
తెలంగాణాలో క్రైం రేట్ దారుణంగా పెరిగింది. తీవ్రమైన నేరాలు నిరుటి కంటే ఈ ఏడాది అత్యధికంగా 22.53శాతం పెరిగాయి. అంతర్రాష్ట్ర దొంగలు రాష్ట్రంలో తిష్టవేశారని పోలీసులను, ప్రభుత్వాన్ని మీడియా జాగృత పర్చినా.. క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోకపోవడంతో రాష్ట్రంలో సగటున ప్రతిరోజూ 78 చొప్పున వివిధ రకాల దొంగతనాలు జరుగుతున్నాయి. ఇక ఈ ఏడాది రాష్ట్రంలో కిరాయి హత్యల సంఖ్య భారీగా పెరిగింది.
రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరుకు, శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పట్టే వివరాలను డీజీపీ జితేందర్ ఆదివారం వార్షిక క్రైం నివేదిక రూపంలో వెల్లడించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది మొదటి 11 నెలల్లో అన్ని రకాల నేరాలు 10శాతం పెరిగినట్టు ఆ నివేదిక వెల్లడించింది. ఇందులో తీవ్రమైన నేరాలు 22.53 శాతం పెరగడం ఆందోళనకరం. రాష్ట్రంలో మహిళలు, ఎస్సీ, ఎస్టీలపై నేరాల సంఖ్య దారుణంగా పెరిగింది. గతంతో పోల్చితే రేప్‌కేసులు 2945 (28.94%), మహిళల హత్యలు 13.15శాతం పెరిగాయి. ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులు 363 పెరిగాయి.
దీంతో మహిళలను కంటికి రెప్పలా చూసుకుంటున్నామని చెప్తున్న మాటలు నీటిమూటలేనని తేలిపోయింది. ఇక ఎస్సీలు, ఎస్టీలపై జరిగిన నేరాలు ప్రభుత్వ నిర్లక్ష్యపూరితమైన పాలనకు అద్దం పడుతున్నాయని నిపుణులు విమర్శిస్తున్నారు. నిరుడు ఎస్సీ, ఎస్టీలపై 1,877 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 11 నెలల్లోనే 2,257 (20.24% పెరుగుదల) కేసులు నమోదయ్యాయి. ఈ బాధితుల్లో 18 ఏండ్ల లోపు వారు 1251 మంది ఉండగా.. 18 ఏండ్లు పైబడిన వారు 274 మంది ఉన్నారు.
ఈ ఏడాది 11 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,34,158 కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య నిరుడు 2,13,121గా నమోదైంది. దీంతో మొత్తం కేసుల్లో క్రైమ్ రేట్ 9.87శాతం పెరిగినట్టు వెల్లడైంది. 2023లో 39,371 కేసుల్లో శిక్షలు పడగా, ఈ ఏడాది కేవలం 28,477 కేసుల్లో మాత్రమే (-27.67శాతం) శిక్షల రేటు నమోదైంది. వీటిలో 3 మరణ శిక్షలు ఉన్నాయి.
18 జీవిత ఖైదు, మూడేండ్ల నుంచి ఏడేండ్లకు పైగా శిక్షలు 3, ఏడాది నుంచి 3 ఏండ్లకు విధించిన శిక్షలు 11 ఉన్నాయి. ఇక 3 రేప్ కేసుల్లో నలుగురికి జీవిత ఖైదు, మరో 5 కేసుల్లో ఐదుగురికి 20 ఏండ్ల జైలు విధించారు. మహిళల పట్ల నేరాలకు పాల్పడిన 51 కేసుల్లో 70 మందికి జీవిత ఖైదు విధించారు. ఇక 77 పోక్సో కేసుల్లో, 82 మందికి జీవిత ఖైదు విధించారు.
ఒకటి రెండు ఘటనలు మినహా రాష్ట్రం ప్రశాంతంగా ఉందని వార్షిక క్రైమ్ నివేదిక విడుదల సందర్భంగా డీజీపీ జితేందర్ తెలిపారు. రాష్ట్రంలో మొత్తంగా నేరాల సంఖ్య 9.87 శాతం పెరిగిందని అంగీకరించారు. సైబర్ నేరాలు 43.44 శాతం పెరిగాయని, డ్రగ్స్‌పై ఉకుపాదం మోపుతున్నామని చెప్పా రు. గంజాయి 20 టన్నులు సీజ్ చేశామని, పెద్ద మొత్తంలో సింథటిక్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 23,491 రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా 6,640 మంది మృతిచెందినట్టు తెలిపారు. మహిళలపై దాడులు, వేధింపులు 4.78 శాతం పెరిగాయని పేర్కొన్నారు.
More Stories
హెచ్‌సీఏ వ్యవహారంపై ఈడీ దృష్టి
భారత్‌కు నష్టం కలిగించారనే ఒక్క ఫొటో చూపించగలరా?
రాజాసింగ్ రాజీనామా ఆమోదించిన జేపీ నడ్డా