కాంగ్రెస్ ను నమ్ముకుని మునుగుతున్నామని కూటమిలో అంతర్మథనం

కాంగ్రెస్ ను నమ్ముకుని మునుగుతున్నామని కూటమిలో అంతర్మథనం
మొన్న లోక్‌సభ, నిన్న హర్యానా, కశ్మీర్‌ ఎన్నికలు, నేడు మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికలు.. అన్నింటిలో ఇండియా కూటమికి ఎదురుదెబ్బలే. కూటమిలో ప్రధాన జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ తమకు ఉపయోగపడక పోగా, దానిని నమ్ముకుని నిండా మునుగుతున్నామని కూటమిలోని పార్టీల్లో అంతర్మథనం ప్రారంభమైంది.
 
‘కూటమిలో కాంగ్రెస్‌ ఒక పనికిమాలిన పార్టీ’ అన్న భావాన్ని కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారు. మహా నౌకలాంటి కాంగ్రెస్‌ తమను ఒడ్డుకు చేరుస్తుందని నమ్మామని, అయితే దానికి భారీ చిల్లుపడిందని, ఒడ్డుకు చేర్చడం మాట దేవుడెరుగు నిండా ముంచుతున్నదని ఆ పార్టీలు ఇప్పుడు పునరాలోచనలో పడుతున్నాయి.

మరీ ముఖ్యంగా ఎన్నికల్లో గెలిచే సత్తా లేని రాహుల్‌ గాంధీ ట్రాక్‌ రికార్డును వారు ఇప్పుడు వేలెత్తి చూపుతున్నారు. మిగిలిన రాష్ర్టాల మాదిరిగా కాకుండా మహారాష్ట్రలో కాంగ్రెస్‌ దూకుడైన తీరుతో బలమైన వ్యవస్థగా ఉంది. అందుకే ఆ పార్టీ నేతలు ఈ ఎన్నికల్లో తమకు ఎక్కువ సీట్లు కావాలని పట్టుబట్టి మరీ సాధించుకున్నారు. 

ఎన్నికలైన తర్వాత మహావికాస్‌ అఘాడీ అధికారంలోకి వస్తుందని, తామే సీఎం పీఠం చేపడతామంటూ హడావిడి కూడా చేశారు. ఇది కూటమిలోని మిగిలిన పార్టీలకు చికాకు కూడా కలిగించింది. ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు సంబంధం లేని సమస్యలు లేవనెత్తుతూ బీజేపీ పక్షాలపై కాంగ్రెస్‌ చేస్తున్న విమర్శలపై కూటమిలోని ఉద్ధవ్‌ ఠాక్రే, శరద్‌ పవార్‌లు అభ్యంతరం చెప్పారు. 

ఉదాహరణకు వీరసావర్కర్‌పై కాంగ్రెస్‌ చేసిన విమర్శలు ఇద్దరు నేతల మనసులను గాయపరిచాయి. దీనిపై రాహుల్‌పై ఒత్తిడి తెచ్చి ఆ విమర్శలను ఆపించినా, అప్పటికే నష్టం జరిగిపోయింది. దానిని బీజేపీ అస్త్రంగా వినియోగించి ఎంవీఏను తీవ్రంగా దెబ్బ తీసింది. 

అలాగే అదానీపై రాహుల్‌ నిత్యం విమర్శలు చేయడంపై కూడా శరద్‌పవార్‌ అభ్యంతరం చెప్పారు. స్థానిక సమస్యలను ప్రస్తావించకుండా సామాన్యులకు అర్థం కాని అంశాలపై విమర్శలు చేయవద్దని వారు వారించారు. కాంగ్రెస్‌తో వెళ్తేఎన్నికల్లో మునుగుడు ఖాయమని ఇప్పటికే ఆమ్‌ ఆద్మీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలు నిశ్చయాభిప్రాయంతో ఉన్నాయని, అది గ్రహించక తాము దానితో వెళ్లి మునిగామని పలువురు ఎంవీఏ నేతలు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు.

 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ఘోర ఓటమిపై ఆ పార్టీలు నిందించుకుంటున్నాయి.  ఇండియా కూటమిలోని మిత్రపక్షాలు ఒకరికొకరు సహకరించుకోలేదని కర్ణాటక హోం మంత్రి, కాంగ్రెస్ ఎన్నికల ఇంచార్జ్‌ జీ పరమేశ్వర్ ఆరోపించారు. ఇబ్బందికరమైన ఓటమికి కారణం కూటమి భాగస్వాముల మధ్య సహకారం, సమన్వయం లేకపోవడమేనని విమర్శించారు. 

కాగా, పలు నియోజకవర్గాల్లో శివసేన (యూబీటీ)కి కాంగ్రెస్ పూర్తిగా మద్దతివ్వలేదని పరమేశ్వర్ తెలిపారు. ఉద్ధవ్ ఠాక్రే పార్టీ కూడా అదే విధంగా వ్యవహరించిందని, శరద్‌ పవార్‌ ఎన్సీపీ వర్గం కూడా తమ సహకారం ఇవ్వలేదన్నది స్పష్టంగా కనిపించిందని పేర్కొన్నారు.