పారిస్‌ ఒప్పందానికి ధనిక దేశాలు కట్టుబడి ఉండాలి

పారిస్‌ ఒప్పందానికి ధనిక దేశాలు కట్టుబడి ఉండాలి
 
భవిష్యత్తులో ఏర్పడే తీవ్ర వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు 2015లో చేసుకున్న పారిస్‌ ఒప్పందాన్ని కొన్ని ధనిక, అభివృద్ధి చెందిన దేశాలు నిర్వీర్యం చేయడం పట్ల కాప్‌29 శిఖరాగ్ర సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో తమ బాధ్యతలను పలుచన చేయకుండా ఆర్థిక సహాయం అందించి తమ కట్టుబాట్లను గౌరవించాలని భారత్‌ సహా పలు దేశాలు విజ్ఞప్తి చేశాయి. 
 
వాతావరణ మార్పు శిఖరాగ్ర సమావేశం గురువారం నాలుగో రోజుకు చేరుకుంది. కాప్‌ 29 వద్ద చర్చల సమయంలో సంపన్న దేశాలు తమ ఆర్థిక బాధ్యతలను మార్చుకునే ప్రయత్నాలను తిరస్కరించాయి. దీంతో పారిస్‌ 2015 ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేయాల్సిన అవసరాన్ని భారత్‌, చైనా తదితర దేశాలు పునరుద్ఘాటించాయి. 
 
వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన వాతావరణ నిధిపై ముసాయిదా సత్వర కార్యాచరణకు ఏ మాత్రమూ అనువుగా లేదని పలు దేశాలు అభిప్రాయపడ్డాయి. మరింత సమర్ధవంతమైన చర్యలు తీసుకోవడానికి వెసులుబాటు కల్పించేలా కొత్త ఆర్థిక లక్ష్యాలతో ముసాయిదా వుండాలని వర్ధమాన, నిరుపేద దేశాలు భావిస్తున్నాయి. 
 
బుధవారం 34 పేజీలతో వెలువడిన ముసాయిదా తీరుతెన్నులపై లైక్‌ మైండెడ్‌ దెవలపింగ్‌ కంట్రీస్‌ (ఎల్‌ఎండిసి) గ్రూపు, అరబ్‌ గ్రూపు, ఆఫ్రికన్‌ గ్రూపు పెదవి విరిచాయి. అత్యంత తీవ్రంగా వున్న వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనడానికి పేద దేశాలకు సాయపడేందుకు ఇప్పుడే నిధులు అందచేయాలని లేదా తర్వాత కాలంలో మరింత ఎక్కువ మొత్తాలు ఇవ్వాల్సివస్తుందని చర్చల్లో పాల్గొన్న ప్రతినిధులు గురువారం హెచ్చరించారు. 
 
ఏడాదికి లక్ష కోట్ల డాలర్లు వుండాలని ఎల్‌ఎండిసి గ్రూపు సూచించింది. 1.1 ట్రిలియన్ల డాలర్లుగా వుండాలని అరబ్‌ గ్రూపు కోరుతుండగా, 1.3 ట్రిలియన్‌ డాలర్లుగా వుండాలని ఆఫ్రికన్‌ గ్రూపు కోరుతోంది. కాగా ముసాయిదా ప్రక్రియ అంతా అందరినీ అసహనానికి గురి చేసింది. ముసాయిదాను క్లిష్టతరంగా మార్చయడంపై పేద దేశాల ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. 
 
లాటిన్‌ అమెరికా, కరేబియా దేశాల క్లైమేట్‌ ఫైనాన్స్‌ గ్రూపు వ్యవస్థాపకుడు శాండ్రా గుజ్‌మన్‌ లూపా మాట్లాడుతూ, ఈ ముసాయిదాను సరళీకరించడానికి ఇంకా జరగాల్సిన కసరత్తు చాలా వుందన్నారు. ప్రతి ఒక్కరినీ ఇందులో భాగస్వాములు చేస్తున్నట్లుగా హామీ కల్పించాల్సి వుందని, అప్పుడే అర్ధవంతమైన చర్చలు జరుగుతాయని అన్నారు. మరో మూడు రోజుల్లో సదస్సు ముగియనున్న నేపథ్యంలో అందరిలోనూ ఫలితాలపై ఒకరకమైన ఆందోళన నెలకొంది.