
* జేపీసీకి జమిలి ఎన్నికల బిల్లు
పార్లమెంట్‌లో శీతాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. విపక్ష సభ్యుల ఆందోళనల నేపథ్యంలో ఉభయసభలను నిరవధికంగా వాయిదా వేశారు. అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై విపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తుండగానే స్పీకర్ ఓం బిర్లా లోక్ సభ ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా సభలో ఉన్నారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అవమాన పరిచారంటూ ఇండియా కూటమి నేతలు శీతాకాల సమావేశాల చివరి రోజైన శుక్రవారం నిరసన చేపట్టారు. విపక్ష నేతల నిరసనకు పోటాపోటీగా ఎన్డీఏ ఎంపీలు సైతం ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. దీంతో సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
విపక్షాల నిరసనల మధ్యే శుక్రవారం రాజ్యసభ సమావేశాన్ని మధ్యాహ్నం 12గంటలకు ఛైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ వాయిదా చేశారు. సభలో ప్రతిష్టంభనను ముగించే ప్రయత్నంలో భాగంగా సభా నాయకుడు జేపీ నడ్డా, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే సహా ప్రతిపక్ష పార్టీల నాయకులతో ధన్‌ఖడ్ భేటీ అయ్యారు. సభను సజావుగా సాగేలా చూడాలని వారిని కోరారు.
రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటలకు మళ్లీ ప్రారంభమైన తర్వాత జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును జేపీసీకి పంపేందుకు తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ను జగ్దీప్ ధన్‌ఖడ్ కోరారు. ఈ తీర్మానం వాయిస్ ఓటుతో ఆమోదం పొందింది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాజ్యసభ పని చేసింది కేవలం 43 గంటల 27 నిమిషాలేనని ఛైర్మన్ ధన్‌ఖడ్ తెలిపారు. పార్లమెంటేరియన్లుగా తాము దేశ ప్రజల నుంచి తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటున్నామని వ్యాఖ్యానించారు. సమావేశాల నిరంతర అంతరాయాలు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజలకు విశ్వాసాన్ని క్రమంగా సన్నగిల్లేలా చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. అర్థవంతమైన చర్చ జరగాలని కోరుతూ సభను నిరవధిక వాయిదా వేశారు.
విపక్ష సభ్యుల నిరసన మధ్యే లోక్‌సభ శుక్రవారం సమావేశమైంది. జమిలి ఎన్నికల ముసాయిదాను జేపీసీకి పంపాలన్న తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ను స్పీకర్ ఓం బిర్లా కోరారు. ఆ సమయంలో విపక్ష సభ్యులు ‘జై భీమ్’ ‘జై భీమ్’ అని నినాదాలు చేశారు. అయినప్పటికీ జమిలి ఎన్నికల బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.
కాగా, ఎంపీలు పార్లమెంటులో ప్రదర్శనలు, నిరసనలకు దిగితే చర్యలు తప్పవని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం హెచ్చరించారు. అంబేడ్కర్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా అవమానించారంటూ పార్లమెంటు ఆవరణలో అధికార, విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో ఓం బిర్లా ఈ వ్యాఖ్యలు చేశారు.
“పార్లమెంట్ ఆవరణలో ఎక్కడైనా ప్రదర్శనలు లేదా నిరసనలు చేయొద్దు. అలా చేస్తే ఎంపీలపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పార్లమెంటు గేట్ల వద్ద ఎలాంటి నిరసనలు లేదా ప్రదర్శనలు నిర్వహించడం సరికాదు. ఈ విషయంలో మీరు నిబంధనలను పాటించాలి. ఈ హెచ్చరికను సీరియస్‌గా తీసుకోవాలని నేను మిమ్మల్ని మరోసారి కోరుతున్నాను” అని స్పీకర్ ఓం బిర్లా లోక్ సభ నిరవధిక వాయిదాకు ముందు వ్యాఖ్యానించారు.
డిల్లీలోని విజయ్ చౌక్ వద్ద ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు ధర్నా చేపట్టారు. అంబేడ్కర్‌ను అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని నినాదాలు చేస్తూ విజయ్ చౌక్ నుంచి పార్లమెంట్ వరకు ర్యాలీగా వచ్చి తమ నిరసనను తెలిపారు. ఈ క్రమంలో బీజేపీ సర్కార్ పై ప్రియాంక విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీపై కేసులు పెట్టడం బీజేపీ నైరాశ్యాన్ని తెలియజేస్తుందని ఎద్దేవా చేశారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైన వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు