
పోలీస్ కానిస్టేబుళ్ల పనిభారం తగ్గించేందుకు సాంకేతికతను ఉపయోగించుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. భువనేశ్వర్ లో
జరిగిన 59వ అఖిల భారత డైరెక్టర్ జనరల్స్/ఇన్‌స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ కాన్ఫరెన్స్ ముగింపు సమావేశంలో సీనియర్ పోలీసు అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆధునీకరణపై దృష్టి సారించాలని, ‘విక్షిత్ భారత్’ దార్శనికతతో పునర్నిర్మించాలని పోలీసులను కోరారు.
డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలు, ఎఐ సాంకేతికత, ముఖ్యంగా సామాజిక, కుటుంబ సంబంధాలకు అంతరాయం కలిగించే డీప్‌ఫేక్ సంభావ్యత కారణంగా ఉత్పన్నమయ్యే సంభావ్య బెదిరింపులపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశపు కృత్రిమ మేధస్సు , ఆకాంక్షాత్మక భారతదేశం రెట్టింపు కుత్రిమ మేధస్సు శక్తిని ఉపయోగించడం ద్వారా ఈ సవాళ్ళను అవకాశంగా మార్చుకోవాలని ప్రధాన మంత్రి పోలీసు నాయకత్వానికి పిలుపునిచ్చారు.
వనరుల కేటాయింపునకు పోలీస్ స్టేషన్‌ను కేంద్ర బిందువుగా మార్చుకోవాలని ప్రధాని సూచించారు. భద్రతా సవాళ్ల జాతీయ,అంతర్జాతీయ కోణాలపై విస్తృత చర్చలు జరిగాయని, సదస్సు సందర్భంగా ఉద్భవించిన ప్రతివ్యూహాలపై సంతృప్తిని వ్యక్తం చేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అర్బన్ పోలీసింగ్‌లో తీసుకున్న చర్యలను ప్రశంసించిన మోదీ, ప్రతి చొరవను క్రోడీకరించి దేశంలోని 100 నగరాల్లో పూర్తిగా అమలు చేయాలని సూచించారు.
కీలకమైన సమస్యలను పరిష్కరించడంలో హ్యాకథాన్‌లు సాధించిన విజయాన్ని చర్చిస్తూ, నేషనల్ పోలీస్ హ్యాకథాన్ను నిర్వహించే దిశగా సమాలోచనలు జరపాలని ప్రధానమంత్రి సూచించారు. అలాగే ఓడరేవుల భద్రతపై ప్రధాన దృష్టి సారించి దానికోసం భవిష్యత్ ప్రణాళిక రూపొందించాల్సిన అవసరాన్ని ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు.
హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సర్దార్ వల్లభభాయ్ పటేల్ చేసిన అసమానమైన సేవలను ప్రధాని గుర్తు చేసుకున్నారు. వచ్చే ఏడాది సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా హోంమంత్రిత్వ శాఖ నుంచి పోలీసు స్టేషన్ వరకు మొత్తం భద్రతా వ్యవస్థలో పోలీసు స్థాయిని, వృత్తి నైపుణ్యాన్ని, సామర్థ్యాలను మెరుగుపరిచేలా ఏదో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని సాధించడం ద్వారా ఆయనకు నివాళులు అర్పించాలని సూచించారు.
స్మార్ట్ పోలీసింగ్ యొక్క మంత్రాన్ని విస్తరించాలని చెబుతూ పోలీసులు వ్యూహాత్మకంగా, సూక్ష్మంగా, అనుకూలతతో, విశ్వసనీయంగా, పారదర్శకంగా మారాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు హాజరయ్యారు. కొత్తగా అమలులోకి వచ్చిన ప్రధాన క్రిమినల్ చట్టాల అమలు, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, వామపక్ష తీవ్రవాదం, సైబర్ నేరాలు, ఆర్థిక భద్రత, వలసలు, తీరప్రాంత భ్రదత, మాదక ద్రవ్యాల అక్రమరవాణా సహా ఇప్పటికే ఉన్న, కొత్తగా పుట్టుకొస్తున్న భద్రతాపరమైన సవాళ్లపై విస్తృత చర్చలు జరిగాయి.
More Stories
ప్రెస్ మీట్ లో ఫోన్ నెంబర్ ఇచ్చి చిక్కుల్లో రాహుల్!
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం
బంధుప్రీతి లేని ఏకైక ప్రదేశం ‘సైన్యం’