ఆసియా చాంపియ‌న్స్ ట్రోఫీ సెమీఫైన‌ల్‌కు భారత్

ఆసియా చాంపియ‌న్స్ ట్రోఫీ సెమీఫైన‌ల్‌కు భారత్
స్వ‌దేశంలో జ‌రుగుతున్న‌ మ‌హిళ‌ల ఆసియా చాంపియ‌న్స్ ట్రోఫీలో భార‌త మ‌హిళ‌ల హాకీ జ‌ట్టు అద‌ర‌గొడుతోంది. ఇప్ప‌టికే నాలుగు విజ‌యాలు సాధించిన టీమిండియా ఆదివారం జ‌పాన్‌ను చిత్తుగా ఓడించింది. గ్రూప్ ద‌శ ఆఖ‌రి మ్యాచ్‌లో 3-0తో జ‌పాన్‌ను మ‌ట్టిక‌రిపించి గ్రూప్‌లో అగ్ర‌స్థానంలో నిలిచింది. త‌ద్వారా టీమిండియా ద‌ర్జాగా సెమీఫైన‌ల్‌కు దూసుకెళ్లింది. ఫైన‌ల్ బెర్తు కోసం జ‌రిగే పోరులో మ‌ళ్లీ జపాన్‌తోనే భార‌త అమ్మాయిల జ‌ట్టు త‌ల‌ప‌డ‌నుంది.
 
బిహార్‌లోని రాజ్‌గిరి హాకీ స్టేడియంలో భార‌త అమ్మాయిల జ‌ట్టు పంజా విసిరింది. తొలి అర్ధ భాగంలో జ‌పాన్ గోల్‌పోస్ట్‌పై దాడులు చేసింది. అయితే. ప్ర‌త్య‌ర్థి డిఫెండ‌ర్లు స‌మ‌ర్దంగా అడ్డుప‌డ‌డంతో మొద‌టి గోల్ కోసం అర‌గంట ఆగాల్సి వ‌చ్చింది. 37వ నిమిషంలో న‌వ్‌నీత్ కౌర్ బ్యాక్ హ్యాండ్ షాట్ ద్వారా గోల్ సాధించింది. ఆ త‌ర్వాత ఫోర్త్ క్వార్ట‌ర్స్‌లో జ‌పాన్ గోల్ కీప‌ర్‌ను బోల్తా కొట్టిస్తూ దీపిక డ్రాగ్ ఫ్లిక్‌తో జ‌ట్టుకు రెండో గోల్ అందించింది.
 
అంతే.. భార‌త్ ఆధిక్యం రెండుకు చేర‌డంతో జ‌పాన్ అమ్మాయిలు గోల్ కోసం గ‌ట్టిగానే ప్ర‌య‌త్నించారు. కానీ, వాళ్ల‌వ‌ల్ల కాలేదు. ఆలోపే భార‌త అమ్మాయిలు మ‌రో గోల్ సాధించడంతో, 3-0తో టీమిండియా గెలుపొంది 15 పాయింట్లతో ప‌ట్టిక‌లో మొద‌టి స్థానంలో నిలిచింది. వ‌రుస‌గా ఐదు విజ‌యాల‌తో సెమీఫైన‌ల్లో అడుగుపెట్టింది. మ‌రో సెమీఫైన‌ల్లో చైనా, మ‌లేషియా అమీతుమీ తేల్చుకోనున్నాయి.