యెమెన్‌లో కేరళ నర్సుకు ఉరి శిక్ష

యెమెన్‌లో కేరళ నర్సుకు ఉరి శిక్ష
 
* ఆమెకు అన్నివిధాలా సాయం చేస్తామని భారత్ హామీ
 
యెమెన్ దేశంలో అక్కడి వ్యక్తిని హత్య చేసిన కేసులో దోషిగా తేలి ఉరిశిక్ష పడిన భారతీయ నర్సు నిమిషా ప్రియ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను యెమెన్‌ అధ్యక్షుడు రషద్ అల్-అలిమి తిరస్కరించారు. దాంతో ఆమెకు మరణశిక్షకు అధ్యక్షుడి ఆమోదం లభించినట్లయ్యింది. అయితే నర్సు మరణిశిక్షకు ఆమోదం తెలిపిన అధ్యక్షుడు, ఆ శిక్ష అమలుకు మాత్రం నెల రోజుల గడవు ఇచ్చారు.

ఈ పరిణామాలపై కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. యెమెన్‌లో నిమిషా ప్రియా మరణశిక్ష అంశం తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. శిక్ష నుంచి ప్రియను బయటపడేయటానికి ఆమె కుటుంబం చేస్తున్న ప్రయత్నాలు, పడుతున్న ఆవేదనను తాము అర్థం చేసుకున్నామని పేర్కొంది. ఈ విషయంలో భారత ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు.

నిమిషా ప్రియను ఉరిశిక్ష నుంచి తప్పించడానికి ఆమె కుటుంబసభ్యులు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో యెమెన్ అధ్యక్షుడు ఆమె క్షమాభిక్షను తిరస్కరిండం దిగ్భ్రాంతికి గురిచేసిందని జైశ్వాల్‌ పేర్కొన్నారు. నిమిషా ప్రియ 2017లో తలాల్ అబ్దో మహదీ అనే యెమెన్ పౌరుడి నుంచి తన పాస్‌పోర్ట్‌‌ను తీసుకునే క్రమంలో అతడికి మత్తుమందు ఇంజెక్ట్ చేసి హతమార్చినట్లు కేసు నమోదైంది. 

అనంతరం పోలీసుల విచారణలో ఆమె హత్యకు పాల్పడినట్లు నిర్ధారణ అయ్యింది. దాంతో ట్రయల్‌ కోర్టు 2018లో నిమిషాకు ఉరిశిక్ష విధించింది. దానిపై నర్సు నిమిషా సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసింది. కానీ, సుప్రీంకోర్టు కింది కోర్టు తీర్పునే సమర్థించింది. దాంతో నిమిషా ప్రియ యెమెన్‌ అధ్యక్షుడిని క్షమాభిక్ష కోరింది.

కేరళలోని పాలక్కడ్ జిల్లాకు చెందిన నిమిషా ప్రియ ఉపాధి కోసం 2014లో భర్త, కూతురితో కలిసి యెమెన్‌కు వెళ్లారు. ఆర్థిక కారణాలవల్ల భర్త థామస్, కూతురు కొద్ది రోజుల్లోనే స్వదేశానికి వచ్చారు. ప్రియ మాత్రం అక్కడి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తూ ఏడాది తర్వాత సొంతంగా క్లినిక్ ఏర్పాటు చేసుకోవాలని భావించింది.

అందుకోసం తన భర్త స్నేహితుడైన తలాల్ అబ్దో మహదీ సహాయం కోరింది. అక్కడ విదేశీయులు ఏదైనా సొంత వ్యాపారం లేదా సంస్థ ఏర్పాటు చేయడానికి అవసరమయ్యే లైసెన్స్ పొందాలంటే  యెమెన్‌ చట్టాల ప్రకారం విదేశీ పౌరులు స్థానిక భాగస్వాములు కలిసి వ్యాపారం నిర్వహించాలని ఉంది.  దీంతో స్థానికుడైన మహదీని క్లీనిక్‌లో పార్టనర్‌గా చేర్చుకుంది.

అయితే మహదీ కొన్ని సంవత్సరాలుగా తనను వేధించాడని, వ్యాపారం నుండి డబ్బు వసూలు చేసుకున్నాడని నిమిషి ఆ దేశ అధికార ప్రతినిధులకు తెలిపింది. ఈ విషయంలో పోలీసులను ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోయింది.  ఈ క్రమంలో నిమిషా ప్రియ పాస్‌పోర్టును తన దగ్గర పెట్టుకున్న తలాల్ అబ్దో ఆ తర్వాత దాన్ని తిరిగి ఇచ్చేందుకు నిరాకరించాడు.

దాంతో నిమిషా తన పాస్‌పోర్టును తిరిగి తీసుకోవడం కోసం అతడికి మత్తుమందు ఇచ్చింది. స్పృహ కోల్పోయిన తర్వాత తన పాస్‌పోర్టు తీసుకోవాలనుకుంది. అయితే మత్తుమందు ఓవర్‌డోస్‌ కావడం వల్ల మహదీ చనిపోయాడు. ఆ మత్తుమందు వల్లే మహదీ చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. 2017లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి 2018లో నిమిషి ప్రియకు యెమెన్‌ కోర్టు మరణశిక్ష విధించింది.

అయితే హత్యకు గురైన మహది కుటుంబ సభ్యులు, గిరిజన నేతలు క్షమాభిక్ష పెడితే.. ఆమె మరణశిక్ష నుంచి బయటపడే అవకాశం ఉంది. ఈ కేసు నుంచి తన కుమార్తెను రక్షించుకోవడం కోసం నిమిషి తల్లి కుమారి తీవ్రంగా పోరాడుతున్నారు. ఆమె సంవత్సరం క్రితమే యెమెన్‌కు వెళ్లారు. మహదీ కుటుంబ సభ్యులకు పరిహారంగా డబ్బును ఇచ్చేందుకు వారితో చర్చలు జరుపుతున్నారు. ఒకవేళ మహదీ కుటుంబ సభ్యులు పరిహారాన్ని అంగీకరిస్తే.. నిమిషి ప్రియకు మరణ శిక్ష తప్పే అవకాశం వుంది.