అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ ఫస్ట్‌

అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ ఫస్ట్‌
దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రధాన నగరాల్లో గాలి కాలుష్యం తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. ఢిల్లీ, యూపీ, నోయిడా, లక్నో సహా పలు ప్రధాన నగరాల్లో గాలి నాణ్యత సూచీ క్షీణించింది. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌  ఏకంగా 400కుపైనే నమోదవుతోంది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గురువారం వాయు నాణ్యత సూచీ 400 దాటడంతో గ్యాస్‌ ఛాంబర్‌గా మారింది. ఫలితంగా జనం ఊపిరిపీల్చుకునేందుకు తిప్పలు పడుతున్నారు.

ఢిల్లీతో పాటు ఐదు ప్రధాన నగరాల్లో గురువారం గాలి నాణ్యత పేలవమైన స్థాయిలో నమోదైంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి డేటా ప్రకారం అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 379తో తొలి స్థానంలో నిలిచింది. రాజధానిలోని పలు ప్రాంతాల్లో ఏక్యూఐ లెవల్స్‌ 400 కూడా దాటాయి. 

ఇక ఢిల్లీ తర్వాత జైపూర్‌, ఛండీగఢ్‌ నగరాల్లో గాలి నాణ్యత పూర్‌ కేటగిరీలో నమోదైంది. ఇక్కడ వరుసగా ఏక్యూఐ లెవల్స్‌ 235, 233గా నమోదయ్యాయి. ఐజ్వాల్‌, గువాహటిలో అత్యల్ప కాలుష్య స్థాయిలు ఉన్నాయి. ఇక్కడ ఏక్యూఐ రీడింగ్‌లు వరుసగా 32, 42గా నమోదయ్యాయి. ఇక్కడి ప్రజలు స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ, ఆరోగ్యకరంగా జీవిస్తున్నారు.

ఢిల్లీలో ఏక్యూఐ లెవల్స్‌ 379తో చాలా పేలవమైన కేటగిరీలో నమోదైంది. ఆ తర్వాత జైపూర్‌లో 235, ఛండీగఢ్‌లో 233, చెన్నైలో 223, భోపాల్‌లో 208, పాట్నా 205తో పూర్‌ కేటగిరీలో ఉన్నాయి. కోల్‌కతాలో 189, లక్నోలో 187, అహ్మదాబాద్‌లో 164, ముంబైలో 154, భువనేశ్వర్‌లో 150, హైదరాబాద్‌లో 122, రాయ్‌పూర్‌లో 116, బెంగళూరులో 104గా ఏక్యూఐ లెవల్స్‌ నమోదయ్యాయి. 

ఇది మితమైన గాలి నాణ్యతను సూచిస్తుంది. తిరువనంతపురంలో గాలి నాణ్యత 57తో సంతృప్తికరంగా ఉంది. ఆ తర్వాత ఐజ్వాల్‌లో గాలి నాణ్యత సూచీ 32, గువాహటిలో 42 వద్ద నమోదైంది. దీన్ని మంచి కేటగిరీ కింద భావిస్తారు. 

గాలి నాణ్యత సున్నా నుంచి 50 మధ్య ఉంటే బాగా ఉన్నట్టు అర్ధం. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరమైనదని, 101 నుంచి 200 వరకు ఉంటే మితమైన నాణ్యత, 201 నుంచి 300 ఉంటే తక్కువ నాణ్యత అని, 301 నుంచి 400 వరకు ఉంటే చాలా పేలవమైనదని, 401 నుంచి 500 ఉంటే ప్రమాదకరస్థాయిగా పరిగణిస్తారు. 

అయితే, గత కొంతకాలంగా ఢిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకరంగా మారుతోన్న విషయం తెలిసిందే. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలపెట్టడానికి తోడు.. మంచు రాజధానిని కమ్మేయడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. కాలుష్య నియంత్రణకు పాలకులు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం ఉండటం లేదు. రోజురోజుకూ గాలి నాణ్యత క్షీణిస్తోంది. ఈ కారణంగా నగర వాసులు తీవ్ర అనారోగ్య సమసల్యకు గురికావాల్సి వస్తోంది.

సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ డేటా ప్రకారం గురువారం ఉదయం 8 గంటలకు ఢిల్లీలోని ఆనంద్‌ విహార్‌లో ఏక్యూఐ 405గా రికార్డయ్యింది. ముండ్కాలో 413, బవానాలో 418, అశోక్ విహార్‌లో 414, ఐటీవోలో 355, జహంగీర్‌పురి 435, రోహిణి 407 రికార్డయ్యింది. నజాఫ్‌గఢ్ 366, ఆర్‌కేపురం 387, పంజాబీ బాగ్ 407, సోనియా విహార్ 394, ద్వారకా సెక్టార్-8 వద్ద 401 నమోదైంది.