కర్ణాటకలో ప్రసూతి మరణాల వెనుక డ్రగ్ మాఫియా

కర్ణాటకలో ప్రసూతి మరణాల వెనుక డ్రగ్ మాఫియా

కర్ణాటకలో సంభవిస్తున్న ప్రసూతి మరణాల వెనుక డ్రగ్ మాఫియా ఉందని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, బీజేపీ నేత ఆర్ అశోక్ సంచలన ఆరోపణలు చేశారు. దీనికి కాంగ్రెస్ పార్టీకి సంబంధాలున్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో పెరుగుతోన్న ప్రసూతి మరణాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని నియంత్రించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు.

రాయచూర్ లో 11 మంది మహిళలు, బెళగావిలో రాధిక అనే మహిళ, తిప్తుతూర్ లో ముస్లిం మహిళ మరణించారని ఆయన సోదాహరణగా వివరించారు. గతేడాది కర్ణాటకలో 736 ప్రసూతి మరణాలు సంభవించాయని ఆయన గుర్తు చేశారు. వైద్య శాఖ విభాగం వినియోగిస్తున్న 462 మందుల్లో నాణ్యత లేదని అశోక్ విమర్శించారు.

ప్రభుత్వం తీసుకుంటున్న ఈ తరహా చర్యల వల్ల వేలాది కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని మార్చాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. సమర్థవంతంగా పని చేసే వారికి ఆ పదవి అప్పగించాలని ప్రభుత్వానికి సూచించారు. 

అలాగే ఈ ప్రసూతి మరణాలపై నిజ నిర్ధారణ కమిటీ వేసి  నిజా నిజాలను వెలుగులోకి తీసుకు రావాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని జిల్లాల వారీగా ఎన్ని ప్రసూతి మరణాలు సంభవించాయో లెక్క తేల్చాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని సీబీఐతో లేదా జ్యూడిషియల్ కమిటీతో కానీ దర్యా్ప్తు చేయించాలని ప్రభుత్వానికి సూచించారు. 

అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇవేమీ చేయకుండా  నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని అశోక్ మండిపడ్డారు. రాష్ట్రంలోని ఆరోగ్య శాఖ పూర్తిగా మెడికల్ మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో సైతం లేవనెత్తుతామని ప్రతిపక్ష నేత అశోక్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.