చంచ‌ల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుద‌ల‌

చంచ‌ల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుద‌ల‌
 
* అరెస్ట్ ను ఖండించిన కేంద్ర మంత్రులు అశ్వని వైష్ణవ, కిషన్ రెడ్డి
 
టాలీవుడ్ న‌టుడు అల్లు అర్జున చంచ‌ల్‌గూడ జైలు నుంచి శ‌నివారం ఉద‌యం 6.40 గంట‌ల‌కు విడుద‌ల‌య్యారు. ఈ మేర‌కు చంచ‌ల్ గూడ జైలు అధికారులు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. విడుదలైన వెంటనే గీతా ఆర్ట్స్ ఆఫీస్‌కు వెళ్లిన బన్నీ.. ఆ తర్వాత ఇంటికి చేరుకున్నారు.
 
మీడియాతో మాట్లాడుతూ తాను చట్టాలను గౌరవిస్తానని తెలిపారు. ‘సంధ్య థియేటర్ ఘటన బాధాకరం. తొక్కిసలాట ఘటనలో మహిళ చనిపోవడం దురదృష్టకరం. రేవతి కుటుంబానికి నేను అన్ని విధాలా అండగా ఉంటా. 20 ఏళ్లుగా థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూస్తున్నా. ఆ రోజు ఘటన అనుకోకుండా జరిగింది. నేను చట్టాలను గౌరవిస్తా. లీగల్ అంశాలపై ఇప్పుడే ఏమీ మాట్లాడలేను’ అని చెప్పారు. తనకు మద్దతుగా నిలిచిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
కాగా, కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ సైతం అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించారు. క్రియేటివ్ ఇండస్ట్రీ పట్ల కాంగ్రెస్‌కు గౌరవం లేదని.. అల్లు అర్జున్ అరెస్టుతో ఇది మరోసారి రుజువైందని అశ్వనీ వైష్ణవ్ తెలిపారు.
 
‘‘సంధ్య థియేటర్ ఘటన రాష్ట్ర, స్థానిక యంత్రాంగం పేలవ ఏర్పాట్లకు నిదర్శనం. ఆ నింద నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లకు దిగుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం సినీ ప్రముఖులపై నిరంతరాయంగా దాడులు చేయడం కాకుండా.. బాధితులకు చేయూతను అందించడంతోపాటు.. ఆ రోజు ఏర్పాట్లు చేసిన వారిని శిక్షించాలి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏడాది కాలంలో ఇది ఆనవాయితీగా మారడం బాధాకరం’’ అని అశ్వనీ వైష్ణవ్ తన అభిప్రాయాన్ని ఎక్స్‌లో పోస్టు చేశారు.
 
  సినీ హీరో అల్లు అర్జున్ అరెస్టు ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి విమర్శించారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు సంబంధిత అధికారులకు ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ అరెస్టు చేయడం ఉద్దేశపూర్వకంగా జరిగినట్లు అర్థమవుతోందని తెలిపారు. 
ఈ కార్యక్రమ వేదిక వద్ద భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులదని, కానీ అది చేయకుండా వ్యక్తిగతంగా అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం సరికాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సినీ నటులను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారనేది మరోసారి నిరూపితమైందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ అరెస్టును, పాలకుల అధికార దుర్వినియోగాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు.

కోర్టు నాలుగు వారాల పాటు మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరు చేసినా హైకోర్టు నుంచి బెయిల్ పత్రాలు జైలు అధికారులు శుక్ర‌వారం రాత్రి ఆల‌స్యంగా అందడంతో ఆయ‌న రాత్రంతా జైల్లోనే ఉండాల్సి వ‌చ్చింది.