అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరికొన్ని రోజుల్లో అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకున్న అధికారాలతో వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న అనేక మందికి క్షమాభిక్ష ప్రసాదిస్తున్నారు. ఇందులో భాగంగానే మూడు రోజుల క్రితం ఫెడరల్ మరణశిక్షను ఎదుర్కొంటున్న 40 మంది ఖైదీల్లో 37 మందికి శిక్ష తగ్గించిచారు.
అయితే, బైడెన్ చర్యను కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ఫెడరల్ ఖైదీల విషయంలో కఠినంగా ఉండాలని స్పష్టం చేశారు. తాను బాధ్యతలు చేపట్టాక అలాంటి వారిని క్షమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక రేపిస్టులు, హంతకులకు మరణ శిక్ష అమలు చేస్తానని స్పష్టం చేశారు. ఈ విషయంపై న్యాయ శాఖను ఆదేశిస్తానని తెలిపారు. దేశంలో మళ్లీ శాంతి భద్రతలను పునరుద్ధరిస్తానని వెల్లడించారు.
మరణశిక్షలకు సంబంధించి అమెరికాలో ఆయా రాష్ట్రాల్లో వేర్వేరు నిబంధనలు ఉన్నాయి. మొత్తం 50 రాష్ట్రాల్లో 23 రాష్ట్రాలు మరణశిక్షను రద్దు చేశాయి. మరో ఆరు రాష్ట్రాలు తాత్కాలికంగా నిలిపివేశాయి. మిగతా రాష్ట్రాల్లో మరణశిక్ష అమలవుతోంది. అయితే, తోటి ఖైదీలను హతమార్చిన వారికి, బ్యాంకు దోపిడీల సమయంలో హత్యలు చేసిన వారికి మరణ శిక్ష విధిస్తున్నాయి.
1988 నుంచి ఇప్పటి వరకు 79 మందికి న్యాయస్థానాలు మరణశిక్ష విధించగా కేవలం 16 మందికి మాత్రమే శిక్ష అమలు చేశారు. అందులోనూ ట్రంప్ తొలిసారి అధ్యక్షుడు అయ్యాక ఆరు నెలలలోనే 13 మందికి మరణ శిక్ష అమలు చేశారు. ప్రస్తుతం మరణ శిక్ష పడిన ఖైదీల సంఖ్య 40 ఉండగా.. వీరిలో 37 మందికి తాజాగా బైడెన్ క్షమాభిక్ష ప్రసాదించారు.

More Stories
పాకిస్థాన్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దారుణ హత్య
జాఫ్నాలో బయటపడిన 582 అస్థిపంజరాలు
భగవత్ కెనడా పర్యటనకు 100కు పైగా బృందాల మద్దతు