బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేయడానికి ఐదు చట్టాల్లో సవరణలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏటికేడు బ్యాంకింగ్ రంగం పరిణామం చెందుతున్న క్రమంలో బ్యాంకుల పాలనా వ్యవహారాలను మెరుగపర్చడం, పెట్టుబడిదారుల ప్రయోజనాలను పరిరక్షించడం కోసం ‘బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు-2024’ను తీసుకొచ్చినట్లు తెలిపింది.
తాజా సవరణలతో బ్యాంకింగ్ రంగంలో పాలనా వ్యవహారాలు పటిష్ఠమవడంతో పాటు ఖాతాదారుల సౌలభ్యం పెరుగుతుందని, పెట్టుబడిదారులకు రక్షణ కల్పించినట్లువుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. మంగళవారం ఆమె ‘బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు-2024’ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
ఐదు బ్యాంకింగ్ చట్టాల్లో మొత్తం 19 సవరణలను ప్రతిపాదించినట్లు తెలిపారు. ఈ బిల్లును లోక్‌సభ మూజువాణీ ఓటుతో ఆమోదించింది. అయితే, భారత బ్యాంకింగ్ రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరించేందుకే ఈ బిల్లును తెస్తున్నారని టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ విమర్శించారు. ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ వాటాను 51 నుంచి 26 శాతానికి తగ్గించాలన్నదే కేంద్రం ఉద్దేశమని ఆరోపించారు.
బ్యాంకింగ్ బిల్లులో కీలక ప్రతిపాదనలు
- బ్యాంకు ఖాతాదారులు ప్రస్తుతం ఒక నామినీని మాత్రమే ఎంచుకునే వీలుండగా.. ఇకపై నలుగురిని నామినీలుగా ఎంచుకోవచ్చు.
- క్లెయిమ్ చేసుకోని డివిడెండ్లు, షేర్లు, బాండ్ల ఉపసంహరణ నిధులను ‘ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ (ఐఈపీఎ్‌ఫ)’లోకి బదిలీ చేసుకోవచ్చు. ఈ ఫండ్ నుంచి వినియోగదారులు సొమ్ములను బదిలీ/రిఫండ్ చేసుకోవచ్చు. మదుపరుల ప్రయోజనాలను రక్షించేందుకే ఈ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
- బ్యాంకుల్లో డైరెక్టర్ పదవిని ఆశించే వారి కనీస వాటా ప్రస్తుత చట్టాల ప్రకారం బ్యాంకుల ఈక్విటీలో రూ.5 లక్షలుగా ఉండగా.. ఆ పరిమితిని రూ.2 కోట్లకు పెంచాలని ప్రతిపాదించారు. ఈ మొత్తాన్ని 60 ఏళ్ల కిందట నిర్ధారించినందున తాజాగా పెంచాలని నిర్ణయించారు.
- సహకార బ్యాంకుల డైరెక్టర్ల పదవీ కాలాన్ని 8 నుంచి పదేళ్లకు పెంచారు.
- ఆడిటర్లకు ఇవ్వాల్సిన పారితోషికాన్ని నిర్ణయించడంలో బ్యాంకులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు.
More Stories
ఐక్యత, సమానత్వం అసాధారణ సంగమంగా మహాకుంభ మేళా
రైతులతో 14న చర్చలకు కేంద్రం సిద్ధం.. చికిత్సకు జగ్జీత్ సింగ్ అంగీకారం
సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన బంగ్లాదేశ్ వాసి అరెస్ట్!