ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా కె. విజయానంద్ నియమితులయ్యారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ(పొలిటికల్) కార్యదర్శి ఎస్. సురేశ్‌కుమార్ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మంగళవారం(31వ తేదీ) పదవీ విరమణ చేయన్నారు. ఈ నేపథ్యంలో తదుపరి ప్రధాన కార్యదర్శిగా కె. విజయానంద్‌ను సీఎం చంద్రబాబు ఎంపిక చేశారు. అనంతరం ఆయన నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు విడుదలయ్యాయి.
కాగా, ఈ పోస్టుకు ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారుల పేర్లు వినిపించాయి. వీరిలో జి. సాయి ప్రసాద్ పేరు ప్రముఖంగా తెరమీదికి వచ్చింది. అయితే, ఈయనకు సర్వీసు ఇంకా ఉండడంతో విజయానంద్ వైపే చంద్రబాబు మొగ్గు చూపారు. కాగా, తనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు విజయానంద్ ధన్యవాదాలు తెలిపారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకానికి సంబంధించిన జీవో జారీకి ముందు సీనియర్ ఐఏఎస్ అధికారులు సాయిప్రసాద్, విజయానంద్‌లతో ఉండవల్లిలోని తన నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఇద్దరూ సీనియర్లే అయినప్పటికీ ప్రత్యేక పరిస్థితుల్లో విజయానంద్‌కు సీఎ్‌సగా అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. ఇద్దరూ రాష్ర్టాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. సీనియర్ ఐఏఎస్ ల సహయ, సహకారాలు ప్రభుత్వానికి చాలా అవసరమని వివరించారు.
తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కె. విజయానంద్ ఉమ్మడి కడప జిల్లాకు చెందినవారు. 1992 ఐఏఎస్ బ్యాచ్‌కి చెందిన ఆయన ఉమ్మడి, విభజిత ఏపీలలో కీలక పోస్టుల్లో పనిచేశారు. విద్యుత్ సహా పలు రంగాల మంచి పట్టుసాధించారు. 1993లో తొలుత ఆదిలాబాద్ జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్‌గా విధుల్లో చేరిన ఆయన 1996లో రంపచోడవరం సబ్ కలెక్టర్‌గా, గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టు డైరెక్టర్‌గా పని చేశారు. 1997-2007 మధ్య ఉమ్మడి ఏపీలో రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు.
అనంతరం శ్రీకాకుళం, నల్గొండ జిల్లాల్లో కలెక్టర్‌గా సేవలందించారు. 2016-2019 మధ్య ఐటీ అండ్ ఎలకా్ట్రనిక్స్ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. 2019-2021 మధ్య రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2022లో ఏపీ జెన్కో చైర్మన్‌గా ఉన్న ఆయన 2023లో ఏపీ ట్రాన్స్‌కో చైర్మన్, ఎండీగా సేవలందించారు.
విద్యుత్ రంగంలో ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది. దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ రంగంపై అవగాహన ఉండడంతో పాటు విద్యుదుత్పత్తి, ప్రసారం, పంపిణీపై అపారమైన అనుభవం సొంతం చేసుకున్నారు. ఏపీతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్ రంగానికి సంబంధించిన సమస్యలు తలెత్తినప్పుడు వాటి పరిష్కారానికి ఆయన ఇచ్చిన సలహాలు, సూచనలు ఎంతో దోహదపడ్డాయి.

More Stories
పరకామణి కేసులో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు
చిత్తూర్ మేయర్ దంపతుల హత్య కేసులో ఐదుగురికి ఉరిశిక్ష
భగవద్గీతపై టిటిడి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యల దుమారం