ముందుకు సాగలేకపోతున్నాయి. ఈలోగా ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల వాతావరణ ముప్పులను ప్రజలు తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. ఇవి ప్రధానంగా నిరుపేద దేశాలను దెబ్బతీస్తున్నాయి.