గోడను ఢీకొట్టి పేలిపోయిన విమానం – 179 మంది మృతి

గోడను ఢీకొట్టి పేలిపోయిన విమానం – 179 మంది మృతి

దక్షిణ కొరియాలోని ముయాన్‌ ఎయిర్‌పోర్టులో ఘోర విమాన ప్రమాదం జరిగింది. థ్యాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ నుంచి ముయాన్‌కు వచ్చిన బెజూ ఎయిర్‌ ఫ్లైట్‌కు చెందని 7సి2216 బోయింగ్‌ విమానం ల్యాండ్ అవుతుండగా అదుపుతప్పింది. రన్‌వేపై రక్షణ గోడను ఢీకొని పేలిపోయింది. భారీగా మంటలు చెలరేగాయి. దీంతో విమానంలోని 179 మంది సజీవదహనమయ్యారు. మరో ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయపడ్డారు.

ఘటనా సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది సహా మొత్తం 181 మంది ఉన్నట్లు జెజూ విమానయాన సంస్థ ప్రకటించింది. కాగా, విమానం ల్యాండ్‌ కావడానికి ప్రయత్నించిన సమయంలో ల్యాండింగ్‌ గేర్‌ సమస్యతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానం వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు.

స్థానిక కాలమాన ప్రకారం ఉదయం 9 గంటలకు ఈ ఘోర విమాన ప్రమాదం జరిగింది. విమానం రన్‌వేపై ల్యాండ్‌ అవుతున్న సమయంలో ముందు చక్రం తెరుచుకోకపోవడంతో విమానం రన్‌వేకు తగిలింది. ఈ క్రమంలో విమానం అదుపు తప్పి రన్‌వే పక్కన ఏర్పాటు చేసిన కాంక్రీటు గోడను ఢీకొట్టడంతో విమానంలో ఇంధనం ఒక్కసారిగా మండిపోయి మంటలు వ్యాపించాయని తెలిపారు. 

దట్టమైన నల్లని పొగలు ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. 32 అగ్ని మాపక ట్రక్కులు, హెలికాప్టర్లు హుటాహుటిన అక్కడి చేరుకుని మంటలను అదుపు చేశాయి. అయితే అప్పటికే అంతా మృత్యువాతపడ్డారు. ఇద్దరు విమాన సిబ్బంది మినహా మిగతా అందరూ చనిపోయినట్లు నట్లు అధికారులు వెల్లడించారు. వారిలో 173 మంది దక్షిణ కొరియాకు చెందినవారు కాగా, ఇద్దరు థాయ్‌ జాతీయులని తెలిపారు.

థాయ్‌ల్యాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ నుంచి దక్షిణ కొరియా వస్తుండగా ప్రమాదం జరిగినట్లు ఆ దేశ విమానయాన శాఖ తెలిపింది. దేశంలోని అతి దిగ్భ్రాంతికర విమాన ప్రమాద ఘటనల్లో ఇదీ ఒకటని ప్రకటించింది. విమానం ముందు చక్రం తెరుచుకోకపోవడానికి గల కారణాలపై విచారణ చేస్తున్నట్లు తెలిపింది. పక్షుల గుంపును ఢీకొట్టడం వల్ల ఈ సమస్య తలెత్తిందా? అని అనుమానం వ్యక్తమవుతున్నాయి. 

ఘటనపై పలు దేశాలు విచారం వ్యక్తం చేశాయి. మృతుల కుటుంబాలకు దక్షిణ కొరియా ప్రభుత్వం సానుభూతి తెలిపింది. బాధితులకు అండగా ఉంటామని ప్రకటించింది. కజకిస్థాన్‌లో అజర్‌బైజాన్‌ ఎయిర్‌లైన్స్‌ విమాన ప్రమాదంలో 38 మంది దుర్మరణం పాలై, వారం కూడా కాకముందే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం.

ఇంజిన్​ను పక్షి ఢీకొనడం, వాతావరణ పరిస్థితులు కారణంగా విమాన ప్రమాదం జరిగి ఉండొచ్చని దక్షిణ కొరియా ఫైర్‌ చీఫ్‌ లీ జియోంగ్‌ హైయూన్‌ తెలిపారు. ఉమ్మడి విచారణ తర్వాత ప్రమాదానికి గల కచ్చితమైన కారణాన్ని వెల్లడిస్తామని పేర్కొన్నారు. మరోవైపు, జరిగిన ప్రమాదానికి థాయ్‌ లాండ్​కు చెందిన జేజు ఎయిర్‌ సంస్థ క్షమాపణలు తెలిపింది. ప్రమాద నివారణకు తాము శక్తివంచన లేకుండా ప్రయత్నించినట్లు పేర్కొంది. బాధిత కుటుంబాలకు సాయం చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటించింది.