ఎన్‌హెచ్‌ఆర్‌సి నూతన చైర్మన్‌గా రామసుబ్రమణియన్‌

ఎన్‌హెచ్‌ఆర్‌సి నూతన చైర్మన్‌గా రామసుబ్రమణియన్‌

జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) నూతన చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ జడ్జి వి.రామసుబ్రమణియన్‌ సోమవారం నియమితులయ్యారు. న్యాయమూర్తి రామసుబ్రమణ్యాన్ని నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.  జూన్‌1న సుప్రీంకోర్టు మాజీ జడ్జి అరుణ్‌ కుమార్‌ మిశ్రా పదవి విరమణ చేసినప్పటి నుండి ఈ పదవి  ఖాళీగా ఉంది. ప్రస్తుతం ఎన్‌హెచ్‌ఆర్‌సి సభ్యురాలు విజయ భారతి సయానీ తాత్కాలిక చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు.

భారతదేశ మాజీ ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) లేదా సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జిని ఎంపిక కమిటీ సిఫార్సుపై రాష్ట్రపతి ఎన్‌హెచ్‌ఆర్‌సి చైర్మన్‌గా నియమిస్తారు.  గతంలో మాజీ సిజెఐలు హెచ్‌.ఎల్‌.దత్తు, కె.జి. బాలకృష్ణన్‌లు ఎన్‌హెచ్‌ఆర్‌సి చైర్మన్‌లుగా బాధ్యతలు చేపట్టారు. ఎన్‌హెచ్‌ఆర్‌సి తదుపరి చైర్‌పర్సన్‌ను ఎంపిక చేసేందుకు ప్రధాని మోడీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ ఈనెల 18న సమావేశం నిర్వహించింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, ఆ పార్టీ నేత రాహుల్‌ గాంధీలు రాజ్యసభ, లోక్‌సభలో ప్రతిపక్ష నేతలుగా ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఎన్‌హెచ్‌ఆర్‌సీ కొత్త చైర్మన్‌గా నియమితులైన జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యం మద్రాసు లా కాలేజీలో న్యాయవిద్య పూర్తి చేశారు. 1983 ఫిబ్రవరి 16న బార్ మెంబర్‌గా పేరు నమోదు చేసుకున్నారు. మద్రాసు హైకోర్టులో 23 ఏళ్లు లాయర్‌గా ప్రాక్టీసు చేశారు. 2006 జూలై 31న మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులై, 2009 నవంబర్ 9న శాశ్వత జడ్జిగా బాధ్యతలు నిర్వహించారు. 

తన సొంత రిక్వెస్ట్‌ మీద 2016 ఏప్రిల్ 27న హైదరాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. రెండు రాష్ట్రాల విభజన తర్వాత 2019 జనవరి 1 నుంచి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా కొనసాగారు. 2019 జూన్ 22 నుంచి హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌‌గా ఉన్నారు. 2019 సెప్టెబర్ 23న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2023 జూన్ 29న ఆయన పదవీ విరమణ చేశారు. 

కాగా, ఎన్‌హెచ్‌ఆర్‌సి సభ్యులుగా శ్రీప్రియాంక్ కనూంగో, డాక్టర్ జస్టిస్ బిద్యుత్ రంజన్ సారంగి(రిటైర్డ్)లను నియమించారు. కనూంగో ఇదివరకు నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్‌సిపిసిఆర్)చైర్‌పర్సన్‌గా పనిచేశారు. కమిషన్ సభ్యునిగా తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తానని ఆయన సోమవారం వెల్లడించారు.