6న విచారణకు కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు

6న విచారణకు కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు

ఫార్ములా ఈ-కార్‌ రేసింగ్‌ కేసులో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 6న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే ఈడీ ఈనెల 7న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. దర్యాప్తులో భాగంగా ఏసీబీ ఇప్పటివరకు కేసు ఫిర్యాదుదారు అయిన పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అయిన దానకిశోర్ నుంచి సమాచారం సేకరించింది. వాటి ఆధారంగా ఈ కేసులో నిందితులకు నోటీసులు జారీ చేస్తుంది. 

ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఏ-1గా, అప్పటి పురపాలక శాఖ కార్యదర్శి అర్వింద్‌ కుమార్ ఏ-2గా, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్‌ ఇంజినీర్ బీఎల్‌ఎన్‌ రెడ్డి ఏ-3గా ఎఫ్ఐఆర్లో పేర్కొంది. అందులో భాగంగానే విచారణ కోసం కేటీఆర్కు నోటీసులు జారీచేసింది.

మరోవైపు ఈ వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కేటీఆర్ ఇప్పటికే హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై గత నెల 31న విచారణ జరిపిన హైకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు కేటీఆర్ను అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. అయితే దర్యాప్తు జరుపుకునేందుకు అనుమతి ఇచ్చింది.

గత విచారణలో కేటీఆర్ కేటీఆర్ పిటిషన్‌పై ఏసీబీ కౌంటర్‌ దాఖలు చేసింది. ఫార్ములా ఈ-కార్‌ రేసింగ్‌ ఒప్పందం కోసం సరైన అనుమతులు లేకుండానే రూ.54 కోట్లు చెల్లించాలని ఏసీబీ పేర్కొంది. అందులోనూ రూ.46కోట్లను బ్రిటీష్ పౌండ్ల రూపంలో చెల్లించారని, ఇందుకు ఆర్బీఐ నిబంధనలు పాటించలేదని కూడా ఏసీబీ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చింది. విచారణ అనంతరం ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచి అప్పటివరకు కేటీఆర్ను అరెస్ట్ చేయవద్దని సూచించింది.

మరోవైపు ఈ కేసులో విదేశీ చెల్లింపుల వ్యవహారం కూడా ముడిపడి ఉండటంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది. కేసులో ముగ్గురు నిందితులైన కేటీఆర్, అర్వింద్‌ కుమార్, బీఎల్‌ఎన్‌ రెడ్డికి నోటీసులు జారీచేసింది. అయితే గురువారం ఈడీ ముందుకు రావల్సిన బీఎల్ఎన్ రెడ్డి ఈనెల 8న వస్తానని తెలిపారు.