గౌతం అదానీపై ముడుపులు నేరాభియోగాలు లేవు

గౌతం అదానీపై ముడుపులు నేరాభియోగాలు లేవు
* అమెరికా కేసుతో 55 బిలియన్ డాలర్ల నష్టం
అదానీ గ్రూపు చైర్మెన్ గౌతం అదానీ, ఆయ‌న మేన‌ల్లుడు సాగ‌ర్ అదానీ, సీనియ‌ర్ ఎగ్జ‌క్యూటివ్ వినీత్ జైన్‌లపై అమెరికాలో ఎటువంటి లంచం నేరారోప‌ణ‌లు లేవ‌ని ఆ గ్రూపు త‌న ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టం చేసింది. మీడియాలో వ‌స్తున్న క‌థ‌నాలు అవాస్త‌వ‌మ‌ని అదానీ గ్రీన్ సంస్థ పేర్కొన్న‌ది. తాజాగా ఇచ్చిన స్టాక్ ఎక్స్‌చేంజ్ ఫైలింగ్‌లో ఈ విష‌యాన్ని ఆ సంస్థ వెల్ల‌డించింది. 
 
అమెరికాలోని ఫారిన్ క‌ర‌ప్ష‌న్ ప్రాక్టీసెస్ యాక్టును గౌతం అదానీ ఉల్లంఘించిన‌ట్లు వ‌చ్చిన ఆరోప‌ణ‌లు నిజం కాదు అని అదానీ గ్రీన్ ఎన‌ర్జీ సంస్థ తెలిపింది. అదానీ గ్రూపు డైరెక్ట‌ర్ల‌పై మూడు నేరాభియోగాలు ఉన్నాయని కంపెనీ స్పష్టత ఇచ్చింది. అదానీ గ్రూపు స‌భ్యుల‌పై అమెరికా న్యాయ‌శాఖ మొత్తం అయిదు ఆరోప‌ణ‌లు చేసింద‌ని, కానీ దాంట్లో మొద‌టి, అయిద‌వ నేరాభియోగాల్లో గౌతం అదానీ, సాగ‌ర్ అదానీ, వినీత్ జైన్ లేర‌ని సంస్థ వెల్ల‌డించింది.
 
ద్రవ్య జరిమానా లేదా జరిమానాతో శిక్షించదగిన నేరాలకు సంబంధించి వారిపై అభియోగాలు మోపిన్నట్లు తెలిపారు. “గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్ లపై అమెరికా కోర్టు నేరారోపణలో లేదా అమెరికా ఎస్ఈసి సివిల్ ఫిర్యాదులో పేర్కొన్న గణనలలో  ఎఫ్ సి పి ఎ  ఎటువంటి ఉల్లంఘనకు సంబంధించి అభియోగాలు మోపబడలేదు.” అని వివరణ ఇచ్చారు. 
 
ఈ డైరెక్టర్లపై క్రిమినల్ నేరారోపణలో మూడు ఆరోపణలపై అభియోగాలు మోపారు.  అవి (i) ఆరోపించిన సెక్యూరిటీల మోసం కుట్ర, (ii) ఆరోపించిన వైర్ ఫ్రాడ్ కుట్ర , (iii) ఆరోపించిన సెక్యూరిటీల మోసం” అని తెలిపారు. కాగా, అదానీ గ్రూప్ అన్ని ఆరోపణలను ఖండించింది. తమను తాము రక్షించుకోవడానికి సాధ్యమైన అన్ని చట్టపరమైన మార్గాలను తీసుకుంటామని తెలిపింది.

 
కాగా, అమెరికా అవినీతి ఆరోపణలతో దాదాపు 55 బిలియన్‌ డాలర్ల నష్టాన్ని ఎదుర్కొన్నట్లు అదానీ గ్రూప్‌ బుధవారం ప్రకటించింది. ఆరోపణలను ఖండిస్తున్నట్లు తెలిపింది. అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టీస్‌ (యుఎస్‌ డిఒజె) నేరారోపణలను ప్రకటించినప్పటి నుండి తమ 11 లిస్టెడ్‌ కంపెనీలలో దాని మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌లో సుమారు 55 బిలియన్‌ డాలర్ల నస్టాన్ని చవిచూసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. 
 
నవంబర్‌ 20న అదానీపై ప్రకటించిన ఆరోపణలతో అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొంది. ఈ ఆరోపణలు నిరాధారమనవిగా పేర్కొంటూ తిరస్కరించింది. అంతర్జాతీయ ప్రాజెక్టు రద్దు, ఆర్థికమార్కెట్‌పై ప్రభావం, వ్యూహాత్మక భాగస్వామ్యులు, పెట్టుబడిదారులు, ప్రజల నుండి ఆకస్మిక పరిశీలన వంటి తీవ్రమైన పరిణామాలు ఎదురైనట్లు అదానీ గ్రూప్‌ పేర్కొంది.