హైదరాబాద్ లోనూ అమెరికా అధ్యక్షుడి స్కై స్క్రేపర్స్!

హైదరాబాద్ లోనూ అమెరికా అధ్యక్షుడి స్కై స్క్రేపర్స్!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ భారత్ లో  తన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని విస్తరించేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్‌, నోయిడా, బెంగళూరు సహా మొత్తం ఆరు నగరాల్లో ‘ట్రంప్‌’ బ్రాండ్‌ కింద లగ్జరీ ప్రాజెక్టులను నిర్మించనున్నారు. ముంబయి కేంద్రంగా ఉన్న ట్రైబెకా డెవలపర్స్‌తో కలిసి ఈ నిర్మాణాలను చేపట్టనున్నారు. దీంతో అమెరికా బయట అత్యధికంగా ట్రంప్‌ టవర్లు ఉన్న దేశంగా భారత్ నిలవనుంది.

ట్రైబెకా డెవలపర్స్తో కలిసి ఎనిమిది మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆరు ప్రాజెక్ట్లను నిర్మించనుంది ట్రంప్ సంస్థ. వీటి అమ్మకాల విలువ రూ.15,000 కోట్ల కంటే ఎక్కువే. కాగా, ఇప్పటికే భారత్లోని ముంబయి, కోల్కతా, గురుగ్రామ్, పుణె వంటి నాలుగు నగరాల్లో ట్రంప్‌ టవర్స్‌ ఉన్నాయి. తాజాగా నోయిడా, హైదరాబాద్, బెంగళూరు, ముంబయి, గురుగ్రామ్, పుణెలో టవర్స్ నిర్మిస్తామని ప్రకటించింది. దీంతో భారత్లో ట్రంప్‌ టవర్ల సంఖ్య 10కి చేరనుంది.

ట్రంప్ టవర్స్లో నివాస, వాణిజ్య సముదాయాలు ఉంటాయని ట్రైబెకా డెవలపర్స్ వ్యవస్థాపకుడు కల్పేశ్ మోహతా తెలిపారు. అలాగే గోల్ఫ్ కోర్టులు, విల్లాలు కూడా ఉంటాయని పేర్కొన్నారు. “నోయిడా, హైదరాబాద్, బెంగళూరు, ముంబయి, గురుగ్రామ్, పుణె వంటి నగరాల్లో వ్యాపారాన్ని విస్తరించనున్నాం. ‘ట్రంప్ వరల్డ్ టవర్స్’ పేరిట నిర్మాణాలు ఉంటాయి. అలాగే మొట్టమొదటిసారిగా ట్రంప్ కంపెనీ వాణిజ్య రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది” అని తెలిపారు.

ప్రాజెక్టులో భాగంగా పుణెలో పెద్ద ఆఫీసును కట్టనుంది. ట్రంప్ సంస్థ డిసెంబరులో నాలుగు ప్రాజెక్టులను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే 2025 ప్రారంభంలో వీటిని ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఎరిక్ ట్రంప్ రానున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే ముంబయి, పుణె, గురుగ్రామ్, కోల్కతాలో ఉన్న ట్రంప్ టవర్స్ ధనికులను ఆకర్షించాయి. బాలీవుడ్ తారలు సైతం విలాసవంతమైన భవనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాగే ట్రంప్ టవర్స్ లో 20 శాతం ఎన్నారైలే కొనుగోలు చేశారు.