అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల డిగ్రీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. యూజీ విద్యార్థులు త్వరలో డిగ్రీ కోర్సుల వ్యవధిని తగ్గించుకునే, పొడిగించుకునే ఆప్షన్‌ను పొందుతారని యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ తెలిపారు. యూజీ విద్యార్థులకు తమ డిగ్రీ ప్రోగ్రామ్‌ల వ్యవధిని వారి అభ్యాస సామర్థ్యం ఆధారంగా తగ్గించడం లేదా పొడిగించే విధంగా ఉన్నత విద్యా సంస్థలు త్వరలో ఒక ఆప్షన్‌ను తీసుకురానున్నట్లుగా పేర్కొన్నారు.
“విద్యార్థులు వారి అభ్యాస సామర్థ్యాల ఆధారంగా వారి డిగ్రీ కోర్సు వ్యవధిని తగ్గించడం, పొడిగించుకునే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. యాక్సిలరేటెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ (ఏడీపీ) ద్వారా ప్రతి సెమిస్టర్లో అదనపు క్రెడిట్స్‌ను సంపాదించడం ద్వారా తక్కువ సమయంలో మూడు లేదా నాలుగేళ్ల డిగ్రీ కోర్సును పూర్తి చేయవచ్చు. అయితే ఎక్స్టెండెడ్ డిగ్రీ ప్రోగ్రామ్(ఈడీపీ)తో డిగ్రీ కాలవ్యవధిని పెంచుకోవచ్చు” అని తెలిపారు.
“ప్రతి సెమిస్టర్లో తక్కువ క్రెడిట్స్ వచ్చినవారికి ఈ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఏడీపీ, ఈడీపీ ప్రోగ్రామ్‌లకు విద్యార్థుల అర్హతను అంచనా వేయడానికి ఉన్నత విద్యాసంస్థలు కమిటీలను ఏర్పాటు చేస్తాయి. ఈ డిగ్రీలతో అన్ని ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సాధారణ డిగ్రీల్లానే వీటికి విలువ ఉంటుంది.” అని యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ తెలిపారు.
అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు మొదటి లేదా రెండో సెమిస్టర్ చివరలో ఏడీపీని ఎంచుకునే అవకాశం ఉంటుందని యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ తెలిపారు. ఆ తర్వాత ఏడీపీ ప్రోగ్రామ్‌ను ఎంచుకోలేరని పేర్కొన్నారు.
“ఏడీపీని ఎంచుకునే విద్యార్థులు ప్రతి సెమిస్టర్లో అదనపు క్రెడిట్లను పొందాలి. విద్యార్థులు మొదటి సెమిస్టర్ తర్వాత ఏడీపీలో చేరినట్లయితే, రెండో సెమిస్టర్ నుంచి అదనపు క్రెడిట్స్‌ను సాధించాలి. రెండో సెమిస్టర్ తర్వాత ఏడీపీలో చేరినట్లయితే, మూడో సెమిస్టర్ నుంచి అదనపు క్రెడిట్‌ను సాధించాల్సి ఉంటుంది. 3 లేదా 4 ఏళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లో కోర్సును గరిష్ఠంగా రెండు సెమిస్టర్ల వరకు పొడిగించుకోవచ్చు.” అని ఆయన వివరించారు.
ఉన్నత విద్యాసంస్థలు ఎంచుకున్న వ్యవధిలో డిగ్రీ ప్రోగ్రామ్ పూర్తి చేసిన స్టూడెంట్స్‌కు డిగ్రీలు అందించవచ్చని యూజీసీ చీఫ్ తెలిపారు. డిగ్రీ సర్టిఫికెట్ కోసం కోర్సు పూర్తి కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అయితే వేగవంతమైన, పొడిగించిన డిగ్రీల కోసం విద్యార్థి స్వీయ నియంత్రిత నోటు రాయాల్సి ఉంటుందని వెల్లడించారు.
More Stories
లింగాయత్‌ల కోటా పోరుపై పోలీసుల లాఠీచార్జి
ఎస్ఎం కృష్ణ మృతిపట్ల ప్రధాని, చంద్రబాబు సంతాపం
బొగ్గు స్థానంలో క్లీన్ ఎనర్జీ సాధ్యమా?