దివిసీమలో ఆ రెండేళ్లు ఎప్పటికి గుర్తుండిపోతాయి!

దివిసీమలో ఆ రెండేళ్లు ఎప్పటికి గుర్తుండిపోతాయి!

* హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ దివిసీమ ఉప్పెన పునరావాస స్మృతులు

అది ఒక అకాల రాత్రి. దాదాపు 47 సంవత్సరాల కిందట ప్రకృతి చేసిన విలయతాండవం. సుమారుగా 10 వేల మంది ప్రాణాలు బలిగొని , లక్షలాది మంది జీవితాలను నిర్వాసితులుగా మార్చి, దాదాపు 20 వేల ఎకరాల్లో పంట  నష్టం జరిపి, కొన్ని కోట్లాది రూపాయల నష్టానికి దివిసీమను గురిచేసిన ఆ గాయాన్ని ప్రజలు ఇంకా మర్చిపోనేలేదు.

ఇప్పటికి కూడా 19 నవంబర్ వస్తే చాలు ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని గజ గజ వణుకుతారంటే అతిశేయోక్తి కాదు. ఈ మహా ప్రళయం ముంచెత్తిన గ్రామాలను నేను ఒక స్వయంసేవక్ గా, అందరం ఒక బృందంగా ఏర్పడి ఆపదలో ఉన్నవారికి సాయం చేద్దామని ముందుకు వెళ్ళాం.

 కానీ అక్కడ ఎక్కడ చుసిన శవాల గుట్టలు కుప్పలు తెప్పలుగా మాకు కనిపించాయి. ఆ శవాలని దహనం చెయ్యడానికి మేము ఒక శవసేన పేరుతో ఒక ప్రత్యేక బృదాన్ని ఏర్పాటుచేసి  దహన కార్యక్రమాలను నిర్వహించాము. ఆ తదుపరి అత్యవసర వంట సామాగ్రి, దుప్పట్లు, మందులు, పుస్తకాలు పెద్దఎత్తున అందించాము. 

సముద్రం పక్కన ఉన్న గ్రామాల్లో ఉన్న రైతుల  భూముల్లో ఇసుక మెటలను తొలగించి రైతులకి సహాయం అందించి మళ్ళి పంటలు వేసుకునేలా చేసాం. వైద్య సహాయం కోసం ఏర్పాట్లు చేసాము. వందల సంఖ్యలో ఉన్న అనాథ పిల్లలని దత్తత తీసుకోని వారి బాగోగులను చూసుకోవడానికి భారతీయ అనాథ శరణాలయం ప్రారంభించాము. 

పర్ర చివర  అనే గ్రామం లో  తత్కాలిక గృహ సముదాయాన్ని ఏర్పాటు చేసాము. అలాగే సముద్ర మట్టానికి అతి దగ్గరలో  ఉన్న మూలపాలెం అనే గ్రామాన్ని పునర్నిర్మాణం చేసి పక్క ఇండ్లు, పాఠశాల, పోస్ట్ ఆఫీస్ , వైద్యశాల ఏర్పాటు చేసాం.  మూలపాలెం గ్రామ ప్రారంభోత్సవానికి అప్పటి  ముఖ్యమంత్రి  చెన్నారెడ్డి ముఖ్య అతిథిగా,  అప్పటి కేంద్ర విదేశాంగ మంత్రి అటల్ బిహారి వాజపేయి గౌరవ అతిథిగా వచ్చి ప్రజలకు భరోసానివ్వడం నా జీవితం లో మరిచిపోలేని ఒక ఘట్టం.

ఆ రకంగా కార్యకేత్రంలో  మండలి వెంకట  కృష్ణారావు ఎంతగానో  కష్టపడి అనేక సేవలు అందించారు. బాధల్లో ఉన్నవారిని ముందు మనమే వెళ్లి ఆదుకోమని వారు ఎప్పుడు చెప్పేవారు.  అనేక సేవ సంస్థల్ని వారు అనుసంధానించారు. నిస్వార్థసేవతో పనిచేసారు. వారి వారసత్వాన్ని వారి తనయుడు మండలి బుద్ధా ప్రసాద్  కొనసాగిస్తున్నారు.

నేటి అధునాతన సాంకేతికతతో ఇలాంటి  ప్రకృతి విలయాలను ముందుగా గుర్తించి తీరా ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడం , అలాగే ముందస్తు జాగ్రత్తలను, హెచ్చరికలను జారీచేస్తూ, ప్రజల ప్రాణ ఆస్తి నష్టాలను వీలైనంత కనిష్ట స్థాయికి తీసుకురావాలని  నేను ప్రభుత్వాలను కోరుతున్నాను. నేను దివిసీమ లో ఉన్న 2 సంవత్సరాల కాలం నాకు ఎప్పటికి గుర్తుండిపోతాయి.