ఇకపై బెనిఫిట్‌ షోలు, టికెట్‌ రేట్ల పెంపు ఉండదు

ఇకపై బెనిఫిట్‌ షోలు, టికెట్‌ రేట్ల పెంపు ఉండదు
ఇకపై బెనిఫిట్‌ షోలు, టికెట్‌ రేట్ల పెంపు ఉండదని, ఈ విషయమై రాష్ట్ర శాసనసభలో చెప్పిన మాటకు తాను కట్టుబడి ఉన్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు.చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో గురువారం రెండు గంటలకు పైగా జరిపిన సమావేశంలో ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలకు సినీ పరిశ్రమ సహకరించాలని కోరారు.
 
సినీ పరిశ్రమకు చెందిన పలు అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. రానున్న రోజుల్లో ఇండస్ట్రీ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై నివేదిక రూపొందించి సర్కార్ అందజేయనున్నట్లు తెలిపారు.
 
డ్రగ్స్‌కు వ్యతిరేకంగా, మాదక ద్రవ్యాల నిర్మూలనకు సహాయం అందించాలంటూ సినీ ప్రముఖుల ముందు పలు ప్రతిపాదనలు ఉంచారు. ప్రతి సినిమా ప్రదర్శనకు ముందు డగ్స్‌కు వ్యతిరేకంగా యాడ్‌ ప్లేచేయాలని స్పష్టం చేశారు. సినిమా టికెట్లపై విధించే సెస్సును ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ నిర్మాణానికి వినియోగించాలని ముఖ్యమంత్రి తెలిపారు. 
 
ఉద్దేశపూర్వకంగా ఎవరిపైనా కేసులు పెట్టలేదని సీఎం రేవంత్‌ స్పష్టత ఇస్తూ ఈ సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని సినీ ప్రముఖులకు పోలీసులు చూపించారు. టాలీవుడ్‌కు తమ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా కల్పించారు. తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడంతోనే ఆ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నామని సీఎం పేర్కొన్నారు. 
 
తెలంగాణలో శాంతిభద్రతల విషయంలో రాజీ లేదని చెబుతూ ఇక నుంచి బౌన్సర్లపై సీరియస్‌గా ఉంటామని తెలిపారు. అభిమానుల్ని కంట్రోల్‌ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనన్నారు. ప్రభుత్వం ఇండిస్టీతో ఉంటుందనే భరోసానిచ్చారు. తెలంగాణ రైజింగ్‌లో ఇండిస్టీ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీతో ఉండాలని కోరారు. టెంపుల్‌ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్‌ చేయాలని, ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలోనూ ఇండిస్టీ సహకరించాలని సూచించారు.
 
తెలుగు సినీ పరిశ్ర‌మ‌ను ప్ర‌పంచ‌స్థాయికి తీసుకువెళ్ల‌డమే ల‌క్ష్యంగా ఈ భేటీ జ‌రిగిన‌ట్లు భేటీ అనంత‌రం ఎఫ్‌డీసీ చైర్మ‌న్ దిల్ రాజు మీడియాకు తెలిపారు.
హైదరాబాద్ ను ఇంర్‌నేష‌న‌ల్ ఫిలిం హ‌బ్‌గా మార్చ‌డానికి కృషి చేస్తామని చెబుతూ  తెలంగాణ‌ సామాజిక కార్య‌క్రామ‌ల్లో ఫిలిం ఇండ‌స్ట్రీ నుంచి స‌హ‌కారం ఉండాల‌ని ప్ర‌భుత్వం కోరిందని చెప్పారు.
 
 డ్ర‌గ్స్, గంజాయి లాంటి ఆవ‌గాహ‌న కార్య‌క్రమాల్లో ఇక‌నుంచి న‌టీన‌టులు పాల్గోంటారని పేర్కొంటూ బెనిఫిట్ షో, టికెట్ల రేట్ల పెంపు అంశం అనేది చాలా చిన్న విష‌యం అని పేర్కొన్నారు. ఆ రెండింటికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. కొన్ని ఘ‌ట‌న‌ల వ‌ల‌న ప్ర‌భుత్వానికి సినీ ప‌రిశ్ర‌మకు గ్యాప్ వ‌చ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగిందని, అయితే అది నిజం కాదని స్పష్టం చేశారు. టాలీవుడ్ అభివృద్ధిపై 15 రోజుల్లో నివేదిక ఇస్తాం అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చారు.
 
 ఈ సమావేశంలో ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, డిజిపి జితేందర్ పాల్గొన్నారు. అల్లు అరవింద్‌, బోయపాటి శ్రీను, సి కల్యాణ్‌, రాఘవేంద్ర రావు, త్రివిక్రమ్‌, హరీశ్‌ శంకర్‌, నాగార్జున, వెంకటేశ్‌, మురళీ మోహన్‌, దగ్గుబాటి సురేశ్‌, వంశీ పైడిపల్లి తదితరులు హాజరయ్యారు.