
పన్నెండేళ్లకోసారి జరిగే మహా కుంభమేళాకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ సిద్ధమవుతోంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ 45 రోజుల పాటు ప్రయాగ్ రాజ్ లో మహా కుంభ మేళా జరుగనున్నది. ఈ కుంభమేళాకు ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. మహా కుంభమేళాను ఘనంగా నిర్వహించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.7,500 కోట్లు ఖర్చుచేసి విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
ప్రయాగ్ రాజ్ లో జరిగే కుంభమేళాలో పాల్గొని అయోధ్యలోని రామ్ లల్లా ఆలయాన్ని కూడా భక్తులు సందర్శిస్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఆదివారం జరిగిన మన్ కీ బాత్’ కార్యక్రమంలో కూడా ప్రధాని నరేంద్రమోదీ మహా కుంభమేళాను ప్రస్తావిస్తూ ఇది ఐక్యతా మేళా అని పేర్కొన్నారు.
ఆధ్యాత్మికత, సంస్కృతి, భద్రత, ఆధునికతల మేళవింపుగా ఈ కుంభమేళా నిర్వహించాలని కేంద్ర సాంస్కృతిక శాఖ తెలిపింది. దీన్ని ఘనంగా నిర్వహించేందుకు భారీ ప్రణాళికతో సిద్ధమవుతోంది. భద్రత విషయంలో రాజీ పడకుండా 50 వేల మంది సిబ్బందిని మోహరించనుంది. నిరంతర నిఘా కోసం తొలిసారిగా నీటిలోపల 100 మీటర్ల లోతులోని వస్తువులను సైతం గుర్తించే సామర్థ్యం కలిగిన అండర్ వాటర్ (జలాంతర) డ్రోన్లను తొలిసారి ఉపయోగించనున్నారు.
కుంభమేళా కోసం కృత్రిమ మేధ (ఏఐ)తో కూడిన 2,700 సీసీ కెమెరాలతో 24 గంటలూ రియల్‌టైమ్ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరిగినా వెంటనే స్పందించేలా అత్యాధునిక మల్టీ డిజాస్టర్ రెస్పాన్స్ వాహనాలను అందుబాటులో ఉంచనున్నారు.
కుంభమేళా సమాచారం తెలుసుకోవడానికి 11 భారతీయ భాషల్లో ఏఐ చాట్ బోట్‌లు ఏర్పాటు చేశారు. భక్తులకు తాత్కాలిక వసతి కల్పనకు వేల సంఖ్యలో టెంట్లు, షెల్టర్లతో మహా కుంభ్ నగర్ నిర్మిస్తున్నారు. దీన్ని గూగుల్ మ్యాప్ తోనూ అనుసంధానిస్తారు. కుంభమేళాకు వచ్చిన భక్తులకు చికిత్స చేసేందుకు తాత్కాలిక దవాఖానలు కూడా ఏర్పాటు చేశారు. ఒకేసారి 200 మందికి చికిత్స అందించేందుకు వీలుగా బీష్మ క్యూబ్ ఏర్పాటు చేస్తున్నారు.
మరోవైపు, ‘నేత్ర కుంభ్’ శిబిరం ద్వారా 5 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 3 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేసి గిన్నిస్ రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మహా కుంభమేళాకు విచ్చేసే భక్తులకు ప్రత్యేక అనుభూతిని అందించేందుకు యూపీ ప్రభుత్వం 2వేలకు పైగా డ్రోన్లతో భారీ డ్రోన్ షోను కూడా ఏర్పాటు చేస్తోంది
భక్తులు కుంభ మేళాలో ఆయా ప్రదేశాలకు వెళ్లేందుకు ఆంగ్లం, హిందీ, ప్రాంతీయ భాషల్లో 800 బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక 92 రోడ్లు పునర్నిర్మిస్తున్నారు. 17 ప్రధాన రహదారుల సుందరీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. అవాంఛనీయ ఘటనలు జరక్కుండా అత్యాధునిక బహుళ విపత్తు నివారణ వాహనాలను మోహరిస్తున్నారు. సౌర విద్యుత్ తో లైటింగ్ వసతులు కల్పిస్తున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించారు
More Stories
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం
‘మోహన్‌లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు