
ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అధ్యక్షుడు, హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా (89) శుక్రవారం కన్నుమూశారు. గురువారం రాత్రి ఆయనకు గుండె పోటు రాగా, ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆయనను వైద్యులు రక్షించలేకపోయారని పార్టీ అధికార ప్రతినిధి తెలిపారు. మాజీ ఉపప్రధాని దేవీలాల్ కుమారుడైన ఓం ప్రకాశ్ చౌతాలా హరియాణాకు ఐదు సార్లు (1989 నుంచి 2005 వరకు) ముఖ్యమంత్రిగా పనిచేశారు.
సుదీర్ఘకాలం హర్యానా రాజకీయాలలో మేటి నాయకుడిగా కొనసాగారు. జాతీయ రాజకీయాలలో సహితం తనదైన ముద్రవేశారు. హర్యానా రాజకీయాల్లో దిగ్గజనేతగా పేరున్న చౌతాలా 1935 జనవరిలో ఓం ప్రకాష్ చౌతాలా జన్మించారు. హర్యానాకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా, దేశ ఆరవ ఉప ప్రధానమంత్రిగా పనిచేసిన చౌదరి దేవీలాల్ తనయుడే ఓం ప్రకాష్ చౌతాలా.
తన తండ్రి అడుగుజాడల్లోనే ఓం ప్రకాష్ చౌతాలా సైతం ప్రముఖ నేతగా రాజకీయాల్లో ఎదిగారు. చౌతాలా తన హయాంలో రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించారు. 1987లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై 1990 వరకూ సేవలందించారు. నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎన్డీయే) అసోసియేషన్‌తో తన రాజకీయ సత్తాను చాటుకున్నారు. కాగా, వివాదాలు, లీగల్ చిక్కులు కూడా ఆయన చవిచూశారు.
కాగా, 2000లో అధికారంలో ఉన్నప్పుడు 3,206 మంది ఉపాధ్యాయులను అక్రమంగా నియమించినట్లు ఓం ప్రకాష్ చౌతాలా, ఆయన కుమారుడు అజయ్ సింగ్ చౌతాలాపై ఆరోపణలు వచ్చాయి. టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి 2013లో వారిద్దరికి పదేళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. అయితే తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించిన వారికి 2021లో ఢిల్లీ ప్రభుత్వం ఆరు నెలల ప్రత్యేక ఉపశమనం కల్పించడంతో చౌతాలా జైలు నుంచి విడుదలయ్యారు.
మరోవైపు 16 ఏళ్ల నాటి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ కోర్టు 2022 మే 27న చౌతాలాకు నాలుగేళ్ల జైలు శిక్షతోపాటు రూ.50 లక్షల జరిమానా విధించింది. ఈ నేపథ్యంలో 87 ఏళ్ల వయస్సులో అత్యంత వృద్ధ ఖైదీగా తీహార్ జైలులో ఆయన గడిపారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ ఏడాది అక్టోబర్ 5న జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సందర్భంగా ఓం ప్రకాష్ చౌతాలా చివరిసారిగా బహిరంగంగా కనిపించారు. సిర్సాలోని చౌతాలా గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యలకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు.”చౌతాలా చాలా ఏళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా పని చేశారు. తన తండ్రి దేవీ లాల్ పనులను మరింత ముందుకు తీసుకెళ్లడానికి నిరంతరం కృషి చేశారు” అని ఎక్స్ వేదికగా మోదీ ట్వీట్ చేశారు.
ఓం ప్రకాశ్ చౌతాలా మృతిపై హరియాణా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ట్వీట్ చేశారు. ‘చౌతాలా మరణం చాలా బాధాకరం. ఆయనకు నా నివాళులు. ఆయన తన జీవింతాంతం రాష్ట్రానికి, సమాజానికి సేవ చేశారు. ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటు’ అని తెలిపారు.
More Stories
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం