కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ హామీ గాలికే

కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ హామీ గాలికే
‘మేము అధికారంలోకి వస్తే ఏడాదిలో ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు అన్నీ భర్తీ చేస్తాం’ అంటూ గత ఏడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ముందు కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. యువతను ఆకర్షించి ఓట్లు వేయించుకుంది. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టి ఏడాది మీద ఏడు నెలలు గడుస్తున్నది. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ఇప్పటివరకు నిలబెట్టుకోలేదు.
 
పైగా పదవీ విరమణలతో ఖాళీల సంఖ్య మరింత పెరుగుతున్నది. ఈ ఒక్క ఏడాదే 20,466 ఖాళీలు పెరిగాయి. దీంతో ఇప్పుడు రాష్ట్రంలోని మూడింట ఒక వంతు ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. గ్యారెంటీల పేరుతో ఇచ్చిన ఉచిత హామీల భారంతో సిద్ధరామయ్య ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ఊసే ఎత్తడం లేదు.

కర్ణాటకలో 7.72 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. గత ఏడాది వీటిల్లో 2.55 లక్షల ఖాళీలు ఉండగా, ఇప్పుడు 2.76 లక్షలకు పెరిగాయి. అంటే, ప్రతి మూడు ఉద్యోగాల్లో ఒకటి ఖాళీ ఉన్నట్టు లెక్క. సిబ్బంది కొరతతో ప్రభుత్వ సేవలు కుంటుపడుతున్నాయి. చిన్న చిన్న పనులకు సైతం ప్రజలు నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. 

కీలకమైన వ్యవసాయ శాఖలో ఏకంగా 65 శాతం ఖాళీలు ఉన్నాయి. మేనిఫెస్టోలో చెప్పినట్టు ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తుందని ఆశతో కాంగ్రెస్‌కు ఓట్లేసిన యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నది. గ్యారెంటీల పేరుతో ఇచ్చిన ఉచిత హామీల ఆర్థిక భారం వల్లే ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి. 

ఇప్పటివరకు గ్యారెంటీలకు ప్రభుత్వం రూ.63,000 కోట్లు ఖర్చు చేసింది. ఈ పథకాలకే ఇంత ఖర్చు అవుతున్న నేపథ్యంలో కొత్త ఉద్యోగులకు వేతనాలు ఇచ్చే పరిస్థితి లేక ఉద్యోగాల భర్తీ చేపట్టడం లేదని ప్రతిపక్ష బీజేపీ విమర్శిస్తున్నది. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ చెప్పిన మాటకు, ఇప్పుడు చెప్తున్న మాటలకు పొంత ఉండటం లేదు. 

ఉద్యోగాలు కల్పించేందుకు, సృష్టించేందుకు ప్రభుత్వం ఏమీ ఏజెన్సీ కాదని ఆ పార్టీ సీనియర్‌ ఎమ్మెల్యే, రాష్ట్ర పాలనా సంస్కరణల కమిషన్‌ చైర్మన్‌ ఆర్వీ దేశ్‌ పాండే చెప్పుకొచ్చారు. ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగాలు కల్పిస్తాయని చెప్పారు. కొన్ని శాఖల్లో నియామకాలు అవసరం కాగా, పనిభారం లేని వారి గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలని ఆయన వ్యాఖ్యానించారు.