మహారాష్ట్ర ఎన్నికల్లో బిట్‌కాయిన్‌ దుమారంలో సుప్రియా సూలే

మహారాష్ట్ర ఎన్నికల్లో బిట్‌కాయిన్‌ దుమారంలో సుప్రియా సూలే
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో నిధుల కోసం ఎన్సీపీ- ఎస్పీ అధినేత సుప్రియా సూలేతో పాటు మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే  బిట్‌కాయిన్‌లను దుర్వినియోగం చేశారని చెలరేగిన ఆరోపణలు పెను దుమారం రేపాయి.
 
పూణేకు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి రవీంద్రనాథ్ పాటిల్ 2018 క్రిప్టోకరెన్సీ ఫ్రాడ్ కేసుకు సంబంధించిన బిట్‌కాయిన్‌లను దుర్వినియోగం చేయడంలో వారి పాత్రపై మంగళవారం ఆరోపణలు చేయడం, ఆ మరుసటి రోజు ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లోని సారథి అసోసియేట్స్ సంస్థ ఉద్యోగి గౌరవ్ మెహతా (కేసులో పాటిల్ కూడా కీలక సాక్షిగా పేర్కొన్నాడు) నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించడంతో కలకలం రేపింది.
 

అయితే, ఈ ఆరోపణలను సుప్రియా సూలే తీవ్రంగా ఖండిస్తూ బిట్‌ కాయిన్ల గురించి ప్రచారంలో ఉన్న వాయిస్‌ నోట్స్‌, సందేశాలన్నీ నకిలీవని కొట్టిపారవేసారు. అదంతా బిజెపి కుట్ర అని విమర్శించారు. దీనిపై ఇప్పటికే సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశానని, తనపై అసత్య ఆరోపణలు చేసినందుకు బిజెపి ఎంపీ సుధాంశు త్రివేదికి పరువునష్టం దావా నోటీసులు పంపానని  ఆమెవెల్లడించారు. ఈ విషయంపై ఎక్కడ సమాధానం చెప్పేందుకైనా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.ఈ ఆరోపణలపై ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ మాట్లాడుతూ తన సోదరి సుప్రియా వాయిస్‌ ఎలా ఉంటుందో తనకు తెలుసునని చెప్పారు. ఆడియో క్లిప్‌లలో ఆమె వాయిస్‌ డబ్బింగ్‌ చేసినట్లుగా లేదని, దీనిపై విచారణకు మద్దతిస్తున్నానని పేర్కొన్నారు. మరోవైపు ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్‌ శరద్ పవార్ తన కుమార్తెకు మద్దతు ఇస్తూ ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయగల సామర్థ్యం కేవలం బీజేపీకి మాత్రమే ఉందని విమర్శించారు.

మంగళవారం బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది మీడియాతో మాట్లాడుతూ పలు ఆడియో క్లిప్‌లను వినిపించారు. సుప్రియా సూలే, మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే, మాజీ పోలీసు కమిషనర్‌, ఇతరులతో కలిసి అక్రమ బిట్‌కాయిన్‌ లావాదేవీలకు పాల్పడ్డారని ఆరోపించారు. మాజీ పోలీసు అధికారి, డీలర్‌కు మధ్య జరిగిన చాట్‌ల స్క్రీన్‌షాట్‌లను కూడా చూపించారు. ఎన్నికల ఫలితాలను ప్రతిపక్ష మహా వికాస్ అఘాడికి అనుకూలంగా మార్చడానికి కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు.

 పాటిల్ మంగళవారం ఓ వార్త సంస్థతో మాట్లాడుతూ, ఆ ఇద్దరు రాజకీయ నేతలు ఉపయోగిస్తున్న బిట్‌కాయిన్‌ల దుర్వినియోగం వెనుక పూణేలోని అప్పటి పోలీస్ కమిషనర్ అమితాబ్ గుప్తా, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ భాగ్యశ్రీ నౌటేక్‌లను కీలక నిందితులుగా పేర్కొంటూ గౌరవ్ మెహతా తనకు అందించిన వాయిస్ నోట్ ను ఆధారంగా చూపారు.
 
 “2018లో ఒక కేసును దర్యాప్తు చేయడానికి నా కంపెనీ నన్ను క్రిప్టోకరెన్సీ నిపుణుడిగా పిలిచింది. మోసం ఆరోపణలతో 2022లో ఆ కేసులో నన్ను అరెస్టు చేశారు. విచారణ తర్వాత నేను 14 నెలలు జైలులో గడిపాను. ఆ సమయంలో, నేను ఏమి జరిగిందో అని ఆలోచిస్తున్నాను. కేసు ఏమిటి, నేను ఎందుకు ట్రాప్ అయ్యానో అని సత్యాన్ని కనుగొనే పనిలో ఉన్నాము” అని తెలిపారు. 
 
“సుప్రియా సూలే, నానా పటోలే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బిట్‌కాయిన్‌లను ఉపయోగిస్తున్నారని అతను నాకు చెప్పాడు. అంతేకాకుండా, లోక్‌సభ ఎన్నికల సమయంలో మహారాష్ట్రలో నిధుల కోసం అదే బిట్‌కాయిన్ డబ్బును కూడా ఉపయోగించారని మాజీ ఐపిఎస్ అధికారి పేర్కొన్నారు. సీనియర్ ఎంవిఎ నాయకుడిపై తాను చేసిన ఆరోపణలు సాక్షి గౌరవ్ మెహతా నుండి అందుకున్న వాయిస్ నోట్స్ ఆధారంగా ఉన్నాయని పాటిల్ వెల్లడించారు.
 
“ఎన్నికలకు నిధులు అవసరమని, బిట్‌కాయిన్‌లను ఎన్‌క్యాష్ చేయమని గౌరవ్‌ను సుప్రియా సూలే మూడు వాయిస్‌మెయిల్ సందేశాలను పంపారు. విచారణల గురించి ఆందోళన చెందవద్దని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని చూసుకుంటామని ఆమె హామీ ఇవ్వడం కూడా వినికిడి,” అని పాటిల్ ఆరోపించారు.
 
 “మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే బిట్‌కాయిన్ డబ్బును ఉపయోగిస్తున్నారని అతను (గౌరవ్ మెహతా) ఇంకా చెప్పాడు. అమితాబ్ గుప్తా దిశలో, అతను (గౌరవ్ మెహతా) అనేకసార్లు దుబాయ్‌కి వెళ్లి బిట్‌కాయిన్‌ను నగదుగా మార్చుకున్నాడు. మహారాష్ట్ర ఎన్నికల్లో నగదు వినియోగిస్తున్నారు. అతను (గౌరవ్ మెహతా) తనకు వాట్సాప్‌లో వచ్చిన కొన్ని వాయిస్ నోట్‌లను నాకు పంపాడు” అని ఆయన వివరించారు.