ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 2027లోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తామనే ప్రచారంలో వాస్తవం లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు. నిధుల విడుదల విషయంలో కేంద్రం కూడా సుముఖంగా ఉందని, నిపుణులు, సాంకేతిక సిబ్బంది సూచనలు, సలహాలతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు.
2026 మార్చిలోపు కొత్త డయాఫ్రమ్ వాల్ పూర్తవుతుందని తెలిపారు. జనవరి నుంచి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రారంభమవుతుందని చెప్పారు. శాసనసభలో జలవనరులపై జరిగిన చర్చలో పాల్గొన్న చంద్రబాబు, 2014 నుంచి 2019 మధ్య పోలవరం ప్రాజెక్టు కోసం చేసిన కృషిని వివరించారు. అదే సమయంలో 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ సర్కార్ చేసిన విధ్వంసాన్ని ఆధారాలతో సహా వివరించారు.
పోలవరం పూర్తయితే కరవుకు చెక్ పెట్టవచ్చని, ఏపీకి అమరావతి, పోలవరాన్ని రెండు కళ్లుగా భావించానని స్పష్టం చేశారు. పోలవరం ద్వారా నదుల అనుసంధానానికి సంకల్పించామన్న సీఎం, ప్రాజెక్టును జాతీయప్రాజెక్టుగా ప్రకటించారని గుర్తు చేశారు. పోలవరం నిర్మాణం ఆలస్యం అవుతుందని పట్టిసీమ ద్వారా రైతులకు నీళ్లు ఇవ్వాలనుకున్నామని తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టును ఏడాదిలోపు పూర్తిచేసి, రాయలసీమకు నీళ్లిచ్చామని గుర్తు చేశారు.
పోలవరం ప్రాజెక్టు జాప్యం కాకూడదనే నిర్మాణ బాధ్యతలు చేపట్టామని, గత ప్రభుత్వంలోని ఇరిగేషన్ మంత్రికి డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటో తెలియదని ఎద్దేవా చేశారు. 2014-19 మధ్యలో 72 శాతం పోలవరం పనులు పూర్తి చేశామని చెబుతూ టీడీపీ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఇప్పటికే పోలవరం పూర్తయ్యేదని అభిప్రాయపడ్డారు.
టిడిపి ప్రభుత్వంపై కక్షతో గతం ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ఆపేస్తున్నట్లు ప్రకటించిందని ధ్వజమెత్తారు. మూర్ఖత్వం, చేతకానితనం వల్ల గత ప్రభుత్వం ప్రాజెక్టు పనులు ఆపేసిందని, 2014-19 మధ్య తాము పడిన కష్టం, వైఎస్సార్సీపీ వల్ల నాశనమైందని మండిపడ్డారు.
తొందరపాటు తగదని కేంద్రసంస్థ చెప్పినా గత ప్రభుత్వం వినలేదని, పోలవరాన్ని సరిగా పర్యవేక్షించకపోవడంతో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని, ఒక వ్యక్తి దుర్మార్గ ఆలోచనలు రాష్ట్రానికి శాపంగా మారాయని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం నిర్వాకం వల్ల రాష్ట్రానికి రూ.వేల కోట్లు నష్టం వాటిల్లిందని, కేవలం 3.08 శాతమే పోలవరం పనులు చేసిందని తెలిపారు.

More Stories
దుర్గగుడి అభివృద్ధికి త్వరితగతిన మాస్టర్‌ప్లాన్
జిఎస్టి ఆదాయం తగ్గడంపై ఏపీ ఆర్థికశాఖ ఆందోళన
మహిళా క్రికెటర్ శ్రీచరణికి గ్రూప్1 ఉద్యోగం, రూ. 2.5 కోట్ల నగదు