
* కాంగ్రెస్ అధిష్టానంపై మండిపడ్డ ప్రణబ్ కుమార్తె
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు విడిగా స్మారకాన్ని నిర్మించాలని కోరుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిపాదన పంపడాన్ని మాజీ రాష్ట్రపతి ప్రణాబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ విమర్శించారు. 2020 ఆగస్టులో తన తండ్రి మరణించినపుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలో సంతాప సమావేశాన్ని నిర్వహించాలన్న ఆలోచన కూడా కాంగ్రెస్ నాయకత్వానికి లేకుండా పోయిందని శనివారం ఒక ఎక్స్ పోస్ట్‌లో ఆమె మండిపడ్డారు.
ఆ సమయంలో కాంగ్రెస్ నాయకత్వం తనను తప్పుదారి పట్టించిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, డా. మన్మోహన్ సింగ్ పెరిగే స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను ఆమె సమర్థించారు. దానిని మంచి ఆలోచనగా ఆమె అభివర్ణించారు.
ప్రణబ్ ముఖర్జీ డాక్టర్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని కోరుకున్నారని, కానీ “వివరించాల్సిన అవసరం లేని” కారణాల వల్ల అది జరగలేదని అంటూ ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు. “డాక్టర్ సింగ్‌కు స్మారక చిహ్నం ఏర్పాటు చేయడం గొప్ప ఆలోచన. ఆయన దానికి అర్హుడు. రాష్ట్రపతిగా బాబా ఆయనకు రెండు సార్లు భారతరత్న ఇవ్వాలని కోరుకున్నారు. కానీ అది బహుశా వివరించాల్సిన అవసరం లేని కారణాల వల్ల జరగలేదని” ఆమె పేర్కొన్నారు.
భారత రాష్ట్రపతులకు సంతాప సమావేశాలు నిర్వహించే అలవాటు పార్టీకి లేదని కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నాయకుడు ఒకరు తనతో అన్నారని ఆమె చెప్పారు. అయితే, మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ మృతి చెందినపుడు సీడబ్ల్యూసీ సమావేశాన్ని ఏర్పాటు చేసి తన తండ్రే స్వయంగా సంతాప సందేశాన్ని రాసినట్టు తన తండ్రి డెయిరీల ద్వారా తనకు తెలిసిందని ఆమె వెల్లడించారు.
గాంధీ కుటుంబ సభ్యులు కానందువల్లే పార్టీకి చెందిన రాజనీతిజ్ఞులను సైతం పార్టీ ఎలా అగౌరపరిచిందో బీజేపీ నేత సీఆర్ కేశవన్ రాసిన ఓ పోస్టును శర్మిష్ఠ ప్రస్తావించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ఢిల్లీలో స్మారకాన్ని కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం నిర్మించలేదని శర్మిష్ఠా ముఖర్జీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
More Stories
సామరస్యపూర్వక, వ్యవస్థీకృత హిందూ సమాజ నిర్మాణం
`సర్వ స్పర్శి, సర్వవ్యాపి’గా ఆర్ఎస్ఎస్ అన్ని అంశాల స్పృశి
జస్టిస్ వర్మపై సుప్రీం అంతర్గత విచారణ