ఐఆర్‌సీటీసీ కొత్త సూపర్ యాప్‌లో అన్ని రైల్వే సేవలు ఒకే చోట

ఐఆర్‌సీటీసీ కొత్త సూపర్ యాప్‌లో అన్ని రైల్వే సేవలు ఒకే చోట
 
ఐఆర్‌సీటీసీ తీసుకొస్తున్న కొత్త సూపర్ యాప్‌ ద్వారా అన్ని రకాల రైల్వే సేవలు ఒకేచోట అందుబాటులోకి రానున్నాయి.  రైల్వేశాఖకు సంబంధించి ఇకపై ఈ యాప్‌లోనే టికెట్స్‌ బుకింగ్‌, పీఎన్‌ఆర్‌ స్టేటస్‌, ట్రైన్‌ ట్రాకింగ్‌  చేసేందుకు వీలుంటుంది. అంతేకాదు రైలు ప్రయాణంలో ఫుడ్ ఆర్డర్ చేసుకునేందుకు కూడా ఈ యాప్ ఉపయోగపడుతుందట. 
 
ఇక ప్లాట్‌ఫారమ్‌ టికెట్ నుంచి జనరల్‌ టికెట్‌ వరకు ఆన్‌లైన్‌ మోడ్‌లో కొనుగోలు చేసే వీలుంటుంది. డిసెంబర్ చివరి నాటికి ఈ సూపర్ యాప్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.  ఐఆర్‌సీటీసీ ప్రస్తుతం ప్రతి ఒక్కరు వినియోగిస్తున్న యాప్‌. రైళ్లలో ప్రయాణం చేయాలనుకున్న ప్రతి ఒక్కరూ ఈ ఐఆర్‌సీటీసీని ఉపయోగిస్తున్నారు. 
 
అలాగే టికెట్‌ బుక్‌ చేసుకున్న తర్వాత పీఎన్ఆర్ స్టేటస్, రైలు లైవ్ స్టేటస్‌ తెలుసుకొనేందుకు వేర్వేరు యాప్‌లు, వెబ్‌సైట్‌లు వినియోగించాలి.  ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్‌ను 10 కోట్ల మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకొని వినియోగిస్తున్నారు. ప్రస్తుతానికి ఇదే అత్యంత ప్రజాదరణ పొందిన రైల్వే యాప్‌గా నిలిచింది. 
 
రైల్ మదద్, యూటీఎస్, సటార్క్, టీఎమ్‌సీ-నిరీక్షన్, ఐఆర్‌సీటీసీ ఎయిర్, పోర్ట్‌రీడ్‌ వంటి యాప్‌లు కూడా రైల్వే సేవలను ప్రజలకు అందిస్తున్నాయి. వీటన్నింటిలోనూ ఉన్న సేవలను ఓకే సూపర్ యాప్ ద్వారా అందించేందుకు భారతీయ రైల్వే సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సూపర్ యాప్‌ సిద్ధమైందని తెలుస్తున్నది. 
 
సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (సిఆర్ఐఎస్) అభివృద్ధి చేస్తున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. అయితే ఈ సూపర్‌ యాప్‌ని ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌తో అనుసంధానం చేసే ప్రక్రియ కొనసాగుతోందని సమాచారం. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.