
* తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
దివంగత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్‌కు దేశ సర్వోన్నత పౌరపురస్కారం భారతరత్న ఇచ్చి గౌరవించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. మన్మోహన్ మృతికి సంతాపం తెలిపేందుకు సోమవారం ప్రత్యేకంగా సమావేశమైన శాసనసభ ఈ మేరకు తీర్మానం చేసింది.
తొలుత సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ తరువాత మన్మోహన్‌సింగ్‌కు భారతరత్న ఇవ్వాలన్న తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ రెండు తీర్మానాలను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుత దేశంలో ఆర్థిక సంస్కరణలకు రూపశిల్పి మన్మోహన్‌సింగ్ అని కొనియాడారు. సరళీకృత విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూది దేశ దశ దిశను మార్చారని ప్రశంసించారు.
దేశ ఆర్థిక వ్యవస్థ జవజీవాలూదిన మన్మోహన్‌కు భారతరత్న ఇచ్చి గౌరవించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ ఏర్పాటుకు మార్గం సుగమమైందని గుర్తు చేశారు. ‘60 ఏండ్ల కలను సాకారం చేసిన నాయకుడు, తెలంగాణ ఏర్పాటు బిల్లును రెండు సభల్లో పాస్ చేయించిన సారథి’ అని కొనియాడారు.
తెలంగాణతో ఆయన బంధం విడదీయరానిదని, తెలంగాణకు పురుడుపోసిన డాక్టర్ అని పేర్కొన్నారు. మన్మోహన్‌ను తెలంగాణ ఆత్మబంధువుగా అభివర్ణించారు. తెలంగాణ ప్రజల గుండెల్లో మన్మోహన్ స్థానం శాశ్వతంగా ఉంటుందని చెప్పారు. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (ఎల్‌పీజీ) విధానాలతో ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను మార్చారని తెలిపారు.
ఉపాధి హామీ పథకాన్ని తొలుత అనంతపురం, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి ప్రారంభించారని గుర్తుచేశారు. రాష్ట్రం లో మన్మోహన్ విగ్రహాన్ని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఏర్పాటు చేయాలనుకుంటున్నామని, ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందో సభ్యులు సూచనలు, సలహాలివ్వాలని కోరారు.
సరళీకృత ఆర్థిక విధానాలతో మన్మోహన్‌సింగ్ దేశాన్ని బలమైన శక్తిని నిలిపారని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఉపాధి హామీ పథకం దేశ స్థితినే మార్చేసిందని చెప్పారు. సంతాప తీర్మానంపై మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌రాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఆర్థికశాఖ మంత్రిగా, ప్రధానిగా దేశానికి మన్మోహన్‌సింగ్ చేసిన సేవలను శ్లాఘించారు.
సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం తరపున ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, బీజేపీ తరపున ఎమ్మెల్యే కే వెంకటరమణారెడ్డి మాట్లాడారు. బీఆర్‌ఎస్ తరపున ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి సంతాప తీర్మానంపై మాట్లాడారు. అనంతరం మన్మోహన్‌సింగ్‌కు భారతరత్న అవార్డు ఇవ్వాలన్న తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు.
More Stories
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్!
ముగ్గురు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు
హైకోర్టు స్టేకు కాంగ్రెస్ కారణం.. వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి