ఫార్ములా ఈ కార్ కేసులో ఇద్దరు అధికారులకు ఈడీ పిలుపు 

ఫార్ములా ఈ కార్ కేసులో ఇద్దరు అధికారులకు ఈడీ పిలుపు 
ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్  విచారణ నిమిత్తం అధికారులకు మళ్లీ పిలుపునిచ్చింది. ఈనెల 8, 9 వ తేదీల్లో బీఎల్‌ఎన్‌రెడ్డి, అరవింద్‌కుమార్‌ లకు రావాల్సిందిగా పిలిచింది. తమకు కొంత సమయం కావాలని, రెండు, మూడు వారాలపాటు సమయం కావాలని కోరుతూ వారిద్దరూ గురు, శుక్రవారాలలో విచారణకు హాజరు కాలేదు. 
 
హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి గురువారం ఈడీ విచారణకు హాజరు కాలేదు. తనకు కొంత సమయం కావాలని ఆయన ఈ మెయిల్‌ ద్వారా ఈడీ అధికారులను కోరారు. శుక్రవారం విచారణకు హాజరు కావాల్సిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌ కూడా తాను రాలేనని, మరో తేదీ ఇవ్వాలని కోరారు. 
 
ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారంలో ఏసీబీ కేసులో కేటీఆర్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్‌లో ఉంది. ఆ తీర్పు వచ్చిన తర్వాత విచారణకు హాజరయ్యే విషయంపై నిర్ణయం తీసుకోవాలని బీఎల్‌ఎన్‌ రెడ్డి, అరవింద్‌ కుమార్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్‌ను ఈ నెల 7న హాజరు కావాలని ఈడీ ఇప్పటికే సమన్లు జారీ చేసింది. హైకోర్టు తీర్పు తర్వాతే కేటీఆర్‌ విచారణకు హాజరవుతారా లేదా అనే విషయం తేలే అవకాశం ఉంది.

కాగా హైదరాబాద్ ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఒక వైపు ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా, మరోవైపు ఈడీ విచారణకు సిద్ధమైంది.  ఈ వ్యవహారంలో ఆయా శాఖల ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించి, నగదు బదిలీలో అవకతవకలు నిర్ధారణకు వచ్చిన ఏసీబీ ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా బీఎల్ఎన్ రెడ్డి పేరును చేర్చింది. 

 
ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కేసును క్వాష్ చేయాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్‌కు స్వల్ప ఊరట లభించింది. తీర్పు ఇచ్చే వరకు ఎలాంటి అరెస్ట్ చేయవద్దంటూ తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 
 
ఈ లోగా ఫిర్యాదుదారుడు దాన కిషోర్‌ను ఏసీబీ అధికారులు విచారించి ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకున్నారు. తమ పరిధిలో ఉన్న హెచ్‌ఎండీఏ ద్వారానే ఎస్‌ఈవోకు దాదాపు రూ.55 కోట్ల నగదును బదిలీ చేశామని ఏసీబీ ముందు దానకిషోర్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.