బియ్యం అక్రమ ఎగుమతి వెనుక పెద్దవాళ్ళు

బియ్యం అక్రమ ఎగుమతి వెనుక పెద్దవాళ్ళు

రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కాకినాడ పోర్టులో ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీలు చేపట్టారు. ఎగుమతికి సిద్ధంగా ఉంచిన రేషన్ బియ్యాన్ని పవన్ కల్యాణ్ పరిశీలించారు.  పోర్టు నిర్వాహకుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. బియ్యం స్మగ్లింగ్ చేస్తుంటే ఏం చేస్తున్నారంటూ డీఎస్పీ రఘువీర్ విష్ణువు, ఎమ్మెల్యే కొండబాబుని పవన్ కల్యాణ్ నిలదీశారు.

కాకినాడ పోర్టులో 1064 టన్నుల బియ్యం సంచులను పరిశీలించారు. ఇటీవల పౌరసరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్ ఆధ్వర్యంలో అక్రమ బియ్యం తరలింపును అడ్డుకొని వాటిని అధికారులు పోర్టులోనే ఉంచారు. అదే విధంగా 2 రోజుల క్రితం కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టగా, సముద్రం లోపల సుమారు 9 నాటికల్ మైళ్ల దూరంలో రవాణాకు సిద్ధమై వెళుతున్న స్టెల్లా ఎల్ పనామా షిప్లో 640 టన్నుల రేషన్‌ బియ్యం పట్టుబడిన విషయం తెలిసిందే.

 తాజాగా స్టెల్లా ఎల్ పనామా షిప్లో పట్టుబడిన 640 టన్నుల బియ్యం సంచులను స్వయంగా బోటులో సముద్రంలోకి వెళ్లి పవన్‌ కల్యాణ్ పరిశీలించారు. భారీగా బియ్యం రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై పవన్ మండిపడ్డారు. ప్రజాప్రతినిధులు వచ్చి బియ్యం అక్రమ రవాణా ఆపితేగానీ మీరు ఆపలేరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బియ్యం అక్రమ రవాణాలో ఎవరు ఉన్నా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రేషన్ బియ్యం ఇష్టానుసారం తరలిస్తున్నవారు ఎంతవారైనా చర్యలు తీసుకోవాలని అన్నారు. తనిఖీల అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత అయిదేళ్లలో కాకినాడ పోర్టును స్మగ్లింగ్‌ హబ్‌గా మార్చారని, తాము వచ్చాక 51 వేల టన్నుల రేషన్ బియ్యం పట్టుకున్నామని తెలిపారు. 

కాకినాడ పోర్టుకు రోజుకు సుమారు వెయ్యి లారీలు వస్తాయని, సెక్యూరిటీ 16 మందే ఉన్నారని తెలిపారు. కాకినాడ పోర్టు నుంచి జరిగే అక్రమాలు ఆపుతామని గతంలో హామీ ఇచ్చామని గుర్తు చేశారు. బియ్యం అక్రమ రవాణాను గతంలో డ్రోన్‌ ద్వారా చిత్రీకరించామని పవన్ కల్యాణ్ తెలిపారు.

కాకినాడ పోర్టు నుంచి సరకుల ఎగుమతులు జరగాలని, అక్రమాలు జరిగేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. కాకినాడ పోర్టు అధికారులు తనకు కూడా సహకరించలేదని, బియ్యం అక్రమ రవాణాపై డీప్‌ నెట్‌వర్క్ పనిచేస్తోందని ఆరోపించారు. బియ్యాన్ని కొన్ని దేశాలకు అక్రమంగా ఎగుమతి చేస్తున్నారని, అక్రమ ఎగుమతులపై ప్రత్యేక దృష్టి సారించామని పవన్ తెలిపారు. 

మిల్లులు, గిడ్డంగుల్లో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టుకున్నామన్న పవన్, రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బియ్యం అక్రమ రవాణాలో ఉన్న అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాకినాడ యాంకరేజ్‌ పోర్టు నుంచి బియ్యం అక్రమంగా ఎగుమతి చేస్తున్నారని, అక్రమ రవాణాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు.

రేషన్ బియ్యం పేదప్రజలకు మాత్రమే అందాలన్న పవన్, కిలో రేషన్ బియ్యానికి సుమారు రూ.43 ఖర్చు అవుతోందని వెల్లడించారు. రేషన్ బియ్యం వేలమందికి ఉపాధిగా మారిందని, కోర్టులకు వెళ్లి తన పైనే ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. పోర్టు సీఈవోకు నోటీసులు పంపాలని, ఓడను సీజ్ చేయాలని ఆదేశించారు. కాకినాడ పోర్టుకు భద్రత పెంచాలని కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తానని తెలిపారు.

 కిలో రేషన్ బియ్యాన్ని రూ.73కు అమ్ముతున్నారని తెలిసిందని పవన్ చెప్పారు. కొందరు వ్యాపారులు రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేస్తూ రూ.వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. రేషన్ బియ్యం అక్రమాలు, అవినీతిని అరికడతామన్న పవన్, పారదర్శక పాలన అందిస్తామని ప్రజలకు మాటిచ్చామని గుర్తు చేశారు. 

రేషన్ బియ్యం అక్రమ ఎగుమతి వెనుక పెద్దవాళ్లు ఉన్నారని, సీఐడీ, సీబీఐ, ఎవరితో విచారణ చేయించాలో త్వరలో చెబుతామని స్పష్టం చేశారు. కాకినాడ యాంకర్‌ పోర్టు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉందని, ఓడలోకి వెళ్లకుండా తననే అడ్డుకున్నారంటే ఇక్కడ పరిస్థితి అర్థం అవుతోందని తెలిపారు.