సుఖ్‌బీర్‌ బాదల్​పై గోల్డెన్ టెంపుల్​ వద్ద కాల్పులు

సుఖ్‌బీర్‌ బాదల్​పై గోల్డెన్ టెంపుల్​ వద్ద కాల్పులు
పంజాబ్‌లోని అమృత్‌స‌ర్‌లో ఉన్న స్వ‌ర్ణ దేవాల‌యం గేటు వ‌ద్ద బుధవారం ఉద‌యం సేవ‌లో భాగంగా విధులు నిర్వ‌హిస్తున్న ఆ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాద‌ల్‌పై కాల్పులు జ‌రిగాయి. సిక్కు మ‌త పెద్ద‌లు వేసిన శిక్ష‌లో భాగంగా సుఖ్‌బీర్ సింగ్ స్వ‌ర్ణ‌దేవాల‌యం గేటు వ‌ద్ద డ్యూటీ నిర్వ‌హిస్తున్నారు.
 
కాల్పులు జ‌ర‌ప‌బోయిన షూట‌ర్‌ను ప‌ట్టుకున్నారు. బాద‌ల్‌తో పాటు గేటు వ‌ద్ద ఉన్న శిరోమ‌ణి నేత‌లు ఆ షూట‌ర్‌ను అడ్డుకున్నారు. కొన్ని బుల్లెట్లు ఫైర్ అయ్యాయి. అయితే అదృష్ట‌వ‌శాత్తు సుఖ్‌బీర్‌కు ఏమీ కాలేదు. నెమ్మ‌దిగా న‌డుచుకుంటూ వ‌చ్చిన ఓ వ్య‌క్తి సుఖ్‌బీర్ ద‌గ్గ‌ర‌కు రాగానే ప్యాంటులో నుంచి రివాల్వ‌ర్ తీసి ఫైర్ చేశాడు. ఈ ఘ‌ట‌న‌కు చెందిన వీడియో రిలీజ్ చేశారు.
శిరోమ‌ణి అకాలీ ద‌ళ్ నేత సుఖ్‌బీర్ సింగ్ బాద‌ల్‌ మంగ‌ళ‌వారం కూడా గోల్డెన్ టెంపుల్ గేటు వ‌ద్ద సేవాదార్ డ్యూటీ నిర్వ‌హించారు. మ‌త‌ప‌ర‌మైన శిక్ష‌కు సంబంధించిన ఫ‌ల‌క‌ను మెడ‌లో వేసుకున్న ఆయ‌న‌ మ‌రికొంత మంది నేత‌ల‌తో క‌లిసి డ్యూటీ చేశారు. శ్రీ అకాల్ త‌క్త్ సాహిబ్ కింద ఆయ‌న‌కు ఆ శిక్ష‌ను ఖ‌రారు చేశారు. 

సాద్ నేత సుఖ్‌దేవ్ సింగ్ దిండ్సా కూడా మెడ‌లో ఫ‌ల‌క‌ను, చేతిలో బ‌ల్లాన్ని ప‌ట్టుకుని గేటు వ‌ద్ద సెంట్రీ విధులు నిర్వ‌హించారు. సేవ చేయాల‌న్న ఆదేశం ఇచ్చార‌ని, ఇది దేవుడు ఇచ్చిన ఆదేశంగా భావిస్తాన‌ని, అకాల్ త‌క్త్‌లో భాగంగా ఇది జ‌రిగింద‌ని, గేటు వ‌ద్ద కూర్చుంటాన‌ని, లంగ‌ర్‌లో కూడా సేవ చేయ‌నున్న‌ట్లు సుఖ్‌బీర్ బాద‌ల్ తెలిపారు.

సుఖ్‌బీర్ మ‌త‌ప‌ర‌మైన ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డిన‌ట్లు సిక్కు పెద్ద‌లు ఇటీవ‌ల తీర్మానించారు. టంక‌య్య‌గా ఆయ‌నకు ముద్ర వేశారు. దీంతో శిక్ష‌లో భాగంగా సుఖ్‌బీర్ స్వర్ణ‌దేవాల‌యం గేటు వ‌ద్ద సేవ‌లో పాల్గొన్నారు. కాల్పులకు పాల్ప‌డిన నిందితుడిని నారాయ‌ణ్ సింగ్ చౌరాగా గుర్తించారు. అత‌ను గురుదాస్‌పూర్ జిల్లాకు చెందిన వ్య‌క్తి. భద్రతా సిబ్బంది అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని నారైన్‌ సింగ్‌ చౌరాగా గుర్తించారు. అతడు గతంలో బబ్బర్‌ ఖల్సా ఇంటర్నేషనల్‌ అనే ఉగ్ర ముఠాలో పనిచేసినట్లు పలు మీడియాల్లో కథనాలు వస్తున్నాయి.