నితీశ్‌ రెడ్డి సూపర్‌ సెంచరీ.. టెస్ట్‌ కెరీర్‌లో తొలి శతకం

నితీశ్‌ రెడ్డి సూపర్‌ సెంచరీ.. టెస్ట్‌ కెరీర్‌లో తొలి శతకం
 
* చంద్రబాబు అభినందనలు… ఏసీఏ రూ. 25 లక్షల నజరానా

మెల్‌బోర్న్‌లో తెలుగు కుర్రాడు నితీశ్‌ రెడ్డి అద్భుతం సృష్టించాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నాడు. సీనియర్లంతా నిరాశపర్చినా ఆసీస్‌ బౌలర్లను ఆడుకున్నాడు. ఒక సిక్స్‌, 9 ఫోర్లతో సెంచరీతో కదం తొక్కాడు. ఆల్‌రౌండర్లు జడేజా, సుందర్‌ సహకారంతో జట్టు స్కోరును 350 దాటించాడు. 

99 రన్స్‌ వద్ద ఫోర్‌ కొట్టి టెస్టుల్లో ఘనంగా తొలి సెంచరీ నమోదుచేశాడు. ఈ సందర్భంగా ప్రేక్షకుల్లో ఉన్న నితీశ్‌ తండ్రి భావోద్వేగానికి లోనయ్యారు. కుమారుడి శతకం చూసిన ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు. ఎనిమిదో స్థానంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ నిలిచాడు. ఇంతకుముందు అనిల్‌ కుంబ్లే ఈ ఘనత సాధించాడు.

సెంచరీ సాధించిన విశాఖపట్నం యువకుడు కె.నితిష్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. టెస్టు మ్యాచ్​లలో ఈ ఘనత సాధించిన భారతీయ క్రికెటర్లలో మూడో అతి పిన్న వయస్కుడు కావడం మరింత సంతోషం కలిగిస్తున్నదని తెలిపారు. 

రంజీలో ఆంధ్రా తరఫున ఎన్నో విజయాలు సాధించిన నితీశ్ కుమార్ రెడ్డి, అండర్ 16లో సైతం అద్భుత విజయాలు అందుకున్న విషయం మనకు తెలిసిందేనని చెప్పారు. ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలని, భారత క్రికెట్ జట్టులో ఉండి దేశ కీర్తిప్రతిష్టలను ఇనుమడింప జేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు.

మెల్‌బోర్న్‌ టెస్టులో శతకం సాధించిన నితీశ్‌కు మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. విశాఖ కుర్రాడు నితీష్‌కుమార్‌రెడ్డి ఆసీస్‌పై అద్భుత శతకం చేశారని కొనియాడారు. ఒత్తిడిలోనూ నితీశ్‌కుమార్‌రెడ్డి అద్భుత శతకం సాధించారని, అతని ధైర్యం, పట్టుదల, సంకల్ప శక్తిని చూసి గర్విస్తున్నామని పేర్కొన్నారు.

బాక్సింగ్‌ డే టెస్ట్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్‌లో శనివారం మూడో రోజు సెంచరీ చేసిన విశాఖ కుర్రాడు నితీష్‌రెడ్డిని ఆంధ్ర క్రికెట్‌ అసోషియేషన్‌(ఏసీఏ) అభినందిస్తూ ఏసీఏ తరుఫున రూ.25 లక్షల నగదు ప్రోత్సాహాకాన్ని అందజేస్తామని ఏసీఏ అధ్యక్షుడు, పార్లమెంట్‌ సభ్యుడు కేశినేని శివనాథ్‌ ప్రకటించారు.

 
త్వరలోనే సీఎం చేతుల మీదుగా నగదు బహుమతిని అందిస్తామని వెల్లడించారు. దేశంలోనే అత్యాధునిక వసతులతో అమరావతిలో స్టేడియాన్ని నిర్మిస్తామని తెలిపారు. ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడేలా విశాఖ స్టేడియం సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు . ఏపీకి కూడా ఐపీఎల్‌ టీమ్‌ ఉండేలా ఏసీఏ ఆలోచన చేస్తోందని అన్నారు.
కాగా, నితీశ్‌ తన తొలి సెంచరీ తర్వాత మరో రెండు పరుగులు జోడించిన తర్వాత.. బ్యాడ్‌ లైట్‌ కారణంగా అంపైర్లు మ్యాచ్‌ నిలిపివేశారు. దీంతో గ్రౌండ్‌ స్టాఫ్‌ పిచ్‌ను కవర్స్‌తో కప్పేయడంతో మూడో ఆట ముగిసింది. మూడో రోజు మూడు వికెట్లే కోల్పోయిన టీమ్‌ఇండియా 191 రన్స్‌ చేసింది. మొత్తంగా 9 వికెట్లు కోల్పోయి 355 రన్స్‌ చేసింది. 
 
ప్రస్తుతం నితీశ్‌ (104), సిరాజ్‌ (2) రన్స్‌తో నాటౌట్‌గా ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ మరో 116 రన్స్‌ వెనుకపడి ఉన్నది. పంత్‌ (28), జడేజా (17) రన్స్‌ చేశారు. టీమ్‌ఇండియా తరఫున నితీశ్‌ 104 రన్స్‌తో టాప్‌ స్కోరర్‌గా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్‌, బోలాండ్‌ 3 వికెట్ల చొప్పున తీయగా, నాథన్‌ 2 వికెట్లు పడగొట్టాడు.